Telugu Global
Telangana

వైద్య కళాశాలల్లో 1400 పోస్టులను త్వరలో భర్తీ చేస్తాం : మంత్రి హరీశ్ రావు

రాష్ట్ర ప్రజల ఆరోగ్య ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. పేట్లబురుజు ఆసుపత్రి మాదిరిగానే మిగిలిన ఆసుపత్రులన్నీ ఇన్షెక్షన్ కంట్రోల్ కమిటీని ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు.

వైద్య కళాశాలల్లో 1400 పోస్టులను త్వరలో భర్తీ చేస్తాం : మంత్రి హరీశ్ రావు
X

తెలంగాణలోని వైద్య కళాశాలల్లో ఖాళీగా ఉన్న 1400 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను త్వరలోనే భర్తీ చేయనున్నట్లు వైద్యారోగ్య శాఖా మంత్రి టి. హరీశ్ రావు వెల్లడించారు. హైదరాబాద్‌లోని పేట్లబురుజు ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన 'ఇన్‌ఫెక్షన్ ప్రివెన్షన్, ఎర్లీ డిటెక్షన్ అండ్ మేనేజ్‌మెంట్' కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. వైద్య కళాశాలల్లో పోస్టుల భర్తీ పూర్తయితే మరింత మెరుగైన వైద్య సేవలు అందుతాయని అన్నారు.

రాష్ట్ర ప్రజల ఆరోగ్య ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. పేట్లబురుజు ఆసుపత్రి మాదిరిగానే మిగిలిన ఆసుపత్రులన్నీ ఇన్షెక్షన్ కంట్రోల్ కమిటీని ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. ఇక్కడి ఆసుపత్రికి ఎక్కువగా క్రిటికల్ కేసులు వస్తాయి. కాబట్టి మరణాల సంఖ్య పెరుగకుండా చూడాలని అధికారులు, వైద్య సిబ్బందిని మంత్రి కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్ష మంది బాలింతలు, గర్భిణీ స్త్రీలకు న్యూట్రిషన్ కిట్లు ఇవ్వాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు.

ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల రాష్ట్రంలోని ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగిందని మంత్రి హరీశ్ రావు అన్నారు. మెరుగైన వైద్య సేవలు అందించడం కోసం ఎంసీహెచ్ ఆసుపత్రుల సంఖ్యను పెంచుతున్నామన్నారు. వచ్చే నెలలో నిమ్స్‌లో 250 పడకలు, గాంధీలో 200 పడకలతో ఎంసీహెచ్ ఆసుపత్రులను ప్రారంభించనున్నట్లు మంత్రి వెల్లడించారు.

ప్రాథమిక స్థాయిలోనే గర్భిణీ స్త్రీల్లో ఉండే సమస్యలను గుర్తిస్తే.. మరణాల సంఖ్యను తగ్గించవచ్చని మంత్రి అభిప్రాయపడ్డారు. మాతా శిశు మరణాలపై లోతైన విశ్లేషణ జరగాల్సిన అవసరం ఉందని మంత్రి చెప్పారు.


First Published:  20 Feb 2023 10:27 AM GMT
Next Story