నెరవేరిన డీఎస్సీ-2008 బాధితుల 14 ఏండ్ల కల
బాధితులకు కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇవ్వడానికి రాష్ట్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం మేరకు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ
డీఎస్సీ-2008 బాధితుల ఏండ్ల నాటి ఎదురుచూపులకు పాఠశాల విద్యాశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నికలకు ముందు డీఎస్సీ-2008 బాధితులకు న్యాయం చేస్తామన్న హామీ మేరకు ఈ ఏడాది ఫిబ్రవరిలో రాష్ట్ర క్యాబినెట్ వారికి ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నది. మంత్రివర్గ నిర్ణయం మేరకు బాధితులకు కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు తెలిపింది. దీనికోసం ఈ నెల 27 నుంచి అక్టోబర్ 5 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహిస్తున్నట్లు విద్యాశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2008 డీఎస్సీలో 30 శాతం కోటాతో నష్టపోయిన అభ్యర్థుల జాబితాను ఉమ్మడి జిల్లాల వారీగా డీఈవోలకు పంపినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వివరాలను విద్యాశాఖ వెబ్‌సైట్‌లోనూ పొందుపరిచింది. హైదరాబాద్ మినహా మిగతా ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో సర్టిఫికెట్ నిర్వహించనున్నది. ఈ సమయంలోనే కాంట్రాక్ట్ ఉద్యోగాలకు అంగీకరిస్తున్నట్లు సమ్మతి పత్రం సమర్పించాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అభ్యర్థుల తమ విద్యార్హతకు సంబంధించిన జిరాక్స్ పత్రాలను గెజిటెడ్ అధికారితో సంతకం చేయించాలి. డీఈవోలు ఈ పత్రాలను పరిశీలించిన అనంతరం ఎవరికి ఉద్యోగాలు ఇవ్వవచ్చో, ఎవరికి ఇవ్వరాదో సూచిస్తూ అక్టోబర్ 6న నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా విద్యాశాఖ సేకరించిన పూర్తి జాబితాను క్యాబినెట్ సబ్ కమిటీ ముందు పెట్టనున్నది. కమిటీ ఆమోదం తర్వాత అభ్యర్థులకు పోస్టింగ్ ఇచ్చే అవకాశం ఉన్నది. 30 శాతం కోటాతో రాష్ట్రవ్యాప్తంగా 2,367 మంది అభ్యర్థులు నష్టపోయినట్లు విద్యాశాఖ ఇప్పటికే గుర్తించింది.
ఇదీ డీఎస్సీ-2008 కథ!
2008లో నాటి ప్రభుత్వం మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎస్జీటీ ఉద్యోగాలకు బీఈడీ, డీఈడీ అభ్యర్థులు అర్హులని పేర్కొన్నది. అయితే ఆ తర్వాత ఎస్జీటీ పోస్టులో 30 శాతం డీఈడీ అభ్యర్థులకు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో వివాదం చెలరేగింది. ప్రభుత్వ ఉత్తర్వులను సవాల్ చేస్తూ బీఈడీ అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నోటిఫికేషన్ ప్రకారమే ఫలితాలు విడుదల చేసింది. కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభించింది. అయితే డీఈడీ అభ్యర్థులు పరిపాలన ట్రిబ్యునల్‌ను ఆశ్రయించగా.. 30 శాతం కోటా ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కథ మళ్లీ మొదటికి వచ్చి కౌన్సిలింగ్ ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో మెరిట్ లిస్ట్‌లో ఉండి, 30 శాతం కోటా వల్ల నష్టపోయిన బీఈడీ అభ్యర్థులు కోర్టు తలుపు తట్టారు. నాటి నుంచి 14 ఏండ్లుగా ఈ అంశం కోర్టులు, ప్రభుత్వాల చుట్టూ తిరుగుతూనే ఉన్నది. ఎన్నికల సమయంలోనే డీఎస్సీ 2008 బాధితుల ఆవేదన అంశం పత్రికల్లో కనిపించేది. తాము అధికారంలోకి రాగానే సమస్యను పరిష్కరిస్తామని అనే ప్రభుత్వాలు హామీ ఇచ్చాయి. కానీ వారి నిరీక్షణ ఫలించలేదు. రెండేండ్ల కిందట ఏపీలో వైసీపీ ప్రభుత్వం డీఎస్సీ-2008 బాధితులకు కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇచ్చింది. తెలంగాణలోనూ బాధితులకు ఉద్యోగాలు ఇవ్వాలని రాష్ట్ర హైకోర్టు ఈ ఏడాది ఫిబ్రవరిలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
కోర్టులు, ప్రభుత్వాల చుట్టూ తిరిగిన బాధితులకు ఊరట
ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఫిబ్రవరి 24న మంత్రివర్గ సమావేశంలో డీఎస్సీ-2008 బాధితులకు ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నది. విధివిధానాలను ఖరారు చేయడానికి క్యాబినెట్ సబ్ కమిటీకి అప్పగించింది. సబ్ కమిటీ నిర్ణయం మేరకు తాజాగా విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా డీఎస్సీ-2008 బాధితులు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. తమకు న్యాయం చేయాలని 2009 నుంచి కోర్టులు, ప్రభుత్వాల చుట్టూ తిరుగుతున్నామన్నారు. పద్నాలుగు సంవత్సరాల తమ కల నెరవేరుతున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు.