Telugu Global
Telangana

హైదరాబాద్‌లో 14నెలల చిన్నారికి కరోనా

దేశవ్యాప్తంగా వారం రోజులుగా కరోనా తీవ్రత పెరుగుతోంది. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు 24 గంటల్లో దేశవ్యాప్తంగా 640 కొత్త కేసులు నమోదయ్యాయి.

హైదరాబాద్‌లో 14నెలల చిన్నారికి కరోనా
X

కరోనా వైరస్ మళ్లీ ఆందోళన కలిగిస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. హైదరాబాద్‌ నీలోఫర్‌ ఆస్పత్రిలో ఇద్దరు చిన్నారులకు కరోనా సోకింది. ఇందులో 14నెలల బాబు కూడా ఉన్నాడు. జ్వరం, శ్వాస పీల్చుకునేందుకు ఇబ్బంది పడటంతో తల్లిదండ్రులు చిన్నారిని ఆస్పత్రిలో చేర్పించారు. దీంతో ఆ చిన్నారికి పాజిటివ్‌గా తేలింది. చిన్నారి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని డాక్టర్లు తెలిపారు. ఐసోలేషన్‌ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

తెలంగాణలో కరోనా సోకిన వారి సంఖ్య 20కి పెరిగింది. ఇందులో హైదరాబాద్‌లోనే 14మంది ఉన్నారు. నిన్నటి వరకూ కరోనా కేసులే లేని ఏపీలోనూ తాజాగా 3 కేసులు నమోదయ్యాయి. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో తొలి కోవిడ్ కేసు నమోదైంది. 85 ఏళ్ల వృద్ధురాలికి కోవిడ్ సోకింది. అప్రమత్తమైన వైద్యాధికారులు శాంపిల్‌ను జీనోమ్ సీక్వెన్స్ ల్యాబ్‌కు పంపారు. కరోనా కేసుల నేపథ్యంలో సీఎం జగన్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. టెస్టుల సంఖ్య పెంచాలని, వైరస్ నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

దేశవ్యాప్తంగా వారం రోజులుగా కరోనా తీవ్రత పెరుగుతోంది. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు 24 గంటల్లో దేశవ్యాప్తంగా 640 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 2,997కు పెరిగింది. కరోనాతో మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. దేశవ్యాప్తంగా నమోదయిన మొత్తం కేసుల్లో దాదాపు 80 శాతం కేరళలోనే ఉన్నాయి. 4 రోజులుగా కేరళలో రోజువారీ కేసులు వందల్లోనే నమోదవుతున్నాయి. కేరళలో ప్రస్తుతం 2,606 కోవిడ్ యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. కేరళ తరువాత కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి,మహారాష్ట్రలో ఎక్కువగా యాక్టివ్ కేసులు ఉన్నాయి.

JN.1 కొత్త వేరియంట్‌ మూడు రాష్ట్రాలకు విస్తరించింది. కేరళ, మహారాష్ట్ర, గోవాలో కొత్త వేరియంట్ కేసులు నమోదయ్యాయి. డిసెంబర్ 31 వేడుకలు, ఆ తర్వాత వరుసగా పండుగలు.. ఈ నేపథ్యంలో కరోనా కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

First Published:  22 Dec 2023 3:57 PM IST
Next Story