Telugu Global
Telangana

టీఎస్ఆర్టీసీ వరంగల్ రీజియన్‌కు 132 ఎలక్ట్రిక్ బస్సులు

డీజిల్ వాహనాల వల్ల కలిగే కాలుష్యాన్ని తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు అనుగుణంగా.. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ జోన్‌లో ఎలక్ట్రిక్ బస్సులను నడుపుతోంది.

టీఎస్ఆర్టీసీ వరంగల్ రీజియన్‌కు 132 ఎలక్ట్రిక్ బస్సులు
X

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ఇకపై వరంగల్ రీజియన్‌లో కూడా ఎలక్ట్రిక్ బస్సులను నడపాలని నిర్ణయించింది. వరంగల్ ప్రాంతానికి 132 ఎలక్ట్రిక్ బస్సులను ఈ మేరకు కేటాయించారు. దీంతో వరంగల్-కాజీపేట-హన్మకొండ త్వరలోనే వాసులు కాలుష్య రహిత, పర్యావారణ సహిత ఒలెక్ట్రా బస్సుల్లో ప్రయాణాన్ని ఆస్వాదించనున్నట్లు ఆర్టీసీ వర్గాలు చెప్పాయి.

డీజిల్ వాహనాల వల్ల కలిగే కాలుష్యాన్ని తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు అనుగుణంగా.. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ జోన్‌లో ఎలక్ట్రిక్ బస్సులను నడుపుతోంది. హైదరాబాద్ - విజయవాడ మధ్య ఇంటర్‌సిటీ ఈ-గరుడ బస్సులను కూడా ప్రారంభించింది. వీటికి అత్యంత ఆదరణ రావడంతో.. తెలంగాణలో రెండో అతిపెద్ద నగరమైన వరంగల్‌కు కూడా ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించింది.

వరంగల్ రీజియన్‌లో లాభసాటి రూట్లను గుర్తించి, త్వరలోనే ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టనున్నారు. ఇటీవల వరంగల్ రీజియన్ అధికారుల సమావేశం నిర్వహించారు. అందులో ఎలక్ట్రిక్ బస్సులపై చర్చ జరిగింది. రీజియన్‌లో ఎలక్ట్రిక్ బస్సులకు ఆదరణ లభిస్తుందని అంచనా వేశారు. ఎలక్ట్రిక్ బస్సుల కోసం బస్ డిపోల వద్ద ఫాస్ట్ చార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయనున్నారు. రాబోయే రెండేళ్లలో రాష్ట్రంలోని టీఎస్ఆర్టీసీ బస్సులన్నీ ఎలక్ట్రిక్ బస్సులుగా మారనున్నాయి.

టీఎస్ఆర్టీసీకి భారీ సంఖ్యలో ఎలక్ట్రిక్ బస్సులను సరఫరా చేయడానికి ఇప్పటికే మేఘా ఇంజనీరింగ్‌కు చెందిన ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. సదరు సంస్థలకు చెందిన బస్సులు కొన్ని హైదరాబాద్ రోడ్లపై పరుగులు పెడుతున్నాయి. కాగా, త్వరలో రానున్న ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు 12 మీటర్ల పొడవుతో.. 41 సీట్లను కలిగి ఉంటాయి. దీన్ని ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 325 కిలోమీటర్లకు పైగా ప్రయాణం చేస్తాయి. ప్రయాణికులకు అవసరమైన భద్రత సౌకర్యాలు కూడా ఉన్నాయి.

ప్రతీ సీటు వద్ద పానిక్ బట్లను, వెహికిల్ ట్రాకింగ్ సిస్టమ్‌లను ఏర్పాటు చేశారు. బస్సులో కనీసం మూడు సీసీ కెమేరాలు ఉంటాయి. ఇవి నెల రోజులకు సరిపడా డేటాను సేవ్ చేస్తాయి. ఈ కెమేరాలన్నీ టీఎస్ఆర్టీసీ కంట్రోల్ రూమ్‌కు కనెక్ట్ చేయబడి ఉంటాయి. డ్రైవర్ కోసం రివర్స్ పార్కింగ్ అసిస్టెన్స్ కెమేరాలు కూడా ఉంటాయి.

First Published:  2 Jun 2023 3:57 PM GMT
Next Story