నిట్టనిలువునా చీలిన టీ-కాంగ్రెస్.. కమిటీ పదవులకు 13 మంది రాజీనామా
టీడీపీ నుంచి వచ్చిన 13 మంది నాయకులు తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్‌లో సీనియర్లు, వలస నేతల మధ్య పోరు మరింతగా ముదిరిపోయింది. ఇరు వర్గాల మధ్య మొదలైన విభేదాలు ఏకంగా పదవుల రాజీనామాల వరకు వెళ్లాయి. శనివారం కాంగ్రెస్ పార్టీకి చెందిన 9 మంది సీనియర్లు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై తిరుగుబావుటా ఎగురవేశారు. పీసీసీ కమిటీల్లో మొత్తం వలస నాయకులే ఉన్నారని, ఇకపై రేవంత్ చేపట్టే కార్యక్రమాలకు మద్దతు ఇవ్వబోమని వాళ్లు తేల్చి చెప్పారు. కాంగ్రెస్‌కు చెందిన సీనియర్ నేతలైన మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదండరెడ్డి, మహేశ్వర్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, దామోదర రాజనర్సింహా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మధుయాష్కి గౌడ్, జగ్గారెడ్డి ఇవ్వాళ గాంధీభవన్‌లో జరిగిన ఎగ్జిక్యూటీవ్ కమిటీ సమావేశానికి హాజరు కాలేదు.
రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశానికి జీ-9గా చెప్పుకుంటున్న సీనియర్ నేతలు రాకవపోవడం, తెలుగుదేశం నుంచి వచ్చిన నేతలపై వాళ్లు తీవ్ర విమర్శలు చేయడంపై సమావేశంలో చర్చ జరిగింది. అనంతరం టీడీపీ నుంచి వచ్చిన 13 మంది నాయకులు తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఎమ్మెల్యే సీతక్క, వేం నరేందర్ రెడ్డి, విజయరామారావు, చారగొండ వెంకటేశ్, ఎర్ర శేఖర్, పటేల్ రమేశ్ రెడ్డి, జంగయ్య యాదవ్, దొమ్మాటి సాంబయ్య, మల్లేశ్, మధుసూదన్ రెడ్డి, డా. సత్యనారాయణ, సుభాష్ రెడ్డి పీసీసీ పదవులకు రాజీనామా చేశారు. ఒకే రాజీనామా పత్రంపై 13 మంది సంతకాలు చేసి రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్యం ఠాకూర్‌కు పంపించినట్లు స్పష్టం చేశారు.
ఇవ్వాళ గాంధీభవన్‌లో సమావేశం మొదలైన తర్వాత రసాభస ప్రారంభమైంది. ముఖ్యంగా జీ-9 నేతల తిరుగుబాటుపైనే చర్చ ప్రారంభమైంది. అసంతృప్త నేతలు చేస్తున్న ఆరోపణలు సరైనవి కావని ఓ వర్గం నేతలు ఖండించారు. కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసేలా సీనియర్ల చర్యలు ఉన్నాయని వారు ఆరోపించారు. ఇది సరైన సమయం కాదని, పార్టీలో అందరినీ కలుపుకొని పోవల్సిన సీనియర్లే.. ఇలా గ్రూపులు కట్టడం ఏంటని ప్రశ్నించారు.
ఇంకా టీడీపీ ఏంటి? : ఎమ్మెల్యే సీతక్క
మేం కాంగ్రెస్ సంక్షోభంలో ఉన్న సమయంలోనే పార్టీలోకి వచ్చాము. ఇప్పటికే ఐదేళ్లు గడిచిపోయింది. కాంగ్రెస్ పార్టీ టికెట్ పైనే నేను ఎమ్మెల్యేగా గెలిచాను. ఇంకా టీడీపీ అని సీనియర్లు అనడం ఏంటని సీతక్క అన్నారు. మమ్మల్ని నిఖార్సయిన కాంగ్రెస్ పార్టీ నేతలు కాదన్నారు కాబట్టే.. బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయదలచుకోలేదని ఆమె చెప్పారు. పదవులు ఉన్నా లేకున్నా మేం కష్టపడి పని చేస్తామన్నారు. ఉపఎన్నికలో ఎవరు పని చేశారు? దళిత బంధు కోసం ఎవరు పోరాటం చేశారు? గిరిజన, ఆదివాసీ దండోరా కార్యక్రమాల్లో ఎవరు పని చేశారో నివేదిక తీస్తే అసలు కష్టపడుతున్నది ఎవరో తెలుస్తుందని సీతక్క అన్నారు.
మా అధిష్టానం ఏం చెబితే అది చేస్తాం.. అంతే తప్ప పార్టీని నాశనం చేసే పనులు చేయబోమన్నారు. సీనియర్లను కోవర్టులు అని ఎవరు అన్నారు? నేను గానీ, రేవంత్ రెడ్డిగానీ ఏనాడూ ఆ మాట అనలేదని సీతక్క స్పష్టం చేశారు. ఒకవైపు రాహుల్ గాంధీ సుదీర్ఘమైన పాదయాత్ర చేస్తున్నారు. వేలాది కిలోమీటర్లు నడుస్తూ పార్టీలో కొత్త ఉత్సాహం తీసుకొని వస్తున్నారు. కానీ, ఇక్కడ మాత్రం తాత్కాలిక సంక్షోభాలు సృష్టించి పార్టీలోని కార్యకర్తలను గందరగోళానికి గురి చేస్తున్నారని సీతక్క మండిపడ్డారు. మా పార్టీ నుంచి వేరే పార్టీలోకి పోయిన వాళ్లకు మంత్రి పదవులు, ఇంకా మంచి పదవులు వచ్చాయి. కానీ మేం అలా వెళ్లకుండా కాంగ్రెస్‌నే నమ్ముకొని ఉన్నాం కదా? మాకు కూడా ఆఫర్లు వచ్చినా పార్టీ కోసమే పనిచేస్తున్నాం కదా.. మరి సీనియర్లకు మాతో వచ్చిన ఇబ్బంది ఏమిటని ఆమె ప్రశ్నించారు.
మేం కూడా సీనియర్లమే : నాగం జనార్దన్ రెడ్డి
ఇతర పార్టీల నుంచి వచ్చన నాయకులను ప్రతీ సారి వలస నాయకులు, టీడీపీ వ్యక్తులు అనడం భావ్యం కాదు. నేను కూడా సీనియర్ నాయకుడినే, ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాను. కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత అప్పటికే ఉన్న సీనియర్లను ఏనాడూ ఒక్క మాట అనలేదు. మరి వాళ్లెందుకు మమ్మల్ని ప్రతీ సారి వేలెత్తి చూపుతున్నారో అర్థం కావడం లేదని నాగం జనార్దన్ రెడ్డి అన్నారు.
ఇవి మా పార్టీలో కామనే : జానారెడ్డి
కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి సంక్షోభాలు కామనే అని సీనియర్ నాయకుడు జానా రెడ్డి అన్నారు. ఇవ్వాళ జరిగిన కాంగ్రెస్ ఎగ్జిక్యూటీవ్ పార్టీ మీటింగ్‌కు ఆయన రేవంత్ రెడ్డితో కలసి గాంధీ భవన్‌కు వచ్చారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై ఆయన స్పందించారు. పార్టీలో ఏర్పడిన సంక్షోభం టీ కప్పులో తుఫాను లాంటిదని ఆయన చెప్పుకొచ్చారు. దీనిపై పెద్దగా ఆందోళన వ్యక్తం చేయాల్సిన అవసరం లేదని, త్వరలోనే సమస్యలన్నీ సమసిపోతాయని అన్నారు. దీనిపై బహిరంగంగా మరింతగా మాట్లాడలేనని ఆయన తెలిపారు.