Telugu Global
Telangana

మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం, సమాజం సంతోషంగా ఉంటాయి

మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం, సమాజం సంతోషంగా ఉంటాయి
X

మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం, సమాజం సంతోషంగా ఉంటాయని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. బ్రెస్ట్‌ క్యాన్సర్‌పై అవగాహన కల్పించడానికి ఏర్పాటు చేసిన పింక్‌ పవర్‌ రన్‌ చాలా గొప్ప కార్యక్రమమని కొనియాడారు. మహిళా సాధికారత కోసం తమ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నదని వివరించారు. పింక్‌ పవర్‌ రన్‌ -2024 కార్యక్రమం సుధారెడ్డి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో జరిగింది. కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం నిర్వహించినందుకు సుధారెడ్డికి సీఎం కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పింక్‌ పవర్‌ 5కే, 10కే రన్ లో గెలుపొందిన వారికి సీఎం రేవంత్‌రెడ్డి నగదు బహుమతులు అందించారు.

బ్రెస్ట్‌ క్యాన్సర్‌ వ్యాధిపై అవగాహన మేరకు గచ్చిబౌలి స్టేడియంలో పింక్‌ పవర్‌ రన్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రారంభించారు. 3కే, 5కే, 10కే రన్‌ కార్యక్రమాన్ని పెట్టారు. ఈ అవగాహన రన్‌లో ఐటీ, ఇతర ప్రైవేట్‌ ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన కల్పించడంలో ఈ పరుగు చాలా ఉత్సాహంగా సాగింది. గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌లో స్థానం సంపాదించడానికి పెద్ద ఎత్తున నిర్వహించారు.

మారుతున్న జీవనశైలి కారణంగా చాలామంది క్యాన్సర్‌ బారిన పడుతున్నారని, ప్రతి ఒక్కరూ వ్యాయామం చేస్తూ మంచి ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు.ఈ కార్యక్రమంలో పీఏసీ ఛైర్మన్‌ అరికపూడి గాంధీ, శాట్‌ ఛైర్మన్‌ శివసేనారెడ్డి తదితరులు హాజరయ్యారు.

First Published:  29 Sept 2024 6:56 AM GMT
Next Story