ఒకే ఆటగాడు..రెండుదేశాల తరపున శతకాలు!
ఇంగ్లండ్ కమ్ జింబాబ్వే బ్యాటర్ గ్యారీ బ్యాలెన్స్ ఓ అరుదైన రికార్డు నెలకొల్పాడు.
ఇంగ్లండ్ కమ్ జింబాబ్వే బ్యాటర్ గ్యారీ బ్యాలెన్స్ ఓ అరుదైన రికార్డు నెలకొల్పాడు. రెండు దేశాల తరపున టెస్టు క్రికెట్లో శతకాలు బాదిన రెండో క్రికెటర్ గా అరుదైన ఘనతను సొంతం చేసుకొన్నాడు.....
టెస్టు క్రికెట్లో తరచుగా చోటు చేసుకొనే రికార్డుల్లో మరో అరుదైన రికార్డును ఇంగ్లండ్ కమ్ జింబాబ్వే బ్యాటర్ గ్యారీ బ్యాలెన్స్ నమోదు చేశాడు. బులావాయే వేదికగా వెస్టిండీస్ తో జరిగిన తొలిటెస్టులో జింబాబ్వే మిడిలార్డర్ ఆటగాడిగా 33 సంవత్సరాల బ్యాలెన్స్ ఈ రికార్డు సాధించాడు.
అప్పుడు ఇంగ్లండ్, ఇప్పుడు జింబాబ్వే...
జింబాబ్వే రాజధాని హరారేలో జన్మించి ఇంగ్లండ్ తరపున టెస్టు క్రికెట్ ఆడుతూ నాలుగు సెంచరీలు నమోదు చేసిన మిడిలార్డర్ ఆటగాడు గ్యారీ బ్యాలెన్స్..తాను పుట్టిపెరిగిన జింబాబ్వే జాతీయజట్టు తరపున ఆడుతూ తొలి శతకం సాధించాడు.
ఐసీసీ టెస్టు లీగ్ లో భాగంగా వెస్టిండీస్ తో జరుగుతున్న తొలిటెస్టు ద్వారా జింబాబ్వే టెస్టుజట్టు తరపున తొలిసారిగా బరిలోకి దిగిన గ్యారీ బ్యాలెన్స్ 137 పరుగులతో అజేయంగా నిలవడం ద్వారా ఫాలోఆన్ ప్రమాదం నుంచి గట్టెంకించాడు.
గత దశాబ్దకాలంలో ఇంగ్లండ్ టెస్టుజట్టులో సభ్యుడిగా ఉన్న బ్యాలెన్స్ తగిన అవకాశాలు రాకపోడంతో తాను పుట్టిపెరిగిన జింబాబ్వేకు ప్రాతినిథ్యం వహించాలని నిర్ణయించాడు. అందులో భాగంగానే ఇంగ్లండ్ ను వీడి జింబాబ్వే జట్టులో చేరాడు.
బులావాయే క్వీన్స్ క్లబ్ వేదికగా జరుగుతున్న ఈ టెస్టు మ్యాచ్ లో వెస్టిండీస్ బౌలర్లను బ్యాలెన్స్ అడుగడుగునా నిలువరించాడు.తనజట్టు9 వికెట్లకు 379 పరుగుల స్కోరుతో దీటైన సమాధానం చెప్పేలే చేయగలిగాడు.
లెగ్ స్పిన్ ఆల్ రౌండర్ బ్రాండన్ మవుటాతో కలసి 8వ వికెట్ కు 135 పరుగుల కీలక భాగస్వామ్యం నమోదు చేయడంలో బ్యాలెన్స్ ప్రధానపాత్ర వహించాడు.
కెప్లర్ వెస్సల్స్ సరసన బ్యాలెన్స్...
టెస్టు క్రికెట్ చరిత్రలో రెండువేర్వేరు దేశాల తరపున టెస్టు సెంచరీలు సాధించిన తొలి క్రికెటర్ రికార్డు కెప్లర్ వెసల్స్ పేరుతో ఉంది. 1990 దశకంలో దక్షిణాఫ్రికా, ఆస్ట్ర్రేలియాటెస్టు జట్ల తరపున శతకాలు బాదిన ఘనత వెసల్స్ కు ఉంది. ఆస్ట్ర్రేలియా తరపున 4 సెంచరీలు, దక్షిణాఫ్రికా తరపున 2 శతకాలు చేసిన ఆటగాడిగా వెస్సల్స్ నిలిచాడు.
ఇక....2023 సిరీస్ లో అదే ఘనత సాధించిన గ్యారీ బ్యాలెన్స్ కు ఇంగ్లండ్ తరపున నాలుగు సెంచరీలు, ప్రస్తుత సిరీస్ తొలిటెస్టులోనే జింబాబ్వే తరపున తొలిశతకం సాధించగలిగాడు.
మొత్తం మీద..దశాబ్దాల చరిత్ర కలిగిన టెస్టు క్రికెట్లో ఇద్దరు బ్యాటర్లు మాత్రమే రెండు వేర్వేరు జట్ల తరపున టెస్టు సెంచరీలు సాధించిన అరుదైన ఘనతను సొంతం చేసుకోగలిగారు.