ప్రపంచకప్‌లో పిల్ల క్రికెటర్లు!
మెరుపు వేగంతో సాగిపోయే టీ-20 ప్రపంచకప్‌లో పాల్గొనాలంటే వయసుతో ఏమాత్రం సంబంధం లేదని పలువురు పిల్ల క్రికెటర్లు చెప్పకనే చెబుతున్నారు. ప్రస్తుత ప్రపంచకప్‌లో వివిధ జట్లలో సభ్యులుగా పాల్గొంటున్న మొత్తం 240 మంది క్రికెటర్లలో 16 సంవత్సరాల బుడతడు సైతం ఉన్నాడు..
క్రికెటర్లందరూ తమ జీవితకాలంలో ఒక్కసారి ప్రపంచకప్ ఆడినా జన్మధన్యమైనట్లుగానే భావిస్తూ ఉంటారు. ప్రపంచకప్ జట్టులో చోటు కోసం కొందరు సంవత్సరాల తరబడి నిరీక్షిస్తూ ఉంటే...మరికొందరికి ముక్కపచ్చలారక ముందే చోటు దక్కుతోంది. ప్రపంచకప్ క్రికెట్ పోటీలలో పాల్గొనాలంటే వయసుతో, అనుభవంతో ఏమాత్రం పనిలేదని, సత్తా ఉంటే చాలునని ప్రస్తుత టీ-20 ప్రపంచకప్ ద్వారా ఐదుగురు నూనూగుమీసాల క్రికెటర్లు చాటి చెప్పారు.
16 ఏళ్లకే ప్రపంచకప్ చాన్స్!
2022 ప్రపంచకప్‌లో పాల్గొన్న అత్యంత పిన్నవయస్కుడైన క్రికెటర్ ఘనతను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ జట్టులోని భారత సంతతి కుర్రాడు అయాన్ అఫ్జల్ ఖాన్ దక్కించుకొన్నాడు. క్వాలిఫైయింగ్ గ్రూప్- ఏ లీగ్ ప్రారంభ మ్యాచ్ లో నెదర్లాండ్స్ ప్రత్యర్థిగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ జట్టు తరపున అయాన్ ఖాన్ బరిలోకి దిగి బ్యాటర్‌గా 5 పరుగులు, బౌలర్‌గా ఓ వికెట్ సాధించాడు. ఆల్ రౌండర్‌గా జట్టులోకి అడుగుపెట్టిన అయాన్ ఖాన్‌కు గతంలో రెండు అంతర్జాతీయ టీ-20 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన అనుభవం ఉంది.
19 ఏళ్ల మెరుపు ఫాస్ట్ బౌలర్ నసీమ్ షా...
చిరకాల ప్రత్యర్థి భారత్‌తో ఈనెల 23న జరిగే తన ప్రారంభ మ్యాచ్‌లో పాకిస్థాన్ తరపున 19 సంవత్సరాల మెరుపు ఫాస్ట్ బౌలర్ నసీమ్ షా పోటీకి దిగనున్నాడు. గంటకు 150 కిలోమీటర్ల వేగంతో బంతులు విసిరే నసీమ్..ప్రస్తుత ప్రపంచకప్‌లో పాల్గొంటున్న రెండో అత్యంత పిన్నవయస్కుడైన క్రికెటర్‌గా రికార్డుల్లో చేరాడు. 19 సంవత్సరాల వయసుకే నసీమ్ షాకు 13 టెస్టులు, 3 వన్డేలు, అరడజను టీ-20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన రికార్డు ఉంది.
20 ఏళ్ల వయసులో అఫ్గన్ ఫాస్ట్ బౌలర్..
ప్రపంచకప్‌లో పాల్గొంటున్న అఫ్ఘనిస్థాన్ జట్టులో సభ్యుడిగా 20 సంవత్సరాల యువఫాస్ట్ బౌలర్ మహ్మద్ సలీమ్ బరిలోకి దిగుతున్నాడు. సలీమ్‌కు 12 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ల్లో 41 వికెట్లు పడగొట్టిన ఘనత ఉంది. ప్రపంచకప్ లో తొలిసారి పాల్గొంటున్నాడు.
అంతేకాదు...దక్షిణాఫ్రికా తరపున బ్యాటింగ్‌కు దిగనున్న సూపర్ హిట్టర్ ట్రిస్టాన్ స్టుబ్స్ వయసు 22 సంవత్సరాలు మాత్రమే. ఇప్పటికే తన కెరియర్ లో 9 అంతర్జాతీయ టీ-20 మ్యాచ్ లు ఆడిన స్టుబ్స్ మొత్తం 142 పరుగులు సాధించాడు.
23 ఏళ్ల వయసులో అర్షదీప్ సింగ్...
భారత్ తరపున తొలిసారిగా ప్రపంచకప్ బరిలో నిలిచిన ఎడమచేతివాటం ఫాస్ట్ బౌలర్ అర్షదీప్ సింగ్ వయసు 23 సంవత్సరాలు మాత్రమే. 2022 ప్రపంచకప్‌లో పాల్గొంటున్న అత్యంత పిన్నవయస్కులైన క్రికెటర్లలో ఐదోస్థానంలో అర్షదీప్ నిలిచాడు. భారత్ తరపున ఇప్పటి వరకు ఆడిన 13 అంతర్జాతీయ టీ-20 మ్యాచ్ ల్లో 19 వికెట్లు పడగొట్టిన రికార్డు అర్షదీప్‌కు మాత్రమే సొంతం.
ఈ ఐదుగురు పిల్ల క్రికెటర్లు ప్రపంచకప్ మ్యాచ్‌ల్లో వయసుకు మించి ప్రతిభ కనబరిస్తే అది గొప్ప ఘనతే అవుతుంది. ఒకవేళ స్థాయికి తగ్గట్టుగా ఆడలేకపోయినా..ప్రపంచకప్‌లో పాల్గొన్న అనుభవంతో పాటు...చిన్నవయసులోనే ప్రపంచకప్ ఆడేసిన మొనగాళ్లుగా రికార్డుల్లో మిగిలిపోనున్నారు.