Telugu Global
Sports

భారతజట్టులో యశస్వి జైశ్వాల్, పూజారా అవుట్!

వెస్టిండీస్ తో టెస్టు, వన్డేమ్యాచ్ ల సిరీస్ లో పాల్గొనే భారతజట్టులో యువఆటగాళ్లు యశస్వి జైశ్వాల్, రితురాజ్ గయక్వాడ్ లకు చోటు దక్కింది. నయావాల్ చతేశ్వర్ పూజారాకు జట్టులో చోటు దక్కలేదు.

భారతజట్టులో యశస్వి జైశ్వాల్, పూజారా అవుట్!
X

భారతజట్టులో యశస్వి జైశ్వాల్, పూజారా అవుట్!

వెస్టిండీస్ తో టెస్టు, వన్డేమ్యాచ్ ల సిరీస్ లో పాల్గొనే భారతజట్టులో యువఆటగాళ్లు యశస్వి జైశ్వాల్, రితురాజ్ గయక్వాడ్ లకు చోటు దక్కింది. నయావాల్ చతేశ్వర్ పూజారాకు జట్టులో చోటు దక్కలేదు....

కరీబియన్ ద్వీపాల పర్యటనకు భారత టెస్టు, వన్డేజట్లను బీసీసీఐ ఎంపిక సంఘం ప్రకటించింది. రోహిత్ శర్మ నాయకత్వంలోని భారతజట్టు తన పర్యటన కాలంలో రెండుమ్యాచ్ ల టెస్టు, మూడుమ్యాచ్ ల వన్డే సిరీస్ ల్లో పాల్గోనుంది.

టెస్టు వైస్ కెప్టెన్ రహానే, వన్డే వైస్ కెప్టెన్ హార్థిక్ పాండ్యా...

ఐసీసీ టెస్టు లీగ్ ( 2023-2025 ) లో భాగంగా వెస్టిండీస్ తో జరిగే రెండుమ్యాచ్ ల టెస్టు సిరీస్ లో పాల్గొనే భారతజట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్ గా, అజింక్యా రహానే వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తారు.

యువఆటగాళ్లు యశస్వి జైశ్వాల్, రితు రాజ్ గయక్వాడ్, ముకేశ్ కుమార్ లకు భారత టెస్టు జట్టులో తొలిసారిగా చోటు దక్కింది. అయితే..నయావాల్, వందటెస్టుల మొనగాడు చతేశ్వర్ పూజారాకు మాత్రం టెస్టుజట్టులో చోటు దక్కలేదు.

ఇటీవలే ముగిసిన ఐపీఎల్ -16లో అంచనాలకు మించి రాణించిన యువ ఓపెనర్లు యశస్వి జైశ్వాల్, రితురాజ్ గయక్వాడ్ లను ఎంపిక సంఘం కరుణించింది.

టెస్టు జట్టులో ఈ ఇద్దరికి అవకాశం కల్పించారు.

రోహిత్ శర్మ కెప్టెన్ గా ఉన్న టెస్టుజట్టులోని ఇతర ఆటగాళ్లలో శుభ్ మన్ గిల్, రితురాజ్ గయక్వాడ్, విరాట్ కొహ్లీ, యశస్వి జైశ్వాల్, అజింక్యా రహానే ( వైస్ కెప్టెన్ ), కెఎస్ భరత్, ఇషాన్ కిషన్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, మహ్మద్ సిరాజ్, ముకేశ్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, నవదీప్ సైనీ ఉన్నారు.

వన్డేజట్టులో సంజు శాంసన్ కు చోటు...

ప్రపంచకప్ కు సన్నాహాలలో భాగంగా వెస్టిండీస్ తో జరిగే తీన్మార్ వన్డే సిరీస్ లో పాల్గొనే భారతజట్టులో డాషింగ్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ తిరిగి చోటు దక్కించుకొన్నాడు.

రోహిత్ శర్మ నాయకత్వంలోని భారతజట్టులో శుభ్ మన్ గిల్, రితురాజ్ గయక్వాడ్, విరాట్ కొహ్లీ, సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్, ఇషాన్ కిషన్, హార్థిక్ పాండ్యా ( వైస్ కెప్టెన్ ), శార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, యజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్, మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, ముకేశ్ కుమార్ ఉన్నారు.

సీనియర్ ఫాస్ట్ బౌలర్లు మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్ లను ఎంపిక సంఘం పక్కనపెట్టింది. యువపేసర్ ముకేశ్ కుమార్ కు టెస్టు, వన్డే జట్లలో అవకాశమిచ్చింది.

సిరీస్ కు ముగింపుగా జరిగే 5 మ్యాచ్ ల టీ-20 సిరీస్ లో పాల్గొనే భారతజట్టును ఆ తరువాత బీసీసీఐ ఎంపిక సంఘం ప్రకటించనుంది.

పాపం! చతేశ్వర్ పూజారా..

35 సంవత్సరాల చతేశ్వర్ పూజారా టెస్టు కెరియర్ దాదాపుగా ముగిసినట్లే. 102 టెస్టుమ్యాచ్ ల అపారఅనుభవం కలిగిన పూజారాను విండీస్ తో టెస్టు సిరీస్ కు ఎంపిక చేయకుండా..రిటైర్ కావాలన్నట్లుగా బీసీసీఐ సంకేతాలు పంపింది.

గత ఆరుమాసాల కాలంలో భారతటెస్టుజట్టులో చోటు కోల్పోడం పూజారాకు ఇది రెండోసారి. శ్రేయస్ అయ్యర్, కెఎల్ రాహుల్ లాంటి కీలక ఆటగాళ్లు గాయాలతో అందుబాటులో లేకున్నా..పూజారా లాంటి బ్యాటర్ ను పక్కనపెట్టడం ద్వారా బోర్డు ఎంపిక సంఘం గొప్పసాహసమే చేసింది.

2012లో రాహుల్ ద్రావిడ్ రిటైర్మెంట్ తో ఆ స్థానాన్ని చక్కగా భర్తీ చేసిన పూజారా 19 శతకాలతో సహా 7వేల 195 పరుగులు సాధించాడు. 43.6 సగటుతో ఉన్నాడు.

పూజారా స్థానంలో యశస్వి...

టెస్టుజట్టు వన్ డౌన్ స్థానంలో పూజారాకు బదులుగా 21 సంవత్సరాల యశస్వి జైశ్వాల్ ను ఆడించాలని టీమ్ మేనేజ్ మెంట్ నిర్ణయించింది. మహారాష్ట్ర్ర బ్యాటర్ రితురాజ్ గయక్వాడ్ ను మాత్రం మిడిలార్డర్ లో బ్యాకప్ గా ఉపయోగించుకోవాలని టీమ్ మేనేజ్ మెంట్ భావిస్తోంది.

మరోవైపు..పేస్ బౌలింగ్ విభాగంలో షమీకి విశ్రాంతి ఇచ్చి..57 టెస్టుల అనుభవం ఉన్న ఉమేశ్ యాదవ్ ను పక్కన పెట్టింది. ఈ ఇద్దరి స్థానాలలో ముకేశ్ కుమార్, సైనీలను ఆడించాలని నిర్ణయించింది.

సౌరాష్ట్ర్ర కెప్టెన్ జయదేవ్ ఉనద్కత్ ను టెస్టు, వన్డే జట్లకు ఎంపిక చేయటం విశేషం. అంతంత మాత్రంగా రాణిస్తున్న ఆంధ్ర వికెట్ కీపర్ బ్యాటర్ కెఎస్ భరత్ టెస్టుజట్టులో తన చోటు నిలుపుకోగలిగాడు.

First Published:  23 Jun 2023 4:34 PM IST
Next Story