Telugu Global
Sports

ముంబై ఫుట్ పాత్ నుంచి అంతర్జాతీయ క్రికెట్ కు....!

భారత క్రికెట్ యువకెరటం, నయాసంచలనం యశస్వి జైశ్వాల్ సంచలనం సృష్టించాడు. అరంగేట్రం టెస్టులోనే 171 పరుగుల స్కోరుతో మ్యాన్ ఆఫ్ దిమ్యాచ్ అవార్డు అందుకొన్నాడు.

యశస్వి జైశ్వాల్
X

యశస్వి జైశ్వాల్

భారత క్రికెట్ యువకెరటం, నయాసంచలనం యశస్వి జైశ్వాల్ సంచలనం సృష్టించాడు. అరంగేట్రం టెస్టులోనే 171 పరుగుల స్కోరుతో మ్యాన్ ఆఫ్ దిమ్యాచ్ అవార్డు అందుకొన్నాడు....

ఆకలి చంపేస్తున్నా, పేదరికం పీల్చి పిప్పిచేస్తున్నాఅనుకున్న లక్ష్యాన్ని సాధించిన భారత క్రికెట్ అగ్గిపిడుగు యశస్వి జైశ్వాల్. 21 సంవత్సరాల వయసులోనే ఐపీఎల్, టెస్టుమ్యాచ్ శతకాలు బాదిన మొనగాడు. సచిన్ టెండుల్కర్, విరాట్ కొహ్లీ లాంటి భారత క్రికెట్ దిగ్గజాలకు తగిన వారసుడిని తానేనని తన ఆటతీరుతో చాటిచెప్పిన నవయువ కెరటం.

గూడు, కూడు లేని స్థితి నుంచి..

ఉత్తరప్రదేశ్ లోని బదోహీ లోని సూర్యవాన్ గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబం నుంచి క్రికెట్ పిచ్చితో ముంబై మహానగరానికి వచ్చిన యశస్వి జైశ్వాల్ 12 ఏళ్ల చిరుప్రాయంలోనే క్రికెట్ బ్యాట్ పట్టాడు. తలదాచుకోడానికి ఓ గూడు, కడుపునింపుకోడానికి కూడు లేకపోయినా ముంబైలోని అజాద్ మైదాన్ గ్రౌండ్ పక్కనే ఉంటూ ఎదిగాడు.

అజాద్ మైదాన్ గ్రౌండ్ సమీపంలోని ముస్లిం యునైటెడ్ క్లబ్ కు కాపలాగా ఉండే వాచ్ మెన్ టెంట్ లో తలదాచుకొంటూ, ఓ పానీపూరి దుకాణంలో పనిచేస్తూ కడుపునింపుకొంటూ సబ్- జూనియర్ స్థాయి నుంచే క్రికెటర్ గా తన ప్రతిభను చాటుకొంటూ వచ్చాడు.

వందా, రెండొందల రూపాయల కోసం ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌లు ఆడుతూ క్రికెటర్ కావాలన్న తన జీవితలక్ష్యాన్ని నెరవేర్చుకోడానికి పడరానిపాట్లు పడ్డాడు.

కోచ్ జ్వాలాసింగ్ ఆదరణ, శిక్షణతో

స్థానిక లీగ్ మ్యాచ్ లు ఆడుతున్న సమయంలోనే యశస్విలోని అపార ప్రతిభను.. ఆ ప్రాంతంలోనే ఓ క్రికెట్ అకాడమీని నడుపుతున్న శిక్షకుడు జ్వాలాసింగ్ గుర్తించి చేరదీశారు. తన నివాసంలోనే ఆశ్రయం కల్పించి చక్కటి ఆటగాడిగా తీర్చిదిద్దారు.

లిమ్కా బుక్ ఆఫ్ రికార్డుల్లో చోటు...

ఓ స్కూలు క్రికెట్ లీగ్ మ్యాచ్ లు ఆడుతూ యశస్వి బ్యాటర్ గా 319 పరుగుల నాటౌట్, బౌలర్ గా 99 పరుగులకు 13 వికెట్ల రికార్డు సాధించడం ద్వారా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డుల్లో చోటు సంపాదించాడు.

గత మూడు సంవత్సరాల కాలంలో యశస్వి 51 శతకాలు బాదడంతో పాటు 200 వికెట్లు పడగొట్టాడు. వివిధ టోర్నీలలో రాణించడం ద్వారా ముంబై అండర్-16, భారత అండర్ -19 జట్లలో చోటు సంపాదించాడు.

ఢాక వేదికగా జరిగిన అండర్- 19 ఆసియాకప్ టోర్నీలో శతకంతో మెరుపులు మెరిపించాడు. అండర్ -19 ప్రపంచకప్ లో సైతం యశస్వికి అడ్డేలేకుండా పోయింది.

పాల్గొన్న ప్రతిమ్యాచ్ లోనూ నిలకడగా రాణించిన యశస్వి ఆ తర్వాత మరి వెనుదిరిగి చూసింది లేదు. దేశవాళీ, రంజీ, లిస్ట్‌-ఏ, అండర్‌-19, ఐపీఎల్‌.. ఇలా అందివచ్చిన ప్రతి అవకాశాన్ని యశస్వి సద్వినియోగం చేసుకోడం ద్వారా నేరుగా భారతటెస్టు జట్టులోనే చోటు సంపాదించాడు.

గత సీజన్‌ రంజీ విజేత మధ్యప్రదేశ్‌తో జరిగిన ఇరానీ కప్‌లో రెస్టాఫ్‌ ఇండియా తరఫున బరిలోకి దిగిన యశస్వి రెండు ఇన్నింగ్స్‌ల్లో భారీ స్కోర్ల (213, 144)తో విజృంభించాడు. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో ఇప్పటి వరకు 80.21 సగటుతో పరుగులు రాబట్టిన జైస్వాల్‌.. ఐపీఎల్‌ 16వ సీజన్‌లోనూ సత్తాచాటాడు. లీగ్‌ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన (13 బంతుల్లో) అర్ధశతకం నమోదు చేసి ఔరా అనిపించాడు.

2023 ఐపీఎల్ లో శతకం బాదడం ద్వారా అత్యంత పిన్నవయసులో సెంచరీ సాధించిన నాలుగో బ్యాటర్ గా రికార్డుల్లో చేరాడు.

టెస్టు అరంగేట్రంలోనే శతకం....

వెస్టిండీస్ తో డొమనికా వాండరర్స్ పార్క్ వేదికగా టెస్టు అరంగేట్రం చేసిన యశస్వి తన తొలిమ్యాచ్ లోనే భారీసెంచరీ సాధించాడు. కెప్టెన్ రోహిత్ శర్మతో కలసి మొదటి వికెట్ కు 229 పరుగుల భాగస్వామ్యం నమోదు చేయడం ద్వారా సంచలనం సృష్టించాడు. 171 పరుగుల భారీస్కోరు సాధించాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకొన్నాడు.

టెస్టు అరంగేట్రం మ్యాచ్ లోనే సెంచరీ బాదిన భారత 17వ క్రికెటర్ గా యశస్వి జైశ్వాల్ రికార్డుల్లో చేరాడు. యశస్వి కంటే ముందుగా అరంగేట్రం శతకాలు నమోదు చేసిన భారత ప్రముఖ బ్యాటర్లలో లాలా అమర్‌నాథ్‌, గుండప్ప విశ్వనాథ్‌, మహమ్మద్‌ అజారుద్దీన్‌, సౌరవ్‌ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్‌, సురేశ్‌ రైనా, శిఖర్‌ ధవన్‌, రోహిత్‌ శర్మ, పృథ్వీ షా, శ్రేయస్‌ అయ్యర్‌ ఉన్నారు. 2021 సిరీస్ లో కాన్పూర్ వేదికగా న్యూజిలాండ్ పై శ్రేయస్ అయ్యర్ అరంగేట్రం శతకం సాధించిన తర్వాత..అదే ఘనతను యశస్వి జైశ్వాల్ మాత్రమే దక్కించుకోగలిగాడు.

2013 సిరీస్ లో ఆస్ట్ర్రేలియాపై శిఖర్ ధావన్, 2018 సిరీస్ లో వెస్టిండీస్ ప్రత్యర్థిగా పృథ్వీ షా తమ అరంగేట్రం టెస్టుల్లోనే శతకాలు సాధించగా..ప్రస్తుత 2023 సిరీస్ తొలిటెస్టులోనే యశస్వి జైశ్వాల్ సైతం అజేయశతకం బాదడం ద్వారా ఈ ఘనత సాధించిన భారత మూడో ఓపెనర్ గా రికార్డుల్లో చేరాడు.

21 ఏళ్ళ 197 రోజుల వయసులో...

అత్యంత పిన్నవయసులో..టెస్టు అరంగేట్రం మ్యాచ్ లోనే సెంచరీ సాధించిన నాలుగో అత్యంత పిన్నవయస్కుడైన బ్యాటర్ గా యశస్వి జైశ్వాల్ రికార్డు నెలకొల్పాడు.యశస్వి జైశ్వాల్ మాత్రం 387 బంతులు ఎదుర్కొని 16 ఫోర్లు, ఓ సిక్సర్ తో 171 పరుగుల స్కోరుతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.

విదేశీగడ్డపై టెస్టు అరంగేట్రం మ్యాచ్ లోనే శతకం బాదిన భారత 7వ బ్యాటర్ గా, గత 13 సంవత్సరాలలో భారత తొలి క్రికెటర్ గా యశస్వి రికార్డుల్లో చేరాడు. 2010 సిరీస్ లో శ్రీలంక గడ్డపై సురేశ్ రైనా అరంగేట్రం టెస్టు శతకం నమోదు చేసిన తర్వాత..కరీబియన్ గడ్డపై యశస్వి అదే రికార్డును అందుకోగలిగాడు.

తిండికి లేని స్థితి నుంచి 4 కోట్ల వేతనం వరకూ..

క్రికెట్ పిచ్చితో యూపీ నుంచి ముంబైకి 12 సంవత్సరాల వయసులోనే వచ్చిన యశస్వి కూడు, గూడు లేని నిరుపేద స్థితి నుంచి ఐపీఎల్ ద్వారా ఏడాదికి 4 కోట్ల రూపాయలు వేతనం అందుకొనే స్థితికి ఎదిగాడు. ముంబై మహానగరంలో ఒకప్పడు నిలువనీడ లేని యశస్వి ఇప్పుడు ఓ మంచి నివాసాన్ని ఏర్పాటుచేసుకొని తన కుటుంబసభ్యులతో కలసి జీవిస్తున్నాడు.

యశస్వి కేవలం 21 సంవత్సరాల వయసుకే అంతర్జాతీయ క్రికెటర్ గా ఎదగటం, టెస్టు క్రికెట్ అరంగేట్రంలోనే భారీశతకం బాదటం భారత క్రికెట్ విజయగాధల్లో ఒకటిగా మిగిలిపోతుంది.

First Published:  15 July 2023 11:00 AM IST
Next Story