Telugu Global
Sports

డబ్ల్యూటీసీ ఫైనల్ : ఒడిషా రైలు ప్రమాద మృతులకు నివాళి

ఒడిషా రైలు ప్రమాద బాధితులకు నివాళిగా మ్యాచ్‌కు ముందు రెండు నిమిషాలు మౌనం పాటించారు.

డబ్ల్యూటీసీ ఫైనల్ : ఒడిషా రైలు ప్రమాద మృతులకు నివాళి
X

ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ మ్యాచ్ ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ మైదానంలో ప్రారంభమైంది. టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. కాగా, ఈ మ్యాచ్‌ జరిగే ఐదు రోజుల పాటు ఇరు జట్ల ఆటగాళ్లు, మ్యాచ్ అఫిషియల్స్ నల్ల బ్యాండ్స్ ధరిస్తారని ఐసీసీ తెలిపింది. ఇటీవల ఒడిషాలోని బాలాసోర్ సమీపంలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 288 మంది మృతి చెందగా, దాదాపు 1000 మంది గాయపడిన విషయం తెలిసిందే.

ఒడిషా రైలు ప్రమాద బాధితులకు నివాళిగా మ్యాచ్‌కు ముందు రెండు నిమిషాలు మౌనం పాటించారు. అంతే కాకుండా మ్యాచ్ మొత్తం నల్ల బ్యాడ్జీలతో మృతులు, బాధిత కుటుంబాలకు నివాళి అర్పించనున్నట్లు ఐసీసీ ప్రకటించింది. కాగా, మ్యాచ్‌ను సీనియర్ క్రికెటర్, ప్రస్తుతం కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న దినేశ్ కార్తీక్ గంట కొట్టి ప్రారంభించారు. ఈ మ్యాచ్ రోహిత్ శర్మ, పాట్ కమ్మిన్స్‌లకు కెప్టెన్లుగా 50వ మ్యాచ్ కావడం గమనార్హం. టాస్ గెలిచిన రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకున్నాడు. వాతావరణ పరిస్థితులు, పిచ్ స్వభావాన్ని బట్టి తాను బౌలింగ్ తీసుకున్నట్లు తెలిపాడు.

తెలుగు క్రికెటర్ శ్రీకర్ భరత్‌కు వికెట్ కీపింగ్ ఛాన్స్ వచ్చింది. జట్టు మేనేజ్‌మెంట్ ఇషాన్ కిషన్ బదులు భరత్ వైపే మొగ్గు చూపింది. ఇక జట్టులో ఏకైక స్పిన్నర్‌గా రవీంద్ర జడేజాకు చోటు దక్కింది. నలుగురు పేసర్లతో టీమ్ ఇండియా బరిలోకి దిగింది.

ఇరు జట్లు :

టీమ్ ఇండియా : రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్య రహానే, శ్రీకర్ భరత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, శార్దుల్ ఠాకూర్, ఉమేశ్ యాదవ్, మహ్మద్ షమి, మహ్మద్ సిరాజ్.

ఆస్ట్రేలియా : డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, కామెరూన్ గ్రీన్, అలెక్స్ కేరీ (వికెట్ కీపర్), పాట్ కమ్మిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లయన్, స్కాట్ బోలాండ్

First Published:  7 Jun 2023 3:21 PM IST
Next Story