పురుషాధిక్య క్రీడారంగంలో మహిళలే సమిధలు!
పురుషులు, మహిళలు భాగస్వాములుగా ఉంటే క్రీడారంగంలో సైతం లైంగిక వేధింపులు తప్పవని మరోసారి తేటతెల్లమయ్యింది
పురుషులు, మహిళలు భాగస్వాములుగా ఉంటే క్రీడారంగంలో సైతం లైంగిక వేధింపులు తప్పవని మరోసారి తేటతెల్లమయ్యింది. భారత క్రీడారంగంలో లైంగిక వేధింపుల ఫిర్యాదులు, కేసులు ఏడాది ఏడాదికీ పెరిగిపోతున్నాయి....
కాలం మారింది. రంగం ఏదైనా పురుషులతో సమానంగా మహిళలు రాణిస్తున్నా.. లైంగిక వేధింపులు, అత్యాచార ఆరోపణల పర్వం కొనసాగుతూనే ఉంది. ఇది భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు మాత్రమే పరిమితమై లేదు. అమెరికా లాంటి ధనిక దేశాలను సైతం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
మహిళల భద్రత, రక్షణ కోసం ఎన్ని చట్టాలు చేసినా, రకరకాల చర్యలు చేపట్టినా, సంస్కరణలు తీసుకువచ్చినా పరిస్థితులు ఏమాత్రం మెరుగుపడటం లేదు. లైంగిక వేధింపులు, అత్యాచార ప్రయత్నాలు మాత్రం మామూలు విషయంగా మారిపోయాయి. దీనికి క్రీడారంగం సైతం ఏమాత్రం మినహాయింపు కాదని గత దశాబ్దకాలం గణాంకాలు చెప్పకనే చెబుతున్నాయి.
మహిళా రెజ్లర్ల ఆందోళనతో....
జనాభాపరంగా ప్రపంచంలోని రెండు అతిపెద్ద దేశాలలో ఒకటైన భారత క్రీడారంగంలో పురుషులతో సమానంగా మహిళలకూ అవకాశాలు, ప్రోత్సాహం కల్పిస్తున్నా..మహిళా క్రీడాకారులు, అథ్లెట్లు నిర్భయంగా, స్వేచ్ఛగా మనుగడ సాగించలేకపోతున్నారు.
తమ దగ్గర శిక్షణ పొందుతున్న మహిళా క్రీడాకారులను లైంగికంగా వేధించే గురువుల్లాంటి శిక్షకులు, తమ నీడలో అంతర్జాతీయ క్రీడాకారులుగా ఎదుగుతున్న
మహిళలను తమ పలుకుబడితో లొంగదీసుకొనే క్రీడామంత్రులు, క్రీడాసంఘాల అధ్యక్షుల రూపంలో సరికొత్త సమస్యలు పుట్టుకు వస్తున్నాయి. లైంగిక వేధింపులు, అత్యాచార ఆరోపణలు వెలుగులోకి వస్తున్నాయి.
భారత ఒలింపిక్స్ సంఘానికి అనుబంధంగా ఉన్న దేశంలోని 30కి పైగా క్రీడాసంఘాల కార్యవర్గాలలో రాజకీయవేత్తలు, పలుకుబడిన వర్గాలవారి పెత్తనమే కొనసాగుతోంది. రాజకీయంగా ఉన్నత స్థానాలలో ఉన్న కొందరు వ్యక్తులు ఏళ్లతరబడి అధ్యక్ష, కార్యదర్శుల పదవులు పట్టుకొని వేలాడుతూ తమ ఆధిపత్యధోరణిని ప్రదర్శిస్తున్నారు.
తమ అసాధారణ విజయాలతో ఆయా క్రీడాసంఘాలకు, దేశానికి ఖ్యాతి తెస్తున్నమహిళా క్రీడాకారులతో క్రీడాసంఘాల పెద్దలు, శిక్షకులు, క్రీడామంత్రి స్థాయి వ్యక్తులు అనుచితంగా ప్రవర్తించడం, మహిళా క్రీడాకారులను తమ సొంత ఆస్తిగా పరిగణించడం సాధారణ విషయంగా మారిపోయింది.
ప్రస్తుతం న్యూఢిల్లీ వేదికగా ఏడుగురు భారత మహిళా రెజ్లర్లు..తమపై జరిగిన లైంగిక వేధింపులను భరించలేక గొప్పపోరాటమే మొదలు పెట్టారు.తమను లైంగికంగా వేధించిన కుస్తీ సమాఖ్య అధ్యక్షుడు, బీజెపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కు వ్యతిరేకంగా రాజీలేని పోరాటం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ రెజ్లర్లు
రోడ్డెక్కారు. గత ఆరువారాలుగా నిరసన దీక్షలు చేపట్టినా...ప్రభుత్వం మాత్రం విచారణ కమిటీ పేరుతో కాలయాపన చేస్తూ వస్తోంది.
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్ భూషణ్ పై ఓ మర్డర్ కేసుతో సహా మొత్తం 43 ఐఎఫ్ఆర్ లు ఇప్పటికే నమోదై ఉన్నాయి. అలాంటి వ్యక్తిపైన చర్యలు తీసుకోకుండా కేంద్రప్రభుత్వం తాత్సారం చేస్తోంది.తమ ఎంపీని కాపాడుకోటానికి మౌనవ్రతాన్నిపాటిస్తూ..రెజ్లర్ల సహనాన్ని పరీక్షిస్తోంది.
10 సంవత్సరాలలో 45 కేసులు..
గత దశాబ్దకాలంలో మహిళా క్రీడాకారులపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఫిర్యాదులను భారత క్రీడాప్రాదికారసంస్థ స్వీకరించింది. అంతర్జాతీయ ఒలింపిక్ సమాఖ్య నిబంధనల ప్రకారం..ప్రతి క్రీడాసంఘంలోనూ అంతర్గత విచారణ కోసం మహిళలతో కూడిన ముగ్గురు సభ్యుల విచారణ కమిటీని ఏర్పాటు చేసి తీరాలి.
అయితే..జాతీయ కుస్తీ సమాఖ్యతో సహా మొత్తం 25 క్రీడాసంఘాలలో ఈ తరహా విచారణ సంఘాల ఊసే లేదు.
కేంద్ర క్రీడామంత్రిత్వశాఖ సైతం తూతుమంత్రంగా చర్యలు చేపట్టడం, ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులకే అండగా ఉండటం తీవ్రవిమర్శలకు తావిస్తోంది.
చివరకు నిరసన తెలుపుతున్న మహిళా వస్తాదులపై ఢిల్లీ పోలీసులతో దాష్టీకం చేయించడం అంతర్జాతీయంగా భారత క్రీడారంగానికి, కేంద్రప్రభుత్వానికి అపఖ్యాతి తెచ్చి పెట్టింది.
జాతీయ మానవహక్కుల సంఘం ఆగ్రహం..
దేశంలోని వివిధ క్రీడాసంఘాలలో..లైంగిక వేధింపుల విచారణకు అంతర్గత వ్యవ్యస్థ, ఏర్పాట్లు లేకపోడం పట్ల జాతీయ మానవహక్కుల సంఘం అసంతృప్తి వ్యక్తం చేసింది.
అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం నియమావళి ప్రకారం జాతీయ ఒలింపిక్ సంఘానికి అనుబంధంగా ఉన్న క్రీడాసమాఖ్యలు, సంఘాలలో..లైంగిక వేధింపుల పై విచారణకు
ముగ్గురు మహిళా సభ్యులతో కూడిన అంతర్గత కమిటీ ఉండితీరాలి.
దేశంలోని మొత్తం 30 క్రీడాసమాఖ్యలలో 15 క్రీడాసమాఖ్యలలో అటువంటి వ్యవస్థే లేకపోడం పట్ల జాతీయ మానవహక్కుల సంఘం ఆందోళన వ్యక్తం చేసింది.
భారత మహిళా వస్తాదులపై జరిగిన లైంగిక వేధింపుల ఫిర్యాదును సువో మోటోగా స్వీకరిస్తున్నట్లు ప్రకటించింది.
శిక్షకుల పైనే 29 ఫిర్యాదులు..
కుస్తీ, బాక్సింగ్, జిమ్నాస్టిక్స్ లాంటి పలు రకాల క్రీడలను ..ఫిజికల్ కాంటాక్ట్ క్రీడలుగా చెబుతారు. ఆయా క్రీడల్లో శిక్షకులుగా వ్యవహరించే వ్యక్తులు శిక్షణ ఇచ్చే సమయంలో మహిళా అథ్లెట్ల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తూ..శిక్షణ పేరుతో..ప్రయివేటు భాగాలను తాకుతూ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
వివిధ క్రీడాసంఘాల నుంచి భారత క్రీడాప్రాధికార సంస్థకు చేరిన మొత్తం 45 ఫిర్యాదుల్లో 29 ఫిర్యాదులు కోచ్ లపైనే వచ్చాయి. గత తొమ్మిదిమాసాలలో మహిళా అథ్లెట్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులు ఐదువరకూ నమోదయ్యాయి.
హర్యానా క్రీడామంత్రి, మాజీ ఒలింపియన్ సందీప్ సింగ్ పై లైంగిక వేధింపుల కేసు నమోదయ్యింది. దీంతో తీవ్రఒత్తిడికి గురైన మంత్రి..నైతిక విలువల సాకుతో మంత్రిపదవికి రాజీనామా చేశారు. సందీప్ సింగ్ పై చండీగఢ్ పోలీసులు కేసును సైతం నమోదు చేశారు.
భారత మహిళల అండర్ -17 ఫుట్ బాల్ జట్టు సహాయ శిక్షకుడు సైతం లైంగిక వేధింపుల ఆరోపణలతో తన ఉద్యోగం కోల్పోక తప్పలేదు. మైనర్ బాలికల పై అత్యాచారం లేదా లైంగిక వేధింపులకు పాల్పడిన వారిపై పోస్కో చట్టాన్నిప్రయోగిస్తున్నారు. పోస్కో చట్టం ప్రకారం కేసు ఎదుర్కొంటున్న వ్యక్తులకు నాన్ బెయిలబుల్ వారెంట్ ను జారీ చేస్తారు.
సైక్లింగ్ క్రీడలో సైతం ఓ లైంగిక వేధింపుల కేసు నమోదయ్యింది. భారత సైక్లింగ్ జట్టు శిక్షకుడు ఆర్కె శర్మ ఇదే తరహా ఆరోపణలతో ఉద్వాసనకు గురయ్యారు.
తమిళనాడు అథ్లెటిక్స్ కోచ్ పి. నాగరాజన్ పైన సైతం లైంగిక వేధింపుల కేసు నమోదయ్యింది. ఫిజియో థెరపీ పేరుతో మహిళా అథ్లెట్లతో అనుచితంగా ప్రవర్తించినట్లు పలువురు ఫిర్యాదు చేశారు. మొత్తం ఏడుగురు మహిళా అథ్లెట్లు ఫిర్యాదు చేయటంతో కోచ్ నాగరాజన్ కటకటాలపాలయ్యారు.
ఓ బాక్సింగ్ శిక్షకుడు, మరో జిమ్నాస్టిక్స్ కోచ్ సైతం లైంగిక వేధింపుల ఆరోపణలతో క్రీడాశిక్షకులకే తలవంపులు తెచ్చారు.
అమెరికాలోనూ తప్పని లైంగిక వేధింపులు...
మహిళా క్రీడాకారులపై లైంగిక వేధింపులు సంఘటనలు కేవలం భారత క్రీడారంగానికి మాత్రమే పరిమితం కాలేదు. మహిళలకు విపరీతమైన స్వేచ్ఛకలిగిన అమెరికా క్రీడారంగంలో సైతం లైంగిక వేధింపుల కేసులు కలకలం రేపాయి.
2018లో 150 మంది మహిళా జిమ్నాస్ట్ లు అమెరికన్ జిమ్నాస్టిక్స్ మాజీ వైద్యుడు డాక్టర్ లారీ నాజర్ పైన తిరుగుబాటు చేసి..లైంగిక ఆరోపణల కేసు పెట్టారు.
నాజర్ పై ఫిర్యాదు చేసిన విఖ్యాత జిమ్నాస్ట్ ల్లో యాలీ రైజ్ మాన్, గాబీ డగ్లస్, సిమోనీ బైల్స్ మెక్ క్యాలా మరోనీ సైతం ఉన్నారు.
క్రీడారంగం నుంచి ఈ జాఢ్యాన్ని రూపుమాపాలంటే...క్రీడాసంఘాలలో రాజకీయనాయకుల జోక్యం లేకుండా చర్యలు చేపట్టాలి. రాజకీయాలు, క్రీడారంగం వేర్వేరుగా ఉన్నంత కాలం ఎలాంటి ఇబ్బందులూ ఉండవు, ఆ రెండు కలసిపోతేనే లైంగిక వేధింపుల పర్వం మొదలవుతుంది.
తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న జాతీయ కుస్తీ సమాఖ్య అధ్యక్షుడే దేశంలోని అధికారపార్టీ ఎంపీగా ఉంటే..నిరసనకు దిగిన మహిళావస్తాదులకు న్యాయం జరుగుతుందని భావించడం అత్యాశే అవుతుంది. దేశసర్వోన్నత న్యాయస్థానమే ఈ సమస్యకు పరిష్కారం చెప్పాల్సి ఉంది.