Telugu Global
Sports

కుస్తీ రగడకు తెర..ఆందోళన విరమించిన వస్తాదులు!

మ‌హిళా వస్తాదులను లైంగిక వేధింపుల‌కు గురి చేస్తున్న జాతీయకుస్తీ సమాఖ్య అధ్యక్షుడు పదవి వీడాలంటూ గత మూడురోజులుగా న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న భారత మల్లయోధుల బృందం ఆందోళన విరమించింది.

కుస్తీ రగడకు తెర..ఆందోళన విరమించిన వస్తాదులు!
X

మ‌హిళా వస్తాదులను లైంగిక వేధింపుల‌కు గురి చేస్తున్న జాతీయకుస్తీ సమాఖ్య అధ్యక్షుడు పదవి వీడాలంటూ గత మూడురోజులుగా న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న భారత మల్లయోధుల బృందం ఆందోళన విరమించింది.

జాతీయ కుస్తీ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూష‌ణ్ శరణ్ సింగ్ తో సహా పలువురు శిక్షకులు తమను లైంగికంగా వేధిస్తున్నారంటూ మూడురోజుల క్రితం ఆందోళన చేపట్టిన

భారత వస్తాదులు ఆందోళన విరమించారు. కేంద్ర క్రీడామంత్రి అనురాగ్ ఠాకూర్ ..వస్తాదుల బృందంతో జరిపిన రెండో విడత చర్చలు సఫలం కావడంతో ఆందోళన విరమిస్తున్నట్లు ప్రకటించారు.

పదవివీడిన బ్రిజ్ భూషణ్....

ఈ వివాదానికి కేంద్రబిందువుగా మారిన భారత కుస్తీ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూష‌ణ్ శరణ్ సింగ్...విచారణ ముగిసే వరకూ తమ పదవికి దూరంగా ఉంటారని, లెజెండరీ బాక్సర్ మేరీకోమ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల బృందం విచారణ చేపడుతుందని కేంద్ర క్రీడామంత్రి న్యూఢిల్లీలో ప్రకటించారు.

దేశానికి అంతర్జాతీయంగా పతకాలతో పాటు ఖ్యాతి తెస్తున్న మహిళా వస్తాదులు రోడెక్కి, కన్నీరు పెట్టుకోడంతో పాటు ఆందోళ‌న‌కు దిగటాన్ని భారత ఒలింపిక్ సంఘం తీవ్రంగా ప‌రిగ‌ణించింది.

భార‌త ఒలింపిక్ సంఘం శుక్ర‌వారం సాయంత్రం అత్య‌వ‌స‌రంగా స‌మావేశ‌ం నిర్వహించింది. కేంద్ర క్రీడామంత్రి సూచనల మేరకు.. ఏడుగురు స‌భ్యుల బృందాన్ని సమగ్ర విచారణ కోసం ఏర్పాటు చేసింది.

మేరీకోమ్‌ నేతృత్వంలోని ఈ విచారణ సంఘంలో డోలా బెన‌ర్జీ, అల‌క్‌నంద అశోక్, యోగేశ్వ‌ర్ ద‌త్‌, స‌హ‌దేవ్ యాదవ్ ఇతర సభ్య్లులుగా ఉన్నారు.

కాంగ్రెస్ పై నెపం వేసి విఫలం..

జాతీయ కుస్తీ సంఘానికి చెందిన పలువురు శిక్షకులు తమను లైంగికంగా వేధిస్తున్నారంటూ పలుమార్లు బ్రిజ్ భూషణ్ కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, పైగా తమ క్రీడాజీవితాన్ని అంతం చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డారంటూ ఒలింపిక్ మెడలిస్ట్ వినీత పోగట్ మీడియా సమావేశంలో ప్రకటించింది. భారత జట్టులోని ప్రముఖ వస్తాదులంతా ఈ ఆందోళనలో పాల్గొన్నారు.

జాతీయ కుస్తీ సమాఖ్య అధ్యక్షుడు పదవి వీడే వరకూ తాము ఆందోళన విరమించేది లేదని వస్తాదుల బృందం తెగేసి చెప్పింది. మరోవైపు..తాను ఎలాంటి తప్పు చేయలేదని, ఆరోపణలు రుజువు చేస్తే ఉరివేసుకొంటానంటూ బ్రిజ్ భూషణ్ ఎదురుదాడికి దిగారు. పైగా..ఈ ఆందోళన వెనుక కాంగ్రెస్ పార్టీ హస్తం ఉందంటూ రాజకీయరంగు పులమటానికి ప్రయత్నించారు.

అధికార బీజెపీ అండదండలు పుష్కలంగా ఉన్న బ్రిజ్ భూషణ్ గత్యంతరం లేని స్థితిలో తీవ్రఒత్తిడి నడుమ పదవి నుంచి తాత్కాలికంగా దిగిపోటానికి సమ్మతి తెలిపారు.

విచారణ ముగిసే వరకు మాత్రమే తాను పదవికి దూరంగా ఉంటానని చెప్పారు.

పీటీ ఉష తీవ్రఆందోళన...

మహిళా వస్తాదులపై లైంగిక వేధింపుల ఆరోపణలను జాతీయ ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉష తీవ్రంగా పరిగణించారు. ఆందోళన చేపట్టిన మహిళావస్తాదులకు తమ సంపూర్ణమద్దతు ప్రకటించారు.

బ్రిజ్ భూష‌ణ్‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని భార‌త ఒలింపిక్ సంఘం అధ్య‌క్షురాలు హోదాలో తాను అందుకొన్న లేఖతో విచారణ కమిటీని ఏర్పాటు చేశారు.

టోక్యో ఒలింపిక్స్‌లో ప‌త‌కం సాధించడంలో విఫలమైన వినేష్ ఫోగ‌ట్‌ను కుస్తీ సమాఖ్య అధ్యక్షుడు మానసికంగా వేధింపులకు గురి చేయటంతో ఆమె ఆత్మ‌హ‌త్య‌కు ప్ర‌య‌త్నించింది. అంతేకాదు బ్రిజ్ భూష‌ణ్‌ నుంచి త‌మ ప్రాణాల‌కు ముప్పు ఉంది అని అందులో వివ‌రించారు. వీళ్ల‌కు భ‌జ్‌రంగ్ పూనియా, రాహుల్‌, దీప‌క్ పూనియా వంటి స్టార్ రెజ్ల‌ర్లు సైతం అండగా నిలిచారు.


నాలుగువారాలలో విచారణ నివేదిక..

ఈ వివాదం పై విచారణకు ఏర్పాటు చేసిన కమిటీ నాలుగువారాలలో విచారణ పూర్తి చేసి తమకు నివేదిక అందచేస్తుందని, అప్పటి వరకూ అధ్యక్షపదవి నుంచి బ్రిజ్ భూషణ్ వైదొలుగుతారని క్రీడామంత్రి తెలిపారు. విచారణ కమిటీలో ఇద్దరు న్యాయశాస్త్రనిపుణలు సైతం సభ్యులుగా ఉన్నారు.

ప్రధాని నరేంద్ర మోడీ తమ ఆందోళనను అర్థం చేసుకొన్నారని, వేధింపులకు గురైన మహిళా రెజ్లర్లకు న్యాయం జరగాలన్నదే తమ కోరిక అని ప్రపంచ కుస్తీ మెడలిస్ట్ దీపక్ పూనియా చెప్పాడు.

భారత్ కు ఆసియా క్రీడలు, కామన్వెల్త్ గేమ్స్ లో బంగారు పతకాలు అందించిన వినేశ్ పోగట్..టోక్యో ఒలింపిక్స్ లో మాత్రం విఫలమయ్యింది. ఆ తర్వాత నుంచి తనను మానసికంగా వేధించడం మొదలు పెట్టారని, పలువురు యువవస్తాదులను లక్నో శిక్షణశిబిరం సమయంలో శిక్షకులు లైంగికంగా వేధించారని, వారి పేర్లను విచారణ సంఘం ముందుంచుతామని వినేశ్ పోగట్ కంటనీరు పెట్టుకొంటూ చెప్పింది.

కుస్తీ సమాఖ్య వేధింపులు, బెదిరింపులు తమ జీవితంగా ఓ భాగంగా మారిపోయాయని..రోజూ చనిపోయే బదులు ఒక్కసారిగా మరణిస్తేనే మేలంటూ ప్రపంచ కుస్తీ కాంస్య విజేత సాక్షీమాలిక్ వాపోయింది.

First Published:  21 Jan 2023 4:30 AM GMT
Next Story