మహిళా ఐపీఎల్ ఫైనల్లో ఢిల్లీ, ఎలిమినేటర్ లో ముంబైతో యూపీ ఢీ!
ప్రారంభ మహిళా ఐపీఎల్ ఫైనల్స్ కు ఢిల్లీ క్యాపిటల్స్ నేరుగా చేరుకొంది. ఎలిమినేటర్ ఫైట్ లో ముంబై ఇండియన్స్ తో యూపీ వారియర్స్ అమీతుమీ తేల్చుకోనుంది...
ప్రారంభ మహిళా ఐపీఎల్ ఫైనల్స్ కు ఢిల్లీ క్యాపిటల్స్ నేరుగా చేరుకొంది. ఎలిమినేటర్ ఫైట్ లో ముంబై ఇండియన్స్ తో యూపీ వారియర్స్ అమీతుమీ తేల్చుకోనుంది...
2023 ప్రారంభ మహిళా ఐపీఎల్ లో తొలిదశ..రౌండ్ రాబిన్ లీగ్ సమరం ముగిసింది. ఐదు ( ముంబై, బెంగళూరు, అహ్మదాబాద్, యూపీ, ఢిల్లీ)జట్ల డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ నుంచి అత్యధిక విజయాలతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నేరుగా ఫైనల్స్ కు చేరుకోగా..ముంబై ఇండియన్స్, యూపీ వారియర్స్ జట్లు ఎలిమినేటర్ రౌండ్లో తలపడటానికి అర్హత సంపాదించాయి.
ముంబై వేదికగా..గత మూడువారాలుగా సాగిన ఈ పోరులో ఒక్కోజట్టు ఎనిమిదిమ్యాచ్ లు ఆడింది. బ్రబోర్న్ స్టేడియం, డీవీ పాటిల్ స్టేడియాలు వేదికలుగా సాగిన ఈపోరులో..అత్యంత నిలకడగా రాణించిన ఢిల్లీ, ముంబై, యూపీ ..లీగ్ టేబుల్ మొదటి మూడుస్థానాలలో నిలిచాయి. గుజరాత్ జెయింట్స్, బెంగళూరు రాయల్ చాలెంజర్స్ జట్లు అత్యధిక పరాజయాలతో లీగ్ దశ నుంచే నిష్క్రమించాయి.
లీగ్ టేబుల్ టాపర్ గా ఢిల్లీ....
డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ లో ఆడిన ఎనిమిది రౌండ్ల మ్యాచ్ ల్లో ఢిల్లీ, ముంబై చెరో ఆరు విజయాలు, రెండేసి పరాజయాలతో..12 పాయింట్లు చొప్పున సాధించి సమఉజ్జీగా నిలిచాయి. అయితే మెరుగైన రన్ రేట్ ప్రాతిపదికన ఢిల్లీ అగ్రస్థానంలో నిలవడంతో..నేరుగా ఫైనల్స్ కు చేరుకోగలిగింది.
లీగ్ మొదటి ఐదుమ్యాచ్ ల్లో వరుసగా విజయాలు సాధించిన ముంబైకి..ఆ తర్వాతి రెండురౌండ్ల మ్యాచ్ ల్లో అనుకోని పరాజయాలు ఎదురయ్యాయి. ఆఖరి రౌండ్ మ్యాచ్ లో బెంగళూరును ఓడించడం ద్వారా ఆరవ విజయంతో లీగ్ టేబుల్ లో రెండోస్థానం దక్కించుకొంది.
యూపీకి ఢిల్లీ చెక్...
ఆఖరి రౌండ్ పోరులో యూపీ వారియర్స్ తన ముందుంచిన 139 పరుగుల లక్ష్యఛేదనలో ఢిల్లీ 17.5 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 142 పరుగుల స్కోరుతో విజేతగా నిలిచింది.
కెప్టెన్ మెగ్ ల్యానింగ్ (39), మారిజానె కాప్ (34 నాటౌట్), అలైస్ క్యాప్సె (34)రాణించారు. ల్యానింగ్ ఇన్నింగ్స్‌లో ఐదు ఫోర్లు, రెండు భారీ సిక్స్‌లు ఉన్నాయి.
షబ్నమ్ ఇస్మాయిల్ 29 పరుగులిచ్చి 2 వికెట్లు సాధించింది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ కు దిగిన యూపీ వారియర్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 138 పరుగుల స్కోరు మాత్రమే చేయగలిగింది.
తహిలా మెక్‌గ్రాత్ (58 నాటౌట్) అర్ధసెంచరీతో ఆకట్టుకోగా, కెప్టెన్ అలీస్సా హిలీ (36) ఫర్వాలేదనిపించింది. క్యాప్సె (3/26), రాధా యాదవ్(2/28)రాణించారు. క్యాప్సెకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది.
బెంగళూరుపై ముంబై గెలుపు...
హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వంలోని ముంబైజట్టు తన ఆఖరిరౌండ్ పోరులో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ ను 4 వికెట్ల తేడాతో అధిగమించి ఫ్లే- ఆఫ్ రౌండ్లో నిలిచింది.
ఈ నెల 24న జరిగే ఎలిమినేటర్ రౌండ్లో యూపీ వారియర్స్ తో ముంబై అమీతుమీ తేల్చుకోనుంది. ఎలిమినేటర్ రౌండ్లో నెగ్గినజట్టు ఈనెల 26న జరిగే టైటిల్ సమరంలో
ఢిల్లీ క్యాపిటల్స్ తో తలపడాల్సి ఉంది.
స్మృతి మందన నాయకత్వంలోని బెంగళూరు మొత్తం 8 రౌండ్లలో 6 పరాజయాలతో లీగ్ టేబుల్ అట్టడుగు స్థానాన నిలిచింది. గుజరాత్ జెయింట్స్ జట్టు పరిస్థితి సైతం బెంగళూరుకు ఏమాత్రం భిన్నంగా లేదు.