Telugu Global
Sports

మహిళా ఐపీఎల్ లోనూ అదానీజట్టుకు దెబ్బ మీద దెబ్బ!

గౌతమ్ అదానీ..ఈ పేరు వినగానే అంతర్జాతీయ స్థాయిలో ఓ వివాదాస్పద వ్యాపారవేత్త మాత్రమే కనిపిస్తారు. బొగ్గువ్యాపారం నుంచి మీడియా, క్రికెట్ వ్యాపారాలలో సైతం అదానీ పేరే వినిపిస్తుంది.

మహిళా ఐపీఎల్ లోనూ అదానీజట్టుకు దెబ్బ మీద దెబ్బ!
X

వివాదాస్పద వ్యాపారవేత్త గౌతమ్ అదానీ కి వ్యాపారరంగంలో మాత్రమే కాదు..ఐపీఎల్ మహిళా క్రికెట్లోనూ ఎదురుగాలి వీస్తోంది. భారీ మొత్తాలతో ప్రపంచ మేటి ప్లేయర్లను కొనుగోలు చేసినా వరుస పరాజయాలు తప్పడం లేదు...

గౌతమ్ అదానీ..ఈ పేరు వినగానే అంతర్జాతీయ స్థాయిలో ఓ వివాదాస్పద వ్యాపారవేత్త మాత్రమే కనిపిస్తారు. బొగ్గువ్యాపారం నుంచి మీడియా, క్రికెట్ వ్యాపారాలలో సైతం అదానీ పేరే వినిపిస్తుంది.

ఒకదశలో ప్రపంచంలోనే అత్యంత సంపన్నులలో ఒకరిగా వెలుగు వెలిగిన అదానీ గత కొద్దివారాల కాలంలో వేల కోట్ల రూపాయల విలువను కోల్పోయి పీకలోతు కష్టాలలో కూరుకుపోయారు.

ఐపీఎల్ పురుషుల, మహిళల విభాగాలలో సైతం అదానీ కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడం ద్వారా తన వ్యాపారాసామ్రాజ్యాన్ని విస్తరింప చేసుకొన్నారు.

మహిళా ఐపీఎల్ లో అహ్మదాబాద్ ఫ్రాంచైజీ హక్కులను వేలం ద్వారా 1289 కోట్ల రికార్డు ధరకు అదానీ సొంతం చేసుకొన్నారు. భారీ మొత్తాలు వెచ్చించి ప్రపంచ మేటి ప్లేయర్లను దక్కించుకొన్నారు.

మొదటి రెండుమ్యాచ్ ల్లో దెబ్బ మీద దెబ్బ..

ఐదుజట్లు, 22 మ్యాచ్ ల ప్రారంభ మహిళా ఐపీఎల్ ను అదానీకి చెందిన గుజరాత్ జెయింట్స్ ఘోరపరాజయంతో మొదలు పెట్టింది. రౌండ్ రాబిన్ లీగ్ తొలిరౌండ్ పోరులో ముంబై ఇండియన్స్ చేతిలో 143 పరుగుల ఘోరపరాజయం చవిచూసింది.

తొలి ఓటమి నుంచి తేరుకోక ముందే..రెండోమ్యాచ్ లో సైతం ఉత్తరప్రదేశ్ వారియర్స్ చేతిలో 3 వికెట్ల ఓటమి ఎదురయ్యింది.

గ్రేస్ హ్యారిస్ సుడిగాలి ఇన్నింగ్స్..

నవీ ముంబై డాక్టర్ డీవై పాటిల్ స్టేడియం వేదికగా జరిగిన తన రెండోరౌండ్ మ్యాచ్ లో గుజరాత్ జెయింట్స్ కు యూపీ వారియర్స్ చేతిలో సైతం ఓటమి తప్పలేదు. ఆఖరి ఓవర్ వరకూ ఉత్కంఠభరితంగా సాగిన పోరులో యూపీ హిట్టర్ గ్రేస్ హారిస్ సుడిగాలి హాఫ్ సెంచరీతో తనజట్టుకు అనూహ్యం విజయం అందించింది.

మ్యాచ్ నెగ్గాలంటే ఆఖరి మూడు ఓవర్లలో 53 పరుగులు చేయాల్సిన యూపీని గ్రేస్ హారిస్ అజేయ అర్థశతకంతో విజేతగా నిలిపింది.

170 పరుగుల విజయలక్ష్యంతో చేజింగ్ కు దిగిన యూపీ 3 వికెట్లతో అనూహ్య విజయాన్ని సొంతం చేసుకోగలిగింది.

ఒక దశలో 105 పరుగులకే 7 వికెట్లు నష్టపోయి..ఓటమి తప్పదనుకొన్న యూపీకి సోఫీ ఎక్లెస్టోన్, గ్రేస్ హ్యారిస్ 8వ వికెట్‌కు 70 పరుగుల కీలక భాగస్వామ్యంతో ఊపిరి పోశారు. గ్రేస్ హారిస్ కేవలం 26 బాల్స్ లోనే 7 బౌండ్రీలు, 3 సిక్సర్లతో 59 పరుగులతో అజేయంగా నిలిచింది.

కిమ్ గార్డ్నర్ కు 5 వికెట్లు

అంతకుముందు గుజరాత్ స్టార్ ఆల్ రౌండర్ కిమ్ గార్డ్నర్ 5 వికెట్లతో చెలరేగిపోడంతో యూపీ వరుసగా వికెట్లు నష్టపోతూ వచ్చింది.

కిర‌ణ్ న‌వ్‌గిరే (53), ఎలిసా హేలీ (7), శ్వేతా షెరావ‌త్(5), త‌హిలా మెక్‌గ్రాత్‌, సిమ్రాన్ షేక్‌ల‌ను గార్డ్నర్ పడగొట్టింది. నాలుగో వికెట్‌కు కిర‌ణ్ న‌వ్‌గిరే (53), దీప్తి శ‌ర్మ (11) 66 ప‌రుగులు జోడించారు. దీప్తిని మ‌న్షి జోషి ఔట్ చేసి బ్రేక్ ఇచ్చింది. 13 ర‌న్స్ వ‌ద్ద యూపీ మొద‌టి వికెట్ కోల్పోయింది.

గార్డ్‌న‌ర్, హ‌ర్లీన్ బ్యాటు ఝళిపించినా...

ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ కు దిగిన గుజ‌రాత్ జెయింట్స్ 169 ప‌రుగుల స్కోరు సాధించింది. హ‌ర్లీన్ డియోల్ (46) రాణించ‌డంతో ఆ జ‌ట్టు అంత స్కోర్ చేయ‌గ‌లిగింది. 76 ర‌న్స్‌కే నాలుగు వికెట్లు కోల్పోయిన ద‌శ‌లో.. గార్డ్‌న‌ర్, హ‌ర్లీన్ వేగంగా ఆడి జ‌ట్టు భారీ స్కోర్‌కు బాట‌లు వేశారు.

ఓపెన‌ర్లు స‌బ్బినేని మేఘ‌న (24), సోఫియా డంక్లే (13) స్వ‌ల్ప స్కోర్‌కే వెనుదిరిగారు. గార్డ్‌న‌ర్ (25), ద‌య‌లాన్ మేహ‌ల‌త (21 నాటౌట్‌) చివ‌ర్లో ధాటిగా ఆడారు. యూపీ వారియ‌ర్స్ బౌల‌ర్ల‌లో ఎక్లెస్టోన్, దీప్తి శ‌ర్మ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అంజ‌లి స‌ర్వాని, త‌హిలా మెక్‌గ్రాత్‌కు ఒక్కో వికెట్ ద‌క్కింది. తొలి మ్యాచ్‌లో రిటైర్డ్ హ‌ర్ట్‌గా మైదానం వీడిన కెప్టెన్ బేత్ మూనీ ఈ మ్యాచ్ కు సైతం దూరంగా ఉంది.

రెండుకు రెండు రౌండ్ల మ్యాచ్ ల్లో ఓటమి పొందిన అదానీ కమ్ గుజరాత్ జట్టు మిగిలిన పోటీలలో నిలకడగా రాణించకుంటే టైటిల్ ఆశలకు నీళ్లు వదులుకోక తప్పదు.

First Published:  6 March 2023 10:19 AM IST
Next Story