భారత కుస్తీ సమాఖ్య మెడపై నిషేధం కత్తి!
వివాదాస్పద జాతీయ కుస్తీ సమాఖ్య మెడపై నిషేధం కత్తి వేలాడుతోంది. మహిళా రెజ్లర్ల నిరసనతో అంతర్జాతీయంగా అల్లరిపాలైన కుస్తీ సమాఖ్య మనుగడ ప్రశ్నార్థకంగా మారింది.
వివాదాస్పద జాతీయ కుస్తీ సమాఖ్య మెడపై నిషేధం కత్తి వేలాడుతోంది. మహిళా రెజ్లర్ల నిరసనతో అంతర్జాతీయంగా అల్లరిపాలైన కుస్తీ సమాఖ్య మనుగడ ప్రశ్నార్థకంగా మారింది.
భారత కుస్తీ సమాఖ్యకు, ఏడుగురు మహిళా రెజ్లర్లకు నడుమ జరుగుతున్న పోరాటం రోజురోజుకూ ముదిరిపాకానపడుతోంది. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత కుస్తీ సమాఖ్య అధ్యక్షుడు, బీజెపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై ఓ క్రిమినల్ కేసుతో సహా మొత్తం 43 ఎఫ్ఐఆర్ లు నమోదై ఉన్నాయి.
ప్రభుత్వ అండదండలు పుష్కలంగా ఉన్నఅలాంటి వ్యక్తితో మహిళారెజ్లర్లు పోరాడుతున్నారు.
నిరసన పాటిస్తున్న మహిళా రెజ్లర్ల పట్ల ఢిల్లీ పోలీసులు వ్యవహరించిన తీరును అంతర్జాతీయ కుస్తీ సమాఖ్య సైతం తప్పుపట్టింది. లైంగిక వేధింపులకు గురైన మహిళా రెజ్లర్లు నిరసన తెలుపుతుంటే వారికి న్యాయం చేయాల్సింది పోయి..వారిపైనే దౌర్జన్యం చేస్తారా? దాష్టీకం చేస్తారా? అంటూ పలు అంతర్జాతీయ సంస్థలు, ప్రముఖులు నిలదీస్తున్నారు.
ఓ కంట గమనిస్తూనే ఉన్నాం..
భారత్ లో జరుగుతున్న పరిణామాలను ఓ కంట గమనిస్తూనే ఉన్నామని, తమకు న్యాయం చేయాలంటూ నిరసనకు దిగిన మహిళా వస్తాదుల పట్ల పోలీసుల ప్రవర్తన
దారుణమని అంతర్జాతీయ ఒలింపిక్ సమాఖ్యతో పాటు అంతర్జాతీయ కుస్తీ సమాఖ్య సైతం ఆందోళన వ్యక్తం చేసింది.
వచ్చే 45 రోజుల్లో జాతీయ కుస్తీ సమాఖ్యకు తమ నిబంధనలకు అనుగుణంగా ఎన్నికలు నిర్వహించకుంటే భారత కుస్తీ సమాఖ్యపై నిషేధం విధించడం ఖాయమని హెచ్చరించింది.
అంతర్జాతీయ ఒలింపిక్స్ సమాఖ్య నిబంధనల ప్రకారం..జాతీయక్రీడాసంఘాలలో రాజకీయనాయకుల జోక్యం ఉండకూడదు. వివిధ పార్టీలకు చెందిన రాజకీయనాయకులు, ఎంపీలు క్రీడాసంఘాల ఎన్నికల్లో పాల్గొనే వీలుసైతం లేదు. అయితే..బీజెపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ మాత్రం తన రాజకీయబలంతో గత కొద్దిసంవత్సరాలుగా జాతీయ కుస్తీ సమాఖ్యను తన గుప్పిట్లో ఉంచుకొంటూ వస్తున్నారు. మహిళా రెజ్లర్లపట్ల అనుచితంగా వ్యవహరించడం, తన సొంత ఆస్తిగా పరిగణిస్తారన్న విమర్శలు, ఆరోపణలు సైతం ఎదుర్కొంటున్నారు.
కుస్తీ సమాఖ్య అధ్యక్షుడిపై వచ్చిన ఆరోపణలపై ఢిల్లీ పోలీసుల విచారణ తీరు ఏమాత్రం సమర్థనీయం కాదని, నిష్పాక్షికంగా విచారణ జరపాలని అంతర్జాతీయ కుస్తీ సమాఖ్య సూచించింది.
భారత కుస్తీ సమాఖ్య సమావేశాలు నిర్వహించాలని, 45 రోజుల్లోగా కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకోవాలని, ఒకవేళ ఎన్నికలు నిర్వహించకుంటే ఫెడరేషన్‌ను రద్దు చేస్తామని, అప్పుడు అథ్లెట్లు తటస్థ జెండాపై పోటీల్లో పాల్గొనాల్సి వస్తుందని, ఇప్పటికే ఈ ఏడాది ఢిల్లీలో జరగాల్సిన ఆసియా చాంపియన్‌షిప్‌ను మరో చోటుకు తరలించే నిర్ణయం తీసుకున్నట్లు ఆ ప్రకటనలో గుర్తుచేశారు.
మనసు మార్చుకొన్న వస్తాదులు...
న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద గత ఐదువారాలుగా నిరసన చేపట్టిన తమ శిబిరాన్ని ఢిల్లీ పోలీసులు ధ్వంసం చేసి, శిబిరాన్ని ఖాళీ చేయించినా రెజర్లు పట్టు వీడలేదు. తమ సహనానికి పరీక్ష ఎదురవుతున్నా.. న్యాయం కోసం సుదీర్ఘ పోరాటానికే సిద్ధమయ్యారు. ఆత్మ గౌరవమే తమకు ముఖ్యమని, తమ పోరాటంలో ప్రాణాలైనా వదిలేస్తామని స్పష్టం చేశారు.ఆరోపణలు ఎదుర్కొంటున్న తమ పార్టీ ఎంపీ బ్రిజ్ భూషణ్‌పై మోదీ సర్కార్ చర్యలు తీసుకోకపోతే ఆమరణ దీక్షకూ సిద్ధమని ప్రకటించారు. కేంద్రం నిర్లక్ష్య వైఖరికి నిరసనగా తమకు, దేశానికి కీర్తి తెచ్చి పెట్టిన పతకాలను గంగలో నిమజ్జనం చేయడానికి ప్రయత్నించారు. మరోవైపు రెజ్లర్ల పట్ల కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మాజీ, ప్రస్తుత ప్రముఖ క్రీడాకారులు ఢిల్లీ పోలీసుల దురుసు ప్రవర్తనపై, కేంద్రం వ్యవహార శైలిపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
రెజ్లర్ల పోరాటానికి తమ మద్దతు తెలిపారు. దీంతో ఇప్పటికే రైతు సంఘాలు, మహిళా సంఘాలు, రాజకీయ పార్టీల మద్దతుతో ముందుకు సాగుతున్న మహిళా రెజ్లర్ల పోరాటం మరింత ఉధృతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యానికి ప్రతీకగా నిలిచే భారత సరికొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం సాక్షిగా తమ నిరసన దీక్షపై కేంద్రం సాగించిన దమన కాండతో రెజ్లర్లు తల్లడిల్లిపోయారు.
ఒలింపిక్స్, ప్రపంచ, ఆసియా కుస్తీ పోటీలలో తాము సాధించిన పతకాలను హరిద్వార్ లోని గంగలో కలిపేయాలని నిర్ణయించారు. మంగళవారం సాయంత్రం రెజ్లర్లు హరిద్వార్‌లోని హరికీ పౌరీ ఘాట్ వద్ద పతకాలను నిమజ్జనం చేయడానికి ప్రయత్నించారు. అయితే వారి ప్రయత్నాన్ని రైతు నేత నరేశ్ టికాయిత్ వారించి, పతకాలను వారి వద్ద నుంచి తీసేసుకున్నారు. టికాయిత్ విజ్ఞప్తి మేరకు పతకాల నిమజ్జనాన్ని రెజ్లర్లు అయిదు రోజుల పాటు వాయిదా వేశారు. రెజ్లర్లకు మద్దతుగా వందలాది మంది అభిమానులు, రైతులు, స్థానికులు హరిద్వార్‌కు తరలి వచ్చారు.
మరోసారి ఖాప్ పంచాయత్...
కేంద్రం దిగి రాకపోతే ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద ఆమరణ దీక్ష కొనసాగిస్తామని ప్రకటించారు. బ్రిజ్ భూషణ్‌పై చర్యలు కోరుతూ బుధవారం ఖాప్ పంచాయత్ నిర్వహిస్తామని రైతు నేతలు తెలిపారు. మంగళవారం ఉదయం కేంద్ర ప్రభుత్వ తీరుపై ట్విట్టర్ వేదికగా స్టార్ రెజ్లర్ సాక్షి మాలిక్ ఆవేదన వ్యక్తం చేశారు. దోషులను చూసి వ్యవస్థ భయపడుతున్నదన్నారు. ‘ఈ పతకాలే మా ప్రాణాలు, ఆత్మలు. వాటిని గంగలో నిమజ్జనం చేశాక మేం జీవించడానికి అర్థం ఉండదు. కాబట్టి చావు వచ్చే వరకు నిరాహార దీక్ష కొనసాగిస్తాం’ అని రెజ్లర్లు ప్రటించారు. కేంద్రం మొత్తం ఒక వ్యక్తిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నదని టికాయత్ వ్యాఖ్యానించారు. మరోవైపు ఇండియా గేట్ జాతీయ స్మారక చిహ్నమైనందున అక్కడ అమరణ దీక్షకు అనుమతి ఇవ్వమని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు.
ఎంతకాలం కాపాడతారు.....
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎంపీని రక్షించడానికే కేంద్రం ఇంతగా దిగజారాలా అని తెలంగాణా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు ప్రశ్నించారు. బ్రిజ్ భూషణ్‌ను రక్షించడానికి కేంద్రం ఎందుకు ఇంత దూరం వెళుతున్నదని ఆయన నిలదీశారు. బ్రిజ్ భూషణ్ కు. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా రక్షణ కల్పిస్తున్నారని మండిపడ్డారు. రెజ్లర్లు తమ పతకాలను గంగలో కలిపేయాలని అనుకోడం దేశానికి సిగ్గుచేటని ట్విట్టర్‌లో ఆందోళన వ్యక్తం చేశారు.
భారత మాజీ కెప్టెన్ అనీల్ కుంబ్లే, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఢిల్లీ పోలీసులు, ప్రభుత్వం వ్యవహరించిన తీరును తప్పు పట్టారు.
మరోవైపు..నిరసన చేపట్టిన వస్తాదులకు మద్దతుగా తాము కోల్‌కతాలో ఓ భారీ ర్యాలీ నిర్వహిస్తామని పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ ప్రకటించారు.
. రెజ్లర్లని కూతుళ్లని పిలిచే ప్రధాని మోదీ.. వారికి తగిన న్యాయం చేయలేరా అంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ప్రశ్నించారు. రెజ్లర్లతో ఢిల్లీ పోలీసులు దురుసుగా ప్రవర్తించి ఉండాల్సింది కాదని మాజీ క్రికెటర్లు కపిల్ దేవ్, జావెలిన్ త్రోలో ఒలింపిక్ పతక విజేత నీరజ్ చోప్రా అభిప్రాయపడ్డారు. ఈ కష్ట సమయంలో న్యాయం కోరుతున్న రెజ్లర్లకు మనం అండగా నిలవాలని టెన్నిస్ స్టార్ సానియా మీర్జా పిలుపునిచ్చారు. రెజ్లర్లను పోలీసులు ఈడ్చి పారేయడంపై జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశామని టీఎంసీ తెలిపింది.
బ్రిజ్ భూషణ్‌పై మైనర్ రెజ్లర్ చేసిన లైంగిక వేధింపుల ఆరోపణల కేసును ఏ కోర్టు విచారణ చేయాలన్న విషయాన్ని తాము నిర్ణయిస్తామని ఢిల్లీ హైకోర్టు మంగళవారం తెలిపింది. తదుపరి విచారణను జులై 6న చేస్తామని ప్రకటించింది.
భారత ఒలింపిక్ సంఘానికి అనుబంధంగా ఉన్న వివిధ క్రీడాసంఘాలలో 2010 నుంచి 2020 మధ్యకాలంలో శిక్షకులు, సహాయశిక్షకులు, క్రీడాసంఘాల ప్రముఖులు, మంత్రులపై మొత్తం 45 లైంగిక, అత్యాచార ఆరోపణలు రావటం, కేసులు నమోదు కావడం విశేషం. కేవలం కుస్తీ సమాఖ్య ప్రముఖుల పైనే 20కి పైగా అత్యాచార ఆరోపణలు నమోదయ్యాయి.