ఐసీసీ టెస్టు లీగ్ ఫైనల్లో రెండోసారి భారత్!
సాంప్రదాయ టెస్టు క్రికెట్ రెండోర్యాంకర్ భారత్ వరుసగా రెండోసారి ఐసీసీ టెస్టు లీగ్ ఫైనల్స్ కు చేరుకొంది. ఈ ఘనత సాధించిన తొలిజట్టుగా నిలిచింది.
సాంప్రదాయ టెస్టు క్రికెట్ రెండోర్యాంకర్ భారత్ వరుసగా రెండోసారి ఐసీసీ టెస్టు లీగ్ ఫైనల్స్ కు చేరుకొంది. ఈ ఘనత సాధించిన తొలిజట్టుగా నిలిచింది.
ప్రపంచ టాప్ ర్యాంకర్ ఆస్ట్ర్ర్రేలియాతో బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ కోసం జరిగిన నాలుగుమ్యాచ్ ల టెస్టు సిరీస్ ను 2-1తో గెలుచుకోడం ద్వారా రోహిత్ శర్మ నాయకత్వంలోని భారతజట్టు వరుసగా రెండోసారి టెస్టు లీగ్ ఫైనల్స్ కు చేరుకోగలిగింది.
అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ముగిసిన ఆఖరి టెస్టు డ్రాగా ముగియటం, క్ర్రైస్ట్ చర్చి వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో న్యూజిలాండ్ 2 వికెట్ల విజయం సాధించడంతో ఐసీసీ ఫైనల్స్ చేరే రెండో జట్టు ఏదో తేలిపోయింది.
లీగ్ టేబుల్ రెండోస్థానంలో భారత్..
టెస్టు హోదా పొందిన జట్లన్నీ ఐసీసీ టెస్టు లీగ్ సిరీస్ లో పాల్గొంటూ వస్తున్నాయి. ఫైనల్ చేరటమే లక్ష్యంగా మొత్తం 10 జట్లు తలపడుతున్నాయి. రెండేళ్ల క్రితం ముగిసిన ప్రారంభ ఐసీసీ టెస్టు లీగ్ ఫైనల్ కు భారత్, న్యూజిలాండ్ జట్లు చేరుకొంటే..ఈసారి ( 2023 లీగ్ ) ఫైనల్స్ కు భారత్ తో పాటు ఆస్ట్ర్ర్రేలియా సైతం చేరుకోగలిగింది.
మొత్తం 10 జట్ల లీగ్ లో అత్యధిక విజయాల శాతంతో మొదటి రెండుస్థానాలలో నిలిచినజట్లకే ఫైనల్స్ చేరే అవకాశం ఉంటుంది. ప్రస్తుత సిరీస్ లో టెస్ట్ క్రికెట్ నంబర్ వన్ ర్యాంకర్ ఆస్ట్ర్రేలియా, రెండోర్యాంకర్ భారతజట్టు అత్యధిక పాయింట్లు సాధించడం ద్వారా ..మొదటి రెండుస్థానాలలో నిలిచినజట్లుగా ఫైనల్స్ బెర్త్ లు ఖాయం చేసుకోగలిగాయి.
ఇండోర్ హోల్కార్ స్టేడియం వేదికగా భారత్ తో ముగిసిన మూడోటెస్టులో 10 వికెట్ల విజయం సాధించడం ద్వారా ఆస్ట్ర్రేలియా..ఐసీసీ టెస్టు లీగ్ ఫైనల్స్ చేరిన తొలిజట్టుగా నిలిచింది.
ఇక ..రెండో బెర్త్ కోసం భారత్, శ్రీలంక, దక్షిణాఫ్రికా రేస్ లో నిలిచాయి.
బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీతో భారత్ కు బెర్త్..
ప్రపంచ నంబర్ వన్ ఆస్ట్ర్ర్రేలియాతో బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ కోసం జరిగిన నాలుగుమ్యాచ్ ల సిరీస్ ను 2-1తో గెలుచుకోడం ద్వారా భారత జట్టు ప్రత్యర్థి శ్రీలంక, దక్షిణాఫ్రికాలను అధిగమించింది.
శ్రీలంక ఫైనల్ చేరాలంటే..న్యూజిలాండ్ తో రెండుమ్యాచ్ ల సిరీస్ ను 2-0తో నెగ్గితీరాల్సి ఉంది. అయితే..క్రైస్ట్ చర్చి వేదికగా జరిగిన తొలిటెస్టును శ్రీలంక 2 వికెట్ల తేడాతో చేజార్చుకొంది. శ్రీలంక ఓటమి భారత్ కు పరోక్షంగా అనుకూలించింది.
జూన్ 7 నుంచి ఓవల్ లో టైటిల్ సమరం...
ఐసీసీ టెస్టు లీగ్ టైటిల్ కోసం ఇంగ్లండ్ లోని ఓవల్ వేదికగా జూన్ 7 నుంచి 11 వరకూ జరిగే ఫైనల్స్ లో టాప్ ర్యాంక్ జట్లు ఆస్ట్ర్రేలియా, భారత్ అమీతుమీ తేల్చుకోనున్నాయి.
రెండేళ్ల క్రితం ముగిసిన ప్రారంభ టెస్టు లీగ్ ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో పరాజయం పొంది ..రన్నరప్ స్థానంతో సరిపెట్టుకొన్న భారత్..రెండోసారి ఫైనల్స్ చేరడం ద్వారా ట్రోఫీకి గురిపెట్టింది.
కీలక ఆటగాళ్లందరికీ తగిన విశ్రాంతి నివ్వడం, తక్కువ ఐపీఎల్ మ్యాచ్ లు ఆడేలా జాగ్రత్త తీసుకోడం ద్వారా టైటిల్ సమరానికి సిద్ధంకావాలని భారత టీమ్ మేనేజ్ మెంట్ భావిస్తోంది.