Telugu Global
Sports

టెస్టు లీగ్ ఫైనల్ కు భారత్ ఎంతెంత దూరం?

ఐసీసీ టెస్టు లీగ్ ఫైనల్స్ కు వరుసగా రెండోసారి చేరటానికి మాజీ రన్నరప్ భారత్ ఉబలాటపడుతోంది. నాగపూర్ టెస్టు విజయంతో ఫైనల్స్ బెర్త్ కు మరింత చేరువయ్యింది.

టెస్టు లీగ్ ఫైనల్ కు భారత్ ఎంతెంత దూరం?
X

ఐసీసీ టెస్టు లీగ్ ఫైనల్స్ కు వరుసగా రెండోసారి చేరటానికి మాజీ రన్నరప్ భారత్ ఉబలాటపడుతోంది. నాగపూర్ టెస్టు విజయంతో ఫైనల్స్ బెర్త్ కు మరింత చేరువయ్యింది...

ప్రతిష్టాత్మక ఐసీసీ టెస్టు లీగ్ ఫైనల్స్ కు రెండోర్యాంకర్ భారత్ రెండడుగుల దూరంలో నిలిచింది. వరుసగా రెండోసారి టైటిల్ సమరంలో అడుగుపెట్టటానికి తహతహలాడుతోంది.

తొమ్మిదిజట్ల టెస్టు లీగ్ లో రెండోర్యాంకర్ గా ఉన్న భారత్..ఫైనల్స్ బెర్త్ కోసం సొంతగడ్డపై టాప్ ర్యాంకర్ ఆస్ట్ర్రేలియా ప్రత్యర్థిగా ప్రారంభమైన నాలుగుమ్యాచ్ ల సిరీస్ లో ఇన్నింగ్స్ విజయంతో శుభారంభం చేసింది.

నాగపూర్ గెలుపుతో టాప్ గేర్...

టెస్టులీగ్ లో టాప్ ర్యాంకర్ ఆస్ట్ర్రేలియా ఇప్పటికే అత్యధిక పాయింట్లతో ఫైనల్స్ బెర్త్ ఖాయం చేసుకోగా..రెండో బెర్త్ కోసం భారత్, దక్షిణాఫ్రికాజట్లు పోటీపడుతున్నాయి.

భారతజట్టు టెస్టు లీగ్ ఫైనల్స్ చేరాలంటే ఆస్ట్ర్రేలియాతో జరుగుతున్న నాలుగుమ్యాచ్ ల సిరీస్ ను 2-1 లేదా 3-1తో నెగ్గితీరాల్సి ఉంది. నాగపూర్ విదర్భ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన ఐదురోజుల టెస్టును ఆతిథ్య భారత్ మూడోరోజు ఆటలోనే ముగించడం ద్వారా ఇన్నింగ్స్ 132 పరుగుల భారీవిజయం నమోదు చేసింది.

నాగపూర్ టెస్టు విజయంతో నాలుగుమ్యాచ్ ల సిరీస్ లో 1-0తో పైచేయి సాధించిన భారత్ మిగిలిన మూడుటెస్టుల్లో కనీసం రెండుమ్యాచ్ ల్లో నెగ్గితీరాల్సి ఉంది.

న్యూఢిల్లీ, ధర్మశాల, అహ్మదాబాద్ వేదికలుగా మార్చి మొదటివారం వరకూ సిరీస్ లోని మిగిలిన మూడుటెస్టులు జరుగనున్నాయి.

లీగ్ టేబుల్ రెండోస్థానంలో భారత్..

తొమ్మిదిజట్ల టెస్టు లీగ్ పాయింట్ల పట్టిక మొదటి రెండుస్థానాలలో టాప్ ర్యాంకర్ ఆస్ట్ర్రేలియా, రెండోర్యాంకర్ భారత్ కొనసాగుతున్నాయి. ప్రస్తుత సిరీస్ లోని నాగపూర్ టెస్టు వరకూ ఆస్ట్ర్రేలియా విజయాలశాతం 70.83 కాగా..భారత్ 61.67 విజయశాతంతో రెండోస్థానంలో నిలిచింది.

భారత్ తో సిరీస్ కు ముందు వరకూ 75.56 విజయశాతం సాధించిన ఆస్ట్ర్రేలియా..నాగపూర్ టెస్టు ఘోరపరాజయంతో 70.83కు పడిపోయింది.

ప్రారంభ టెస్టు లీగ్ విన్నర్ న్యూజిలాండ్, ఇంగ్లండ్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, వెస్టిండీస్, జింబాబ్వే జట్లు ..ఫైనల్స్ రేస్ కు ఇప్పటికే దూరం కాగా...దక్షిణాఫ్రికాజట్టు మాత్రమే..భారత్ కు ప్రధానప్రత్యర్థిగా ఉంది.

దక్షిణాఫ్రికా భారత్ ను అధిగమించడం ద్వారా టెస్టు లీగ్ ఫైనల్స్ చేరాలంటే ఇంగ్లండ్ తో జరిగే టెస్టు సిరీస్ లో క్లీన్ స్వీప్ విజయం సాధించాల్సి ఉంది. అయితే..ఇంగ్లండ్ ను ఇంగ్లండ్ లో ఓడించడం, క్లీన్ స్వీప్ విజయం సాధించడం అంతతేలికకాదు.

ఏది ఏమైనా..దక్షిణాఫ్రికా జయాపజయాలతో పనిలేకుండా..భారత్ టెస్టు లీగ్ ఫైనల్స్ చేరాలంటే...మిగిలిన మూడుటెస్టుల్లో ఆస్ట్ర్రేలియాను కనీసం రెండుమ్యాచ్ ల్లో ఓడించి తీరక తప్పదు కాక తప్పదు.

ఐసీసీ రెండో టెస్టు లీగ్ ఫైనల్స్ కు ఇంగ్లండ్ లోని ఓవల్ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది.

First Published:  12 Feb 2023 12:00 PM IST
Next Story