Telugu Global
Sports

గల్ఫ్ గడ్డపై నేటినుంచే ప్రపంచ సాకర్ పండుగ!

నాలుగేళ్లకోసారి ప్రపంచ వ్యాప్తంగా వందలకోట్ల అభిమానులను అలరిస్తూ వస్తున్న ఫుట్ బాల్ ప్రపంచకప్ ఈసారి ఆసియాఖండ దేశం ఖతర్ ఆతిథ్యమిస్తోంది.

గల్ఫ్ గడ్డపై నేటినుంచే ప్రపంచ సాకర్ పండుగ!
X

గల్ఫ్ గడ్డపై నేటినుంచే ప్రపంచ సాకర్ పండుగ!

నాలుగేళ్లకోసారి ప్రపంచ వ్యాప్తంగా వందలకోట్ల అభిమానులను అలరిస్తూ వస్తున్న ఫుట్ బాల్ ప్రపంచకప్ ఈసారి ఆసియాఖండ దేశం ఖతర్ ఆతిథ్యమిస్తోంది. దోహాలో ఈ రోజు నుంచి మూడువారాలపాటు సాగే ప్రపంచ సమరంలో 32 దేశాలకు చెందిన హేమాహేమీజట్లు ఢీ కొనబోతున్నాయి...

ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడాసంరంభంగా పేరుపొందిన ఫిఫా ప్రపంచకప్ ఫుట్ బాల్ టోర్నీల పరంపరలో భాగంగా జరిగే 2022 సమరానికి గల్ఫ్ గడ్డ ఖతర్ లో కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది.

భారత కాలమానం ప్రకారం ఈరోజు రాత్రి 7 గంటలకు ఖతర్ రాజధాని దోహాలో నిర్మించిన అత్యాధునిక స్టేడియం వేదికగా జరిగే ప్రారంభమ్యాచ్ లో ఆతిథ్య ఖతర్ తో మధ్యఅమెరికాజట్టు ఈక్వెడోర్ అమీతుమీ తేల్చుకోనుంది.

32 జట్ల మహాసమరం..

ప్రపంచ ఫుట్ బాల్ సమాఖ్య (ఫిఫా)లో 204 దేశాలకు సభ్యత్వం ఉంటే..గత మూడేళ్లుగా వివిధ ఖండాల స్థాయిలో జరిగిన క్వాలిఫైయింగ్ దశ నుంచి ర్యాంకులతో సంబంధం లేకుండా మొత్తం 32 జట్లు ఫైనల్ రౌండ్ కు అర్హత సంపాదించాయి.

ఖతర్ కు నేరుగా అర్హత..

పోటీలకు ఆతిథ్యమిస్తున్న ఖతర్ నేరుగా పాల్గొంటుంటే..యూరోప్ కు చెందిన 13జట్లతో పాటు ఆసియాకు చెందిన నాలుగు, ఆఫ్రికాకు చెందిన ఐదుజట్లు, ఉత్తర అమెరికానుంచి మూడుజట్లు ఫైనల్ రౌండ్ కు చేరుకోగలిగాయి.

జనాభా పరంగా ప్రపంచంలోనే అతిచిన్న దేశాలలో ఒకటిగా ఉన్న కాస్టారికా ప్రపంచకప్ కు అర్హత సాధించిన చివరిజట్టుగా నిలిచింది.న్యూజిలాండ్‌తో జరిగిన ఇంటర్‌ కాంటినెంటల్‌ ప్లే ఆఫ్‌ మ్యాచ్‌లో కోస్టారికా 1–0తో నెగ్గడం ద్వారా 32వ బెర్త్ ను ఖాయం చేసుకోగలిగింది.

కేవలం 50 లక్షల జనాభామాత్రమే కలిగిన కోస్టారికా మొత్తం మీద ఆరోసారి, వరుసగా మూడోసారి ప్రపంచకప్ ఫైనల్స్ కు చేరినజట్టుగా నిలిచింది.

2018 ప్రపంచకప్ సాకర్ టోర్నీ వరకూ ఐదుసార్లు ప్రపంచకప్‌లో పాల్గొ ని 2014లో క్వార్టర్‌ ఫైనల్‌కు చేరుకుంది.

ఇవీ ఆ 32 జట్లు...

ప్రపంచకప్ ఫైనల్ రౌండ్ బరిలో నిలిచిన మొత్తం 32 జట్లలో ఖతర్, జర్మనీ, డెన్మార్క్, బ్రెజిల్, ఫ్రాన్స్, బెల్జియం, క్రొయేషియా, స్పెయిన్, సెర్బియా, ఇంగ్లండ్, స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్, అర్జెంటీనా, ఇరాన్, దక్షిణ కొరియా, జపాన్, సౌదీ అరేబియా, ఈక్వెడోర్, ఉరుగ్వే, కెనడా, ఘనా, సెనెగల్, పోర్చుగల్, పోలాండ్, ట్యునీసియా, కమెరూన్, అమెరికా, మెక్సికో, వేల్స్, ఆస్ట్ర్రేలియా, కోస్టారికా ఉన్నాయి.

గ్రూప్ లీగ్ కమ్ నాకౌట్ తరహాలో జరిగే ఈ సమరంలో మొత్తం 32 జట్లను 8 గ్రూపులుగా విభజించారు. గ్రూపు టాపర్లుగా నిలిచిన ఎనిమిదిగ్రూపుల జట్లు నాకౌట్ రౌండ్లో పోటీపడతాయి.

గ్రూపు-ఏలో ఖతర్, ఈక్వెడోర్, సెనెగల్, నెదర్లాండ్స్, గ్రూప్ -బిలో ఇంగ్లండ్, ఇరాన్, అమెరికా,వేల్స్ పోటీపడతాయి. గ్రూప్-సీ లో అర్జెంటీనా, సౌదీ అరేబియా, మెక్సికో, పోలెండ్, గ్రూప్ - డీలో ఫ్రాన్స్, ఆస్ట్ర్రేలియా, డెన్మార్క్, ట్యునీసియా తలపడతాయి.

గ్రూపు-ఇ లో స్పెయిన్, కోస్టారికా, జర్మనీ, జపాన్, గ్రూపు-ఎఫ్ లో బెల్జియం, కెనడా, మొరాకో, క్రొయేషియా, గ్రూపు- జీలో బ్రెజిల్, సెర్బియా, స్విట్జర్లాండ్,కమెరూన్,

గ్రూపు-హెచ్ లో పోర్చుగల్, దక్షిణ కొరియా, ఉరుగ్వే, ఘనా ఢీ కొంటాయి.

హాట్ ఫేవరట్ బ్రెజిల్...

ప్రపంచకప్ ఎప్పుడు జరిగినా...బరిలో ఎన్నిజట్లుగా నిలిచినా హాట్ ఫేవరెట్ జట్టు ఏదంటే బ్రెజిల్ అన్నపేరే బయటకు వస్తుంది. ప్రపంచకప్ సాకర్ చరిత్రలోనే అత్యధికంగా ఐదుటైటిల్స్ సాధించిన ఏకైకజట్టు బ్రెజిల్ మాత్రమే. అభిమానుల్లో సాంబాజట్టుగా పేరున్న బ్రెజిల్ జట్టులో నైమార్ తో సహా పలువురు ప్రతిభావంతులైన ఆటగాళ్లున్నారు.

ఫుట్ బాల్ అంటే మొరటుగా ఆడే క్రీడ ఏమాత్రం కాదని, సొగసుగా, కళాత్మకంగా ఆడే ఆటని బ్రెజిల్ పదేపదే చాటి చెబుతూ వస్తోంది. బ్రెజిల్ స్థాయికి తగ్గట్టుగా ఆడితే..ఆ ఆటతీరును చూడటానికి రెండుకళ్లూ చాలవని సాకర్ పండితులు చెబుతూ ఉంటారు.

బ్రెజిల్ తరువాత మాజీ చాంపియన్లు అర్జెంటీనా, జర్మనీ, స్పెయిన్, ప్రస్తుత చాంపియన్ ఫ్రాన్స్ సైతం ప్రపంచకప్ గెలుచుకొనే అవకాశాలు ఎక్కువగా ఉన్న జట్లలో నిలిచాయి.

కప్పు కొడితే 358కోట్ల నజరానా...

టీ-20 క్రికెట్ ప్రపంచకప్ లో విజేతగా నిలిచిన ఇంగ్లండ్ జట్టుకు దక్కిన ప్రైజ్ మనీ కేవలం 13 కోట్ల రూపాయలు మాత్రమే. ఐపీఎల్ విజేతకు 20 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ వరకూ దక్కుతుంది. అదే ప్రపంచకప్ ఫుట్ బాల్ లో విజేతగా నిలిచిన జట్టుకు ఇచ్చే ప్రైజ్‌ మనీ చూస్తే కళ్లు బైర్లు కమ్మక మానవు. వందకోట్లు కాదు, రెండువందల కోట్లు అసలే కాదు..ఏకంగా 358 కోట్ల రూపాయలు దక్కుతాయి.

30 లక్షల జనాభా మాత్రమే ఉన్న బుల్లిదేశం ఖతర్ వేలకోట్ల రూపాయల వ్యయంతో పోటీల కోసం ఎనిమిది అత్యాధునిక స్టేడియాలను నిర్మించింది. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల నుంచి 10 లక్షల మంది అభిమానులు ఈ సాకర్ తిరునాలకు తరలి వస్తున్నారు.

ప్రపంచసాకర్ లో భారత్ ఎక్కడ?

12 ప్రధాన దేశాలు ఆడే క్రికెట్ లో నంబర్ వన్ గా ఉన్న భారత్..ప్రపంచ నంబర్ వన్ గేమ్ ఫుట్ బాల్ మాత్రం 101 ర్యాంకులో ఉందంటే ముక్కుమీద వేలేసుకోవాల్సిందే.

ఆసియాజోనల్ స్థాయికే పరిమితమవుతూ వస్తున్న భారత్ ప్రపంచకప్ ఫుట్ బాల్ ఫైనల్ రౌండ్ కు అర్హత సాధించాలంటే మరో వందేళ్లయినా వేచి చూడక తప్పదని విమర్శకులు, విశ్లేషకులు చెబుతున్నారు.

ఆసియాఖండ దేశాలకు అందుబాటులో ఉన్న నాలుగు బెర్త్ లను జపాన్, దక్షిణకొరియా, సౌదీ అరేబియా, ఇరాన్ కైవసం చేసుకొంటూ వస్తున్నాయి. ఈ నాలుగుజట్లలో

ఏ జట్టు తన గ్రూపు నుంచి క్వార్టర్ ఫైనల్ రౌండ్ చేరినా..అది గొప్పఘనతగానే మిగిలిపోతుంది.

మొత్తం మీద వచ్చే మూడువారాలపాటు ప్రపంచ ఫుట్ బాల్ అభిమానులకు ఈ విశ్వసాకర్ సంరంభం అసలు సిసలు పండుగ మాత్రమే కాదు..పసందైన విందుగా మిగిలిపోతుంది.

First Published:  20 Nov 2022 10:54 AM IST
Next Story