టీ-20 మ్యాచ్ లో 501 పరుగుల ప్రపంచ రికార్డు!
టీ-20 మ్యాచ్ లో 501 పరుగులా!?...అవునా..నిజమేనా? అంటూ ఆశ్చర్యపోకండి.
టీ-20 మ్యాచ్ లో 501 పరుగులా!?...అవునా..నిజమేనా? అంటూ ఆశ్చర్యపోకండి. ఇది నిజంగా నిజం. దక్షిణాఫ్రికా దేశవాళీ టీ-20 క్రికెట్ టోర్నీలో టైటాన్స్, నైట్స్ జట్లు కలసి ఈ అసాధార రికార్డు నమోదు చేశాయి...
20 ఓవర్లు..60 థ్రిల్స్ గా మూడున్నర గంటలపాటు సాగిపోయే ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్లో మరో ప్రపంచ రికార్డు వచ్చి చేరింది. ఓ మ్యాచ్ లో రెండుజట్లు కలసి 40 ఓవర్లలో 501 పరుగులు నమోదు చేసిన అవూర్వఘట్టం దక్షిణాఫ్రికా గడ్డపై చోటు చేసుకొంది.
బౌండ్రీలు జోరు, సిక్సర్లహోరు, పరుగుల వెల్లువలా సాగిన ఈమ్యాచ్ లో టైటాన్స్ తో నైట్స్ జట్టు తలపడింది. ముందుగా బ్యాటింగ్ కు దిగిన టైటాన్స్ జట్టు 20 ఓవర్లలో 3 వికెట్లకు 271 పరుగుల రికార్డు స్కోరు నమోదు చేసింది.
ఓపెనర్ బ్రెవిస్ 162 పరుగులు..
టైటాన్స్ ఓపెనర్ డివాల్డ్ బ్రెవిస్ కేవలం 57 బాల్స్ లో సునామీ శతకం సాధించాడు. 13 ఫోర్లు, 13 సిక్సర్లతో 162 పరుగుల స్కోరు సాధించాడు. సమాధానంగా 272 పరుగుల లక్ష్యంతో చేజింగ్ కు దిగిన నైట్స్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లకు 230 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో టైటాన్స్ జట్టు ఈ హైస్కోరింగ్ వార్ లో 41 పరుగులతో విజేతగా నిలిచింది.
497 పరుగుల రికార్డు తెరమరుగు...
టీ-20 క్రికెట్లో ఇప్పటి వరకూ న్యూజిలాండ్ దేశవాళీ క్రికెట్లో సెంట్ర్లల్ డిస్ట్రిక్ట్స్ - ఒటాగో జట్ల సూపర్ స్మాష్ టీ-20 మ్యాచ్ లో 497 పరుగుల ప్రపంచ రికార్డు నమోదయ్యింది.
2016-17 సీజన్ నుంచి చెక్కుచెదరకుండా ఉన్న ఈ రికార్డును ప్రస్తుత 2022 సీజన్లో దక్షిణాఫ్రికా దేశవాళీమ్యాచ్ తెరమరుగు చేసింది. పోచెఫ్స్ స్ట్రూమ్ వేదికగా జరిగిన ఈ పోరులో రెండుజట్ల ఆటగాళ్ళు కలసి 36 సిక్సర్లు బాదడం మరో రికార్డు. అంతేకాదు దక్షిణాఫ్రికా టీ-20 చరిత్రలో 271 పరుగులతో నాలుగో అతిపెద్ద స్కోరు సాధించిన జట్టుగా టైటాన్స్ నిలిచింది
గేల్, ఫించ్ ల తర్వాతి స్థానంలో బ్రెవిస్..
టీ-20 క్రికెట్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్లు సాధించిన మూడో బ్యాటర్ గా టైటాన్స్ ఓపెనర్ బ్రెవిస్ రికార్డుల్లో చేరాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరపున క్రిస్ గేల్ సాధించిన 175 నాటౌట్, 2018లో జింబాబ్వే పైన ఆరోన్ ఫించ్ సాధించిన 172 పరుగుల స్కోర్లే మొదటి రండు అత్యుత్తమ స్కోర్లుగా నిలిచాయి.
యువబ్యాటర్ బ్రెవిస్ సాధించిన 162 పరుగులే దక్షిణాఫ్రికా టీ-20 క్రికెట్లో అత్యు్త్తమస్కోరుగా నమోదయ్యింది.
తన మొదటి 150 పరుగులను కేవలం 52 బాల్స్ లోనే బ్రెవిస్ సాధించడం మరో రికార్డు. క్రిస్ గేల్ తన 150 పరుగుల స్కోరును 53 బాల్స్ లో సాధిస్తే...బ్రెవిస్ 52 బాల్స్ లోనే ఆ ఘనతను సొంతం చేసుకోడం ద్వారా సరికొత్త రికార్డు నెలకొల్పాడు.
టీ-20 క్రికెట్ పురుషుల విభాగంలో 19 సంవత్సరాల 185రోజుల వయసులోనే శతకం బాదిన సఫారీ బ్యాటర్ గా బ్రెవిస్ నిలిచాడు. బ్రెవిస్ 284. 21 స్ట్రయిక్ రేట్ తో ఈ ఘనత సాధించాడు. వంద పరుగుల స్కోరును 35 బాల్స్ లోనే అందుకొన్న బ్రెవిస్ టీ-20 క్రికెట్ చరిత్రలోనే ఐదో అత్యంత వేగవంతమైన శతకం బాదిన ఆటగాడిగా రికార్డుల్లో చేరాడు.