Telugu Global
Sports

ప్రపంచ ఫుట్ బాల్ రైజింగ్ స్టార్ ఎంబప్పే!

ప్రపంచకప్ ఫుట్ బాల్ టైటిల్ సమరంలో ఫ్రాన్స్ జట్టు పోరాడి ఓడినా..ఫ్రెంచ్ యంగ్ గన్ కిల్యాన్ ఎంబప్పే హ్యాట్రిక్ తో సత్తా చాటుకొన్నాడు. గోల్డెన్ బూట్ అవార్డుతో లయనల్ మెస్సీనే అధిగమించాడు.

ప్రపంచ ఫుట్ బాల్ రైజింగ్ స్టార్ ఎంబప్పే!
X

ప్రపంచకప్ ఫుట్ బాల్ టైటిల్ సమరంలో ఫ్రాన్స్ జట్టు పోరాడి ఓడినా..ఫ్రెంచ్ యంగ్ గన్ కిల్యాన్ ఎంబప్పే హ్యాట్రిక్ తో సత్తా చాటుకొన్నాడు. గోల్డెన్ బూట్ అవార్డుతో లయనల్ మెస్సీనే అధిగమించాడు...

విజేతల వైపే అందరూ చూస్తారు. తుదివరకూ గొప్పగా పోరాడి ఓడిన యోధులను అంతగా ఎవ్వరూ పట్టించుకోరు...ఈ మాట 2022 ఫిఫా ప్రపంచకప్ ఫైనల్లోను నిజమని తేలింది.

ఖతర్ రాజధాని దోహాలోని లూసెయిల్ స్టేడియం వేదికగా జరిగిన ప్రపంచకప్ ఫైనల్ డిఫెండింగ్ చాంపియన్ ఫ్రాన్స్, మాజీ చాంపియన్ అర్జెంటీనాజట్ల మధ్య నువ్వానేనా అన్నట్లుగా సాగింది.

ఆట నిర్ణితసమయంలో నువ్వొక గోలు, నేనొకగోలు అన్నట్లుగా పోటీపడ్డాయి. అర్జెంటీనా తరపున మిడ్ ఫీల్డ్ మాంత్రికుడు లయనల్ మెస్సీ మ్యాజిక్ చేస్తే..ఫ్రాన్స్ తరపున 24 సంవత్సరాల యువస్ట్ర్రయికర్ కిల్యాన్ ఎంబప్పే మెరుపువేగంతో రెండుగోల్స్ చేసి మ్యాచ్ ను మలుపు తిప్పాడు. పెనాల్టీ షూటౌట్ వరకూ తీసుకెళ్లాడు. ఆట నిర్ణితసమయంలో

రెండుజట్లు చెరో మూడుగోల్స్ సాధించడం ద్వారా 3-3తో సమఉజ్జీలుగా నిలిచాయి. దీంతో పెనాల్టీ షూటౌట్ పాటించారు.

లాటరీ లాంటి పెనాల్టీ షూటౌట్లో అర్జెంటీనా 4-2 గోల్స్ తో నెగ్గడం ద్వారా విశ్వవిజేతగా నిలిచింది. తుదివరకూ వీరోచితంగా పోరాడిన ఫ్రాన్స్ జట్టు రన్నరప్ గా సరిపెట్టుకొంది.

అయితే..తనజట్టుకు ట్రోఫీ అందించిన లయనల్ మెస్సీ తో సమానంగా రాణించిన ఎంబప్పే గురించి, అతని ఘనత గురించి చెప్పుకొని తీరాలి.

23 ఏళ్ల వయసులోనే గోల్డెన్ బూట్..

కేవలం 23 సంవత్సరాల చిరుప్రాయంలోనే రెండుసార్లు ప్రపంచకప్ ఫైనల్స్ లో ఆడిన ఆటగాడి ఘనతను కిల్యాన్ ఎంబయ్యే సొంతం చేసుకొన్నాడు. కమెరూన్ తండ్రి, అల్జీరియాకు చెందిన తల్లికి జన్మించిన ఎంబప్పే ఫ్రాన్స్ జట్టు కు తురుపుము్క్కలాంటి ఆటగాడిగా గుర్తింపు సంపాదించాడు.

2018 ప్రపంచకప్ లో 19 సంవత్సరాల వయసులో తొలిసారిగా పాల్గొన్న ఎంబప్పే అత్యంత చిన్నవయసులో ప్రపంచకప్ లో గోల్స్ సాధించిన ఇద్దరు ఆటగాళ్లలో ఒకడుగా నిలిచాడు. అంతేకాదు ప్రపంచకప్ విజేత జట్టులో సభ్యుడుగాను ఉన్నాడు.

2018 ప్రపంచకప్ లో అత్యంత ప్రతిభావంతుడైన యువఆటగాడి అవార్డు గెలుచుకొన్న ఎంబప్పే కేవలం నాలుగేళ్ల వ్యవధిలోనే వరుసగా రెండో ప్రపంచకప్ లో గోల్డెన్ బూట్ అవార్డు సాధించాడు.

అర్జెంటీనా కెప్టెన్ లయనల్ మెస్సీతో గోల్డెన్ బూట్ రేస్ లో నిలిచిన ఎంబప్పే ఫైనల్లో హ్యాట్రిక్ గోల్స్ సాధించడం ద్వారా చరిత్ర సృష్టించాడు.1966 ప్రపంచకప్ ఫైనల్లో ఇంగ్లండ్ ఆటగాడు జెఫ్ హర్షట్ తొలిసారిగా హ్యాట్రిక్ గోల్స్ సాధిస్తే...66 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి ఎంబప్పే అదే రికార్డును నమోదు చేయగలిగాడు.

అర్జెంటీనాతో జరిగిన ఫైనల్ ఆట నిర్ణిత సమయంలో రెండుగోల్స్, పెనాల్టీ షూటౌట్లో ఓ గోల్ సాధించడం ద్వారా ఎంబప్పే హ్యాట్రిక్ రికార్డును చేరుకోగలిగాడు.

ప్రస్తుత ప్రపంచకప్ గ్రూప్ లీగ్ దశ నుంచి ఫైనల్స్ వరకూ ఎంబప్పే మొత్తం 8 గోల్స్ తో అత్యధిక గోల్స్ సాధించిన ఆటగాడికి ఇచ్చే గోల్డెన్ బూట్ అవార్డును అందుకొన్నాడు.

రెండు ప్రపంచకప్ లు- 12 గోల్స్...

కేవలం 23 సంవత్సరాల వయసుకే రెండు ప్రపంచకప్ టోర్నీలలో పాల్గొన్న ఎంబప్పే 14 మ్యాచ్ లు ఆడి 12 గోల్స్ సాధించాడు. 2018 ప్రపంచకప్ లో 4 గోల్స్, 2022 ప్రపంచకప్ లో 8 గోల్స్ నమోదు చేశాడు.

అంతేకాదు.. వరుసగా రెండు ప్రపంచకప్ టో్ర్నీల ఫైనల్స్ లో గోల్స్ సాధించిన రెండో ఆటగాడిగా రికార్డుల్లో చేరాడు. బ్రెజిల్ ఆటగాడు వావా 1958, 1962 ప్రపంచకప్ ఫైనల్స్ లో గోల్స్ సాధిస్తే...ఎంబప్పే 2018, 2022 ప్రపంచకప్ ఫైనల్స్ లో గోల్స్ సాధించాడు. ప్రపంచకప్ ఫైనల్స్ లో 4 గోల్స్ సాధించిన తొలి, ఏకైక ఆటగాడు కిల్యాన్ ఎంబప్పే మాత్రమే.

23 సంవత్సరాలకే ఇన్ని ఘనతలు సాధించిన ఎంబప్పే రానున్నకాలంలో మరో మూడు ప్రపంచకప్ టోర్నీలలో పాల్గొనే అవకాశం ఉంది. ప్రస్తుత ప్రపంచకప్ ఫుట్ బాల్ లో

సూపర్ స్టార్లుగా ఓ వెలుగు వెలిగిన లయనల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డోల కెరియర్ దాదాపు ముగింపు దశకు చేరిన తరుణంలో రేపటి తరం సూపర్ స్టార్ కిల్యాన్ ఎంబప్పే మాత్రమే అని చెప్పక తప్పదు.

First Published:  19 Dec 2022 11:34 AM IST
Next Story