Telugu Global
Sports

ప్రపంచకప్ లో పరుగుల శూరులు, వికెట్ల వీరులు!

ఐసీసీ వన్డే ప్రపంచకప్ రౌండ్ రాబిన్ లీగ్ సగం మ్యాచ్ లు ముగిసే సమయానికి సఫారీ హిట్టర్ క్వింటన్ డి కాక్, కంగారూ స్పిన్నర్ ఆడం జంపా టాపర్లుగా నిలిచారు.

ప్రపంచకప్ లో పరుగుల శూరులు, వికెట్ల వీరులు!
X

ఐసీసీ వన్డే ప్రపంచకప్ రౌండ్ రాబిన్ లీగ్ సగం మ్యాచ్ లు ముగిసే సమయానికి సఫారీ హిట్టర్ క్వింటన్ డి కాక్, కంగారూ స్పిన్నర్ ఆడం జంపా టాపర్లుగా నిలిచారు.

దేశవిదేశాలలోని కోట్లాదిమంది క్రికెట్ అభిమానులను ఓలలాడిస్తున్న 2023-ఐసీసీ వన్డే ప్రపంచకప్ రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్ లు సంచలనాలతో జోరుగా సాగిపోతున్నాయి.

ఆతిథ్య భారత్ తో సహా వివిధజట్లకు చెందిన బ్యాటర్లు పరుగుల హోరు, సెంచరీలజోరుతో చెలరేగిపోతుంటే...స్పిన్ బౌలర్లు, ఫాస్ట్ బౌలర్లు వికెట్లు పడగొడుతూ మ్యాచ్ విన్నర్లుగా నిలుస్తున్నారు.

క్వింటన్ డి కాక్ సూపర్ హిట్....

మొత్తం 10 జట్ల నడుమ జరుగుతున్న 9 రౌండ్ల మ్యాచ్ ల్లో మొదటి ఐదురౌండ్ల పోటీలు ముగిసిపోయాయి. దక్షిణాఫ్రికాజట్టు మూడుసార్లు 300కు పైగా స్కోర్లతో అదరగొడితే..ఐదుసార్లు విజేతగా ఆస్ట్ర్రేలియా సైతం పసికూన నెదర్లాండ్స్ తో ముగిసిన పోరులో రికార్డుల మోత మోగించింద.

దక్షిణాఫ్రికా ఓపెనర్ కమ్ వికెట్ కీపర్ క్వింటన్ డి కాక్ ఆరు ఇన్నింగ్స్ లో మూడు సెంచరీలతో సహా అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేయగలిగాడు. అంతేకాదు..ఆరు ఇన్నింగ్స్ లోనే 431 పరుగులతో అగ్రస్థానంలో నిలిచాడు.

భారత పరుగుల యంత్రం విరాట్ కొహ్లీ ఓ శతకం, మూడు అర్థశతకాలతో పాటు 354 పరుగులతో రెండోస్థానంలో కొనసాగుతున్నాడు. ఆస్ట్ట్రేలియా సీనియర్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ , పాకిస్థాన్ వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ చెరో 332 పరుగుల చొప్పున సాధించడం ద్వారా సంయుక్త తృతీయస్థానంలో నిలిచారు.

భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఓ సెంచరీతో పాటు 311 పరుగులతో నాలుగో స్థానంలో ఉన్నాడు. అంతేకాదు..ప్రస్తుత ప్రపంచకప్ లో ఇప్పటి వరకూ జరిగిన ఐదురౌండ్లలో అత్యధికంగా 17 సిక్సర్లు బాదిన ఏకైక బ్యాటర్ గా రోహిత్ రికార్డు నెలకొల్పాడు.

40 బంతుల్లోనే మాక్స్ వెల్ శతకం..

48 సంవత్సరాల ప్రపంచకప్ చరిత్రలోనే మెరుపు శతకం బాదిన మొనగాడిగా ఆస్ట్ర్రేలియా ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్ వెల్ నిలిచాడు. నెదర్లాండ్స్ బౌలర్లను దంచికొట్టడం ద్వారా కేవలం 40 బంతుల్లోనే రికార్డు శతకం సాధించాడు. ఇన్నింగ్స్ ఆఖరి 10 ఓవర్లలోనే వంద పరుగులు సాధించిన తొలి బ్యాటర్ గా చరిత్ర సృష్టించాడు.

మొదటి ఐదురౌండ్లలో క్వింటన్ డి కాక్ అత్యధికంగా 3 శతకాలు బాదితే..ప్రపంచకప్ చరిత్రలో అత్యధికంగా 7 సెంచరీలు సాధించిన తొలి బ్యాటర్ రికార్డును రోహిత్ శర్మ సాధించాడు.

న్యూజిలాండ్ యువఆల్ రౌండర్ రచిన్ రవీంద్ర 5 ఇన్నింగ్స్ లో ఓ సెంచరీతో సహా 290 పరుగులతో ఐదవ అత్యుత్తమ బ్యాటర్ గా నిలిచాడు.

దక్షిణాఫ్రికా మిడిలార్డర్ బ్యాటర్ హెన్రిక్ క్లాసెన్ 5 ఇన్నింగ్స్ లో 150. 79 స్ట్ర్రయిక్ రేట్ తో 288 పరుగులతో దూసుకుపోతున్నాడు.

ఆడం జంపా స్పిన్ జాదూ!

బౌలింగ్ విభాగంలో అత్యధిక వికెట్లు పడగొట్టిన వీరుడిగా ఆస్ట్ర్రేలియా లెగ్ స్పిన్ గుగ్లీ బౌలర్ ఆడం జంపా నిలిచాడు. ఐదు ఇన్నింగ్స్ లో 13 వికెట్లు పడగొట్టడం ద్వారా అగ్రస్థానం సంపాదించాడు. గత మూడుమ్యాచ్ ల్లోనూ జంపా మూడుసార్లు 4 వికెట్ల చొప్పున పడగొట్టడం విశేషం.

న్యూజిలాండ్ లెఫ్టామ్ స్పిన్నర్ మిషెల్ సాంట్నర్ 12 వికెట్లతో రెండోస్థానంలో ఉన్నాడు. శ్రీలంక పేసర్ దిల్షాన్ మధుశంక 4 మ్యాచ్ ల్లోనే 11 వికెట్లు పడగొట్టి మూడు, భారత యార్కర్లకింగ్ జస్ ప్రీత్ బుమ్రా 5 మ్యాచ్ ల్లో 11 వికెట్లతో నాలుగు స్థానాలలో ఉన్నారు.

మిగిలిన 20 రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్ ల్లో మరెన్ని సెంచరీలు నమోదవుతాయో..మరెన్ని వికెట్లు పడతాయో..తెలుసుకోవాలంటే కొద్దిరోజులపాటు వేచిచూడక తప్పదు.

First Published:  28 Oct 2023 2:45 AM GMT
Next Story