Telugu Global
Sports

నేటినుంచే ప్రపంచకప్ సెమీస్ వార్!

టీ-20 ప్రపంచకప్ లో తొలి నాకౌట్ పోరుకు రన్నరప్ న్యూజిలాండ్, మాజీ చాంపియన్ పాకిస్థాన్ సై అంటే సై అంటున్నాయి. సిడ్నీ క్రికెట్ స్టేడియం వేదికగా ఈరోజు జరిగే తొలి సెమీఫైనల్లో అమీతుమీకి సిద్ధమయ్యాయి.

నేటినుంచే ప్రపంచకప్ సెమీస్ వార్!
X

టీ-20 ప్రపంచకప్ లో తొలి నాకౌట్ పోరుకు రన్నరప్ న్యూజిలాండ్, మాజీ చాంపియన్ పాకిస్థాన్ సై అంటే సై అంటున్నాయి. సిడ్నీ క్రికెట్ స్టేడియం వేదికగా ఈరోజు జరిగే తొలి సెమీఫైనల్లో అమీతుమీకి సిద్ధమయ్యాయి...

ఆస్ట్ర్రేలియా వేదికగా జరుగుతున్న 2022 టీ-20 ప్రపంచకప్ లో మూడవదశ నాకౌట్ రౌండ్ కు సిడ్నీలో కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది. భారత కాలమానప్రకారం మధ్యాహ్నం 1-30కి ప్రారంభమయ్యే తొలి సెమీఫైనల్లో 4వ ర్యాంకర్ పాకిస్థాన్ తో 5వ ర్యాంకర్ న్యూజిలాండ్ తలపడనుంది.

సూపర్ -12 రౌండ్ గ్రూప్ -1 టాపర్ గా న్యూజిలాండ్ సెమీస్ చేరితే...గ్రూప్ -2 రన్నరప్ గా పాకిస్థాన్ నాకౌట్ రౌండ్లో అడుగుపెట్టింది.

విజయావకాశాలు 50- 50

ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్లో తమదైన రోజున చెలరేగిపోయి ఆడటంలో ఇటు న్యూజిలాండ్, అటు పాకిస్థాన్ జట్లు తమకుతామే సాటి. అయితే ప్రస్తుత ప్రపంచకప్ లో మాత్రం నిలకడగా రాణించినజట్టుగా న్యూజిలాండ్ కు, నిలకడలేమితో అదృష్టం తలుపుతట్టిన జట్టుగా పాకిస్థాన్ నిలిచాయి.

గ్రూపు-1 లీగ్ లో ఆతిథ్య ఆస్ట్ర్రేలియాను ఓడించి...ఇంగ్లండ్ చేతిలో పరాజయం పొందిన న్యూజిలాండ్...అఫ్ఘనిస్థాన్, ఐర్లాండ్, శ్రీలంకజట్లను అధిగమించడం ద్వారా టాపర్ గా సెమీస్ కు అర్హత సంపాదించింది.

ఎమిరేట్స్ వేదికగా గతేడాది జరిగిన 2021 ప్రపంచకప్ ఫైనల్స్ చేరి..ఆస్ట్ర్రేలియా చేతిలో పరాజయం పొందిన కివీజట్టు వరుసగా రెండోసారి ఫైనల్స్ చేరాలన్న పట్టుదలతో ఉంది.

మరోవైపు ప్రతిభ ఉన్నా ...నిలకడలేమికి మరో పేరైన పాకిస్థాన్ మాత్రం...లీగ్ దశలో భారత్, జింబాబ్వేజట్ల చేతిలో పరాజయాలు పొందినా...నెదర్లాండ్స్ పుణ్యమా అంటూ అనూహ్యంగా సెమీస్ లో అడుగుపెట్టింది.

పవర్ ఫుల్ కివీ బ్యాటింగ్- పదునైన పాక్ బౌలింగ్...

కేన్ విలియమ్స్ సన్ నాయకత్వంలోని న్యూజిలాండ్ జట్టు లో డేవిడ్ కాన్వే, గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిషెల్, నీషమ్, ఫిన్ అలెన్ లాంటి వీరబాదుడు బ్యాటర్లున్నారు. బౌలింగ్ లో సైతం టిమ్ సౌథీ, ట్రెంట్ బౌల్ట్ , లాకీ ఫెర్గూసన్, స్పిన్ జోడీ సాంట్నర్, ఇష్ సోథీలతో అత్యంత సమతూకంతో కనిపిస్తోంది.

ఇక..బాబర్ అజమ్ నాయకత్వంలోని పాక్ జట్టు బ్యాటింగ్ పరిస్థితి గాల్లో దీపంలా ఉంది. ఓపెనింగ్ జోడీ చక్కటి ఆరంభాన్ని ఇవ్వడంలో విఫలమవుతూ రావడం జట్టు అవకాశాలను దెబ్బతీస్తోంది.

మిడిలార్డర్ ఆటగాళ్లు మహ్మద్ హారిస్, ఇఫ్తీకర్ , షదాబ్ ఖాన్ మాత్రమే నిలకడగా రాణిస్తూ జట్టుకు అండగా నిలుస్తూ వస్తున్నారు. పాక్ బౌలింగ్ ఎటాక్ లో షహీన్ అఫ్రిదీ, వసీమ్ ఖాన్, హారిస్ రవూఫ్, స్పిన్ జోడీ షదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్ కీలకం కానున్నారు.

న్యూజిలాండ్ పై పాక్ దే పైచేయి...

నాలుగో ర్యాంకర్ పాకిస్థాన్, 5వ ర్యాంకర్ ముఖాముఖీ రికార్డుల్లో పాక్ జట్టుదే పైచేయిగా ఉంది. ప్రపంచకప్ టోర్నీల సెమీస్ లో న్యూజిలాండ్ ప్రత్యర్థిగా తలపడిన ప్రతిసారీ పాక్ జట్టే విజేతగా నిలుస్తూ వచ్చింది.

టీ-20లో ఈ రెండుజట్లూ 28 మ్యాచ్ ల్లో తలపడితే పాకిస్థాన్ 17, న్యూజిలాండ్ 11 విజయాల రికార్డుతో ఉన్నాయి. ఇక..సిడ్నీ వేదికగా ప్రస్తుత ప్రపంచకప్ లో ఆస్ట్ర్రేలియాపై న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాపై పాకిస్థాన్ విజయాలు నమోదు చేశాయి.

సిడ్నీ పిచ్ పేసర్లతో పాటు స్పిన్నర్లకూ అనుకూలించే అవకాశం ఉండడంతో బ్యాటర్లకు బౌలర్లకు నడుమ ఆసక్తికరమైన పోరే జరుగనుంది.

పాక్ టాపార్డర్లో డేవిడ్ కాన్వే, బెన్ ఫిలిఫ్స్, ఫిన్ అలెన్ లలో ఏ ఇద్దరు రాణించినా పాక్ జట్టుకు కష్టాలు తప్పవు.

టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్ ఎంచుకొన్నజట్టుకే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి.

ఈరోజు మధ్యాహ్నం 1-30కి ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ కు 25శాతం మాత్రమే వర్షంతో అంతరాయం కలిగే అవకాశం ఉందని వాతావరణశాఖ చెబుతోంది.

ఈ రెండుజట్లలో ఏ జట్టు ప్రపంచకప్ ఫైనల్ చేరుతుందన్నదే ఇక్కడి అసలుపాయింట్....

First Published:  9 Nov 2022 10:01 AM IST
Next Story