హాటు హాటుగా ప్రపంచకప్ సెమీఫైనల్స్ రేస్!
ప్రపంచకప్ సెమీఫైనల్స్ కు ఆతిథ్య భారత్ చేరుకోడంతో మిగిలిన మూడు బెర్త్ ల కోసం ఐదుజట్లు హోరాహోరీగా పోరాడుతున్నాయి
ప్రపంచకప్ సెమీఫైనల్స్ కు ఆతిథ్య భారత్ చేరుకోడంతో మిగిలిన మూడు బెర్త్ ల కోసం ఐదుజట్లు హోరాహోరీగా పోరాడుతున్నాయి. బంగ్లాదేశ్, శ్రీలంక, నెదర్లాండ్స్ రేస్ నుంచి వైదొలిగాయి....
2023-ఐసీసీ వన్డే ప్రపంచకప్ తొలిదశ 10 జట్ల రౌండ్ రాబిన్ లీగ్ నుంచి సెమీఫైనల్స్ చేరిన తొలిజట్టుగా ఆతిథ్య భారత్ నిలవడంతో..మిగిలిన మూడు సెమీఫైనల్స్ బెర్త్ ల కోసం ఐదుజట్లు పోటీపడుతుంటే..మూడుజట్లు రేస్ నుంచి వైదొలిగాయి.
14 పాయింట్లతో భారత్ కు సెమీస్ లో చోటు...
ప్రపంచ నంబర్ వన్ ర్యాంకర్ భారత్ రౌండ్ రాబిన్ లీగ్ లోని మొదటి 7 రౌండ్లలో ఏడు విజయాలు సాధించడం ద్వారా 14 పాయింట్లతో నాకౌట్ రౌండ్లో చోటు ఖాయం చేసుకొన్న తొలిజట్టుగా నిలిచింది.
ఆస్ట్ర్రేలియా, అప్ఘనిస్థాన్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఇంగ్లండ్, శ్రీలంకజట్లను భారత్ చిత్తు చేయడం ద్వారా సత్తా చాటుకొంది. ముంబై వేదికగా శ్రీలంకతో ముగిసిన 7వ రౌండ్ పోరులో 302 పరుగుల అతిపెద్ద విజయం నమోదు చేసింది. రోహిత్ శర్మ నాయకత్వంలోని భారత్ ప్లస్ 2.102 నెట్ రన్ రేట్ తో నిలిచింది. రౌండ్ రాబిన్ లీగ్ లోని తన చివరి రెండురౌండ్ల మ్యాచ్ ల్లో దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్ జట్లతో భారత్ తలపడనుంది.
సెమీస్ కు గెలుపు దూరంలో దక్షిణాఫ్రికా...
రౌండ్ రాబిన్ లీగ్ దశలో భారత్ తర్వాత అత్యంత ప్రమాదకరమైనజట్టుగా ఉన్న దక్షిణాఫ్రికా మొదటి 7 రౌండ్లలో 6 విజయాలు, ఓ పరాజయంతో 12 పాయింట్లతో లీగ్ టేబుల్ రెండోస్థానంలో కొనసాగుతోంది.
ఇప్పటికే నాలుగుసార్లు 350కి పైగా స్కోర్లు సాధించడంతో పాటు 100కు పైగా పరుగుల తేడాతో ప్రత్యర్థిజట్లను చిత్తు చేస్తూ వచ్చిన సఫారీటీమ్ ప్లస్ 2.290 రన్ రేట్ తో కొనసాగుతోంది. తన చివరి రెండురౌండ్ల మ్యాచ్ ల్లో భారత్, అప్ఘనిస్థాన్ జట్లతో తలపడనుంది. మిగిలిన రెండురౌండ్లలో ఒక్క మ్యాచ్ నెగ్గినా సెమీస్ చేరుకోగలుగుతుంది.
లీగ్ దశలో పసికూన నెదర్లాండ్స్ చేతిలో పరాజయం పొందిన దక్షిణాఫ్రికా జట్టులోని డి కాక్ 4 శతకాలు, డ్యూసెన్ 2 శతకాలు, క్లాసెన్, మర్కరమ్ చెరో శతకం బాదడంతో అత్యంతబలమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన జట్టుగా కనిపిస్తోంది.
8 పాయింట్లతో మూడోస్థానంలో ఆస్ట్ర్రేలియా....
ఐదుసార్లు ప్రపంచ చాంపియన్ ఆస్ట్ర్రేలియా మొదటి ఆరురౌండ్లలో 4 విజయాలు, 2 పరాజయాలతో 8 పాయింట్లు సాధించడం ద్వారా లీగ్ టేబుల్ మూడోస్థానంలో కొనసాగుతోంది.
ప్లస్ 0.970 నెట్ రన్ రేట్ తో..చివరి మూడురౌండ్లలో విజయాలకు కంగారుజట్టు గురిపెట్టింది. ఇంగ్లండ్, అప్ఘనిస్థాన్, బంగ్లాదేశ్ జట్లతో పోటీలలో నెగ్గితేనే ఆస్ట్ర్రేలియా సెమీఫైనల్స్ చేరుకోగలుగుతుంది.
చివరి మూడురౌండ్లలో కనీసం రెండుమ్యాచ్ లు నెగ్గినా ఆస్ట్ర్రేలియా సెమీఫైనల్స్ చేరుకొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఓపెనర్లు డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్ సెంచరీలు సాధించడం ద్వారా సూపర్ ఫామ్ లో కనిపిస్తున్నారు.
పాలపొంగులా మారిన న్యూజిలాండ్....
రౌండ్ రాబిన్ లీగ్ ప్రారంభరౌండ్లలో చెలరేగిపోయిన న్యూజిలాండ్ గత మూడు రౌండ్లలో వరుస పరాజయాలతో నీరుగారిపోయింది. మొదటి నాలుగు రౌండ్లలో విజయాలు, ఆ తర్వాతి మూడురౌండ్లలో పరాజయాలతో 8 పాయింట్లతో నాలుగోస్థానంలో కొనసాగుతోంది. ప్లస్ 0.484 నెట్ రన్ రేట్ సాధించిన న్యూజిలాండ్ తన చివరి రెండురౌండ్ల మ్యాచ్ ల్లో పాకిస్థాన్, శ్రీలంకజట్లను ఓడించగలిగితేనే సెమీఫైనల్స్ బెర్త్ ఖాయం చేసుకోగలుగుతుంది. భారత్, దక్షిణాఫ్రికాజట్లు కొట్టిన దెబ్బ నుంచి న్యూజిలాండ్ జట్టు తేరుకొన్నట్లుగా ఏమాత్రం కనిపించడం లేదు.
సెమీస్ ఆశల పల్లకిలో అప్ఘనిస్థాన్...
ప్రపంచకప్ రౌండ్ రాబిన్ లీగ్ లో సంచలన విజయాలతో దూసుకుపోతున్న చిన్నజట్టు అప్ఘనిస్థాన్. మొదటి 7 రౌండ్లలో 4 విజయాలతో 8 పాయింట్లు సాధించడం ద్వారా లీగ్ టేబుల్ 5వ స్థానంలో నిలిచింది.
4 విజయాలు, 3 పరాజయాలతో -0.718 నెట్ రన్ రేట్ తో పుంజుకోగలిగింది. చివరి రెండురౌండ్లలో దిగ్గజజట్లు ఆస్ట్ర్రేలియా, దక్షిణాఫ్రికాజట్లతో అప్ఘన్ అమీతుమీ తేల్చుకోనుంది.
ఇంగ్లండ్, పాకిస్థాన్, శ్రీలంక, నెదర్లాండ్స్ జట్లను చిత్తు చేసిన అప్ఘనిస్థాన్ చివరి రెండురౌండ్లలోనూ నెగ్గితేనే సెమీస్ చేరుకోగలుగుతుంది.
గాల్లో దీపంలా పాకిస్థాన్ .....
వన్డే ఫార్మాట్లో ప్రపంచ అత్యుత్తమజట్లలో ఒకటిగా నిలిచిన పాకిస్థాన్ పరిస్థితి మాత్రం ప్రస్తుత ప్రపంచకప్ రౌండ్ రాబిన్ లీగ్ లో గాల్లో దీపంలా మారింది. సెమీఫైనల్స్ చేరడం అంతతేలికగా ఏమాత్రం కనిపించడం లేదు.
పదిజట్ల రౌండ్ రాబిన్ లీగ్ లో 3 విజయాలు, 4 పరాజయాలతో 6 పాయింట్లు మాత్రమే సాధించడం ద్వారా 6వ స్థానంలో కొనసాగుతోంది.-0.024 నెట్ రన్ రేట్ తో
కొట్టిమిట్టాడుతోంది. ఆఖరి రెండురౌండ్ల పోరులో న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్లను ఓడించినా సెమీస్ చేరడం అనుమానమే.దీనికితోడు నెదర్లాండ్స్ పై అప్ఘనిస్థాన్ నెగ్గడంతో పాక్ కు సెమీస్ దారి మూసుకుపోయినట్లయ్యింది. న్యూజిలాండ్ తో జరిగే పోరులో పాకిస్థాన్ 83 పరుగుల తేడాతో లేదా 35 ఓవర్లలో విజయం సాధించగలిగితేనే సెమీస్ ఆశలు సజీవంగా ఉంటాయి.
శ్రీలంక..సెమీస్ రేస్ నుంచి అవుట్...
రౌండ్ రాబిన్ లీగ్ మొదటి 7 రౌండ్లలో 5 పరాజయాలు, 2 విజయాల రికార్డుతో మాజీ చాంపియన్ శ్రీలంక కేవలం 4 పాయింట్లు మాత్రమే సాధించడం ద్వారా 8వ స్థానానికి పడిపోయింది.
-1.162 నెట్ రన్ రేట్ తో దిగజారిపోయింది. చివరి రెండురౌండ్లలో బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జట్లపై విజయాలు సాధించినా సెమీస్ చేరుకోలేని పరిస్థితి కొని తెచ్చుకొంది.
భారత్ చేతిలో ఎదురైన 302 పరుగుల ఘోరపరాజయంతో శ్రీలంకకు సెమీస్ దారి మూసుకుపోయింది.
లీగ్ టేబుల్ 9వ స్థానంలో నెదర్లాండ్స్....
క్వాలిఫైయింగ్ రౌండ్ల ద్వారా ప్రపంచకప్ ఫైనల్ రౌండ్ కు అర్హత సంపాదించిన పసికూన నెదర్లాండ్స్ జట్టు అంచనాలకు మించి రాణించింది. ప్రపంచకప్ అర్హత పోటీలలో
వెస్టిండీస్, జింబాబ్వే లాంటి మేటిజట్లనే కంగుతినిపించిన నెదర్లాండ్స్...ప్రపంచకప్ రౌండ్ రాబిన్ లీగ్ మొదటి 7 రౌండ్లలో 2 విజయాలు, 5 పరాజయాలతో 4 పాయింట్లు సాధించడం ద్వారా లీగ్ టేబుల్ 9వ స్థానంలో కొనసాగుతోంది.
-1.277 నెట్ రన్ రేట్ తో ఉన్నడచ్ జట్టు చివరి రెండురౌండ్లలో ఇంగ్లండ్, భారత్ జట్లతో పోటీపడాల్సి ఉంది. రౌండ్ రాబిన్ లీగ్ దశలో దక్షిణాఫ్రికాపై నెదర్లాండ్స్ అతిపెద్ద విజయం సాధించగలిగింది.
సెమీస్ రేస్ నుంచి బంగ్లాదేశ్ అవుట్...
ప్రపంచకప్ సెమీస్ రేస్ నుంచి ముందుగా వైదొలిగినజట్టుగా బంగ్లాదేశ్ నిలిచింది. మొదటి 7 రౌండ్లలో 6 పరాజయాలు, ఒకే ఒక్క గెలుపుతో 2 పాయింట్లు మాత్రమే సాధించి..10 జట్ల లీగ్ టేబుల్ ఆఖరిస్థానంలో నిలిచింది.
-1.446 నెట్ రన్ రేట్ తో ఆటలో అరటిపండులా మిగిలింది. చివరి రెండురౌండ్లలో శ్రీలంక, ఆస్ట్ర్రేలియాజట్లతో బంగ్లాదేశ్ తలపడాల్సి ఉంది.
లీగ్ టేబుల్ అట్టడుగున ఇంగ్లండ్...
డిఫెండింగ్ చాంపియన్ హోదాలో ప్రపంచకప్ ఫైనల్ రౌండ్ బరిలో నిలిచిన ఇంగ్లండ్ మొదటి 6 రౌండ్లలో 5 పరాజయాలతో ఘోరంగా విఫలమయ్యింది. కేవలం 2 పాయింట్లతో లీగ్ టేబుల్ ఆఖరిస్థానానికి పడిపోయింది.
-1.652 నెట్ రన్ రేట్ తో కొట్టిమిట్టాడుతోంది. ఆఖరి మూడురౌండ్ల మ్యాచ్ ల్లో ఆస్ట్ర్రేలియా, నెదర్లాండ్స్, పాకిస్థాన్ జట్లతో ఇంగ్లండ్ తలపడాల్సి ఉంది. ఆఖరి మూడు మ్యాచ్ ల్లో నెగ్గినా సెమీస్ చేరే అవకాశాలు లేశమాత్రమైనా కనిపించడం లేదు.
భారత్ ఇప్పటికే సెమీస్ చేరుకోడంతో ..మిగిలిన మూడు స్థానాలను దక్షిణాఫ్రికా, ఆస్ట్ర్రేలియా, న్యూజిలాండ్ జట్లు దక్కించుకోడం ఖాయంగా కనిపిస్తోంది.