ప్రపంచకప్ ఫుట్ బాల్ లో అతిపెద్ద సంచలనం!
ఫిఫా ప్రపంచకప్ ఫుట్ బాల్ మూడోరోజు పోటీలలోనే అతిపెద్ద సంచలనం నమోదయ్యింది. ప్రపంచ మాజీ చాంపియన్ అర్జెంటీనాపై సౌదీ అరేబియా సంచలన విజయం సాధించింది.
ఫిఫా ప్రపంచకప్ ఫుట్ బాల్ మూడోరోజు పోటీలలోనే అతిపెద్ద సంచలనం నమోదయ్యింది. ప్రపంచ మాజీ చాంపియన్ అర్జెంటీనాపై సౌదీ అరేబియా సంచలన విజయం సాధించింది. అరుదైన రికార్డు సాధించిన ఆనందం అర్జెంటీనా కెప్టెన్ లయనల్ మెస్సీకి లేకుండా చేసింది....
2022 ప్రపంచకప్ ఫుట్ బాల్ పోటీల మూడోరోజునే ఓ అద్భుతం జరిగింది. గ్రూప్- సీ లీగ్ లో భాగంగా రెండుసార్లు విశ్వవిజేత అర్జెంటీనాతో జరిగిన తొలిరౌండ్ పోరులో సౌదీ అరేబియా 2-1 గోల్స్ తో అనూహ్య విజయం సాధించింది.
ఖతర్ రాజధాని దోహాలోని లూసెల్ ఐకానిక్ స్టేడియం వేదికగా హాట్ ఫేవరెట్ అర్జెంటీనాతో జరిగిన పోరులో ఆసియా క్వాలిఫైయర్ సౌదీ అరేబియా 2-1 గోల్స్ తో అతిపెద్ద, సంచలన విజయం సాధించింది.
10వ నిముషంలోనే మెస్సీ గోల్..
ఆట మొదటి 10 నిముషాలు అర్జెంటీనా ఆధిపత్యమే కొనసాగింది. 10వ నిముషంలో లభించిన పెనాల్టీని మెస్సీ గోలుగా మలచడం ద్వారా తనజట్టుకు 1-0 ఆధిక్యం అందించాడు.
అయితే..ఆ తర్వాత నుంచి సౌదీ జట్టు సర్వశక్తులూ కూడదీసుకొని ఆడి ఎదురుదాడులతో అర్జెంటీనా రక్షణవలయం పై ఒత్తిడి పెంచింది. ఆట 48వ నిముషంలో అల్ షెహ్రీ మెరుపుగోల్ తో స్కోరు 1-1తో సమమయ్యింది. ఆ తర్వాత ఐదునిముషాల వ్యవధిలోనే అల్ -దవాసరీ రెండో గోల్ తో సౌదీ ఆధిక్యత పెంచాడు. ఆ తర్వాత నుంచి ఈక్వలైజర్ కోసం అర్జెంటీనా ఎంతగా పోరాడినా ప్రయోజనం లేకపోయింది. మిడ్ ఫీల్డ్ లో గోల్ కోసం మెస్సీ చేసిన ప్రయత్నాలను సౌదీ డిఫెండర్లు వమ్ము చేయడం ద్వారా తమజట్టుకు అతిపెద్ద విజయం అందించగలిగారు.
37 మ్యాచ్ ల్లో తొలి ఓటమి...
గత 37 మ్యాచ్ ల్లో అర్జెంటీనాకు ఇదే తొలిపరాజయం. అంతేకాదు...గ్రూప్ - సీ నుంచి ప్రీ-క్వార్టర్ ఫైనల్స్ రౌండ్ చేరాలంటే తన గ్రూపులో మిగిలిన రెండుపోటీలలోనూ..
ఆరునూరైనా మెక్సికో, పోలెండ్ జట్లను ఓడించి తీరాల్సి ఉంది.
అంతర్జాతీయస్థాయిలో..అదీ ప్రపంచకప్ టోర్నీలో సౌదీ అరేబియాజట్టు సాధించిన అతిపెద్ద విజయం ఇదే కావడం విశేషం.
పోటీల రెండోరోజున జరిగిన గ్రూప్- బీ మ్యాచ్ ల్లో ఇంగ్లండ్ 6-2తో ఇరాన్ ను చిత్తు చేయగా..అమెరికా- వేల్స్ జట్ల పోటీ రెండుజట్లూ చెరో గోల్ చేయడంతో డ్రాగా ముగిసింది.