ఒరిస్సా వేదికగా ప్రపంచకప్ హాకీ సంబరం!
పురుషుల ప్రపంచకప్ హాకీ టోర్నీకి భారత్ మూడోసారి ఆతిథ్యమిస్తోంది.
పురుషుల ప్రపంచకప్ హాకీ టోర్నీకి భారత్ మూడోసారి ఆతిథ్యమిస్తోంది. 2023 ప్రపంచకప్ టోర్నీకి ఒరిస్సా వేదికగా సన్నాహాలు ప్రారంభమయ్యాయి. భారత్ తో సహా మొత్తం 16 దేశాలజట్లు తలపడబోతున్నాయి....
15వ ప్రపంచకప్ పురుషుల హాకీ సమరానికి ఒడిషా మరోసారి వేదికగా నిలిచింది. 2023 జనవరి 15 నుంచి జరుగనున్నఈ టోర్నీకి భువనేశ్వర్, రూర్కెలా వేదికలుగా
నిలిచాయి.
గతంలో ముంబై నగరం ప్రపంచకప్ కు ఆతిథ్యమివ్వగా..2018 ప్రపంచకప్ హాకీ టోర్నీని భువనేశ్వర్ వేదికగా నిర్వహించారు. మరోసారి..2023 ప్రపంచకప్ టో్ర్నీకి సైతం ఒడిషానే వేదికగా నిలిచింది.
16జట్లతో ప్రపంచ సమరం..
అంతర్జాతీయ హాకీలో అత్యున్నత ర్యాంకులు సాధించిన మొదటి 16 జట్లు నాలుగు గ్రూపులుగా అమీతుమీ తేల్చుకోనున్నాయి. పూల్ -ఏలో ఆస్ట్ర్రేలియా, అర్జెంటీనా, ఫ్రాన్స్, దక్షిణాఫ్రికా, పూల్ - బీ లో బెల్జియం, జర్మనీ, కొరియా, జపాన్, పూల్ - సీలో నెదర్లాండ్స్, న్యూజిలాండ్, మలేసియా, చిలీ, పూల్ -డీలో భారత్, స్పెయిన్, వేల్స్, ఇంగ్లండ్ తలపడనున్నాయి.
జనవరి 27 సెమీఫైనల్స్, జనవరి 29న ఫైనల్స్ నిర్వహిస్తారు.
భారత్ కు మన్ ప్రీత్ నాయకత్వం..
1975 ప్రపంచకప్ విజేత భారత్ ప్రస్తుత టోర్నీలో ఆతిధ్యజట్టు హోదాలో పోటీకి దిగుతోంది. మన్ ప్రీత్ సింగ్ నాయకత్వంలో భారత్ టైటిల్ కు గురిపెట్టింది. గత ప్రపంచకప్ లో క్వార్టర్ ఫైనల్లో 1-2తో నెదర్లాండ్స్ చేతిలో ఓటమి పొందిన భారత్ ఈసారి టైటిల్ ఆశలతో పోటీకి సిద్ధమయ్యింది.
ఈ టోర్నీ కోసం రూర్కెలాలో బిర్సాముండా హాకీ స్టేడియాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించారు. 1975లో భారత్ తొలిసారిగా ప్రపంచకప్ నెగ్గిన తర్వాత..మరో రెండు పతకాలు మాత్రమే సాధించగలిగింది.
మరో ప్రపంచ టైటిల్ కోసం గత 45 సంవత్సరాలుగా ఎదురుచూస్తోంది. ప్రస్తుత టోర్నీలో ఆస్ట్ర్రేలియా, నెదర్లాండ్స్ లాంటి దిగ్గజజట్లను భారత్ అధిగమించగలిగితేనే విజేతగా నిలిచే అవకాశం ఉంది.