Telugu Global
Sports

విరాట్ చెలరేగితేనే భారత్ కు ప్రపంచకప్!

ప్రపంచ మాజీ చాంపియన్ భారత్ మరోసారి టీ-20 విశ్వవిజేతగా నిలవాలంటే దిగ్గజఆటగాడు విరాట్ కొహ్లీ పూర్తిస్థాయిలో చెలరేగక తప్పదని పలువురు మాజీ క్రికెటర్లు అంటున్నారు.

విరాట్ చెలరేగితేనే భారత్ కు ప్రపంచకప్!
X

ప్రపంచ మాజీ చాంపియన్ భారత్ మరోసారి టీ-20 విశ్వవిజేతగా నిలవాలంటే దిగ్గజఆటగాడు విరాట్ కొహ్లీ పూర్తిస్థాయిలో చెలరేగక తప్పదని పలువురు మాజీ క్రికెటర్లు అంటున్నారు. విరాట్ ప్రమేయం లేకుండా భారత్ ప్రపంచకప్ నెగ్గడం అంతతేలికాదని భావిస్తున్నారు....



టీ-20 ప్రపంచకప్ సూపర్ -12రౌండ్ గ్రూప్ -2 ప్రారంభమ్యాచ్ లో పాక్ ప్రత్యర్థిగా దిగ్గజఆటగాడు విరాట్ కొహ్లీ...మాస్టర్ క్లాస్ ఇన్నింగ్స్ పై ప్రశంసల వర్షం ఇంకా కురుస్తూనే ఉంది. గత మూడేళ్లుగా అంతంత మాత్రం ఫామ్ లో ఉన్న విరాట్ సరైన సమయంలో పూర్తిస్థాయిలో రాణిస్తూ రావడం భారత్ కు కలసివచ్చే అంశమని పలువురు క్రికెట్ పండితులు చెబుతున్నారు.



విరాట్ కే ఆ శక్తి ఉంది- హక్...

క్రికెట్లో పరుగులు సాధించే బ్యాటర్లు చాలమందే ఉన్నారని...అయితే జట్టుకు అవసరమైన సమయంలో ఒంటిచేత్తో విజయాలు అందించే ఆటగాళ్లు అతికొద్దిమంది మాత్రమే ఉంటారని, అలాంటి వారిలో విరాట్ కొహ్లీ అందరి కంటే ముందుంటాడని పాక్ మాజీ కెప్టెన్, కామెంటీటర్ ఇంజమాముల్ హక్ చెప్పాడు.

పాకిస్థాన్ తో ముగిసిన సూపర్ -12 మ్యాచ్ లో భారత్ విజయానికి విరాట్ కొహ్లీ ఇన్నింగ్స్ మాత్రమే కారణమని, భారత్ కు ఒంటిచేత్తో విజయం అందించిన ఘనత కేవలం విరాట్ కు మాత్రమే దక్కుతుందంటూ ప్రశంసించాడు.

ప్రస్తుత ప్రపంచకప్ లో భారత్ విజేతగా నిలవాలంటే విరాట్ కొహ్లీ తన అత్యుత్తమ ఆటతీరును కొనసాగించక తప్పదని హక్ అన్నాడు. విరాట్ చెలరేగకుంటే భారత్ మరోసారి విశ్వవిజేతగా నిలవడం కష్టమని అభిప్రాయపడ్డాడు.

మ్యాచ్ స్వరూపస్వభావాలను తమ ఆటతీరుతో మార్చగల ప్రభావశీలురైన బ్యాటర్లలో విరాట్ ఒకడని, పాకిస్థాన్ పై క్లిష్టసమయంలో 53 బాల్స్ లో 82 పరుగులతో నాటౌట్ గా నిలవడం విరాట్ బ్యాటింగ్ ప్రతిభకు నిదర్శనమని, ఆట 19 ఓవర్ ఆఖరి రెండు బంతుల్లో రెండు సిక్సర్లు బాదడం కేవలం విరాట్ కు మాత్రమే చెల్లిందని హక్ కొనియాడాడు.

ఇక ముందు జరిగే మ్యాచ్ ల్లో సైతం విరాట్ ఇదేస్థాయి ఆటతీరు ప్రదర్శించాలని, విరాట్ జోరందుకొంటే భారత్ అంత ప్రమాదకరమైన జట్టు మరొకటి లేదని విశ్లేషించాడు.

ప్రస్తుత భారత జట్టులో అత్యంత ప్రమాదకరమైన బ్యాటర్ ఎవరైనా ఉంటే అది విరాట్ కొహ్లీ మాత్రమేనని ఇంజమాముల్ హక్ కితాబిచ్చాడు.

పాక్ తో ముగిసిన ఉత్కంఠభరితపోరులో విరాట్ తన తొలి 12 బంతుల్లో 21 పరుగులు మాత్రమే సాధించడం ద్వారా తడబాటు పడ్డాడని...అయితే ఆ తర్వాతి 32 బాల్స్ లోనే 70 పరుగులు సాధించడం ద్వారా మ్యాచ్ విన్నర్ గా నిలవడం అసాధరణమంటూ కితాబిచ్చాడు.

పరుగులు సాధించే బ్యాటర్లంతా తమజట్టుకు విజయాలు అందించలేరని...విరాట్ లాంటి అతికొద్దిమంది మాత్రమే మ్యాచ్ విన్నర్లుగా మిగులుతారని, హార్ధిక్ పాండ్యా సైతం

తన ఆటతీరులో పరిణతి ప్రదర్శించాడని హక్ అన్నాడు. 37 బాల్స్ లో 40 పరుగులు చేయడంతో పాటు 113 పరుగుల కీలకభాగస్వామ్యంలో విరాట్ కు అండగా పాండ్యా నిలవటమే భారత్ విజయానికి కారణమని తెలిపాడు.

విరాట్ ఒక్కడే గెలిపించలేడు- మదన్ లాల్

మరోవైపు...భారత్ ప్రపంచకప్ నెగ్గాలంటే విరాట్ కొహ్లీ ఒక్కడు రాణిస్తేనే సరిపోదని, కేవలం విరాట్ పైనే భారం మోపితే భారీమూల్యం చెల్లించక తప్పదని భారత మాజీ పేస్ బౌలర్, మాజీ సెలెక్టర్ మదన్ లాల్ హెచ్చరించాడు.

ఏ జట్టయినా ప్రపంచ టైటిల్ నెగ్గాలంటే జట్టులోని 11 మంది ఆటగాళ్లు కలసికట్టుగా రాణించక తప్పదని, బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ విభాగాలలో నిలకడగా రాణించక తప్పదని సూచించాడు.

విన్నింగ్స్ కాంబినేషన్ పేరుతో మ్యాచ్ లన్నింటికీ ఒకేజట్టును దింపడంలో అర్ధంలేదని, ప్రత్యర్థి, వికెట్, పరిస్థితులను బట్టి జట్టు కూర్పులో మార్పులు చేర్పులు చేసుకోవాలని మదన్ లాల్ అభిప్రాయపడ్డాడు.

రిషబ్ పంత్ కు చోటివ్వండి...

తనదైన రోజున ఒంటిచేత్తో జట్టును గెలిపించే సత్తా ఉన్న ఆటగాడు రిషబ్ పంత్ ను తుదిజట్టులోకి తీసుకోవాలని, పంత్ లాంటి ప్రమాదకరమైన ఆటగాడిని డగౌట్ కు పరిమితం చేయవద్దని సలహా ఇచ్చాడు. తాను ఆడిన ప్రతి ఐదుమ్యాచ్ ల్లోనూ...రెండుమ్యాచ్ ల్లో తన జట్టును విజేతగా నిలిపే ప్రతిభ రిషబ్ పంత్ కు ఉందని మదన్ లాల్ గుర్తు చేశాడు.

కేవలం విరాట్ కొహ్లీని మాత్రమే నమ్ముకొని ప్రపంచకప్ సాధించగలమనుకొంటే ..అంతకుమించిన పొరపాటు మరొకటి ఉండబోదని మదన్ లాల్ తెలిపాడు.

భారతజట్టు తన తదుపరి రౌండ్ సూపర్ -12 మ్యాచ్ ను సిడ్నీ వేదికగా గురువారం నెదర్లాండ్స్ తో ఆడనుంది.

First Published:  26 Oct 2022 11:33 AM IST
Next Story