ప్రపంచకప్ లో మాక్స్ వెల్ సునామీ సెంచరీ!
వన్డే ప్రపంచకప్ లో సునామీ శతకం బాదిన బ్యాటర్ ఘనతను కంగారూ హిట్టర్ గ్లెన్ మాక్స్ వెల్ దక్కించుకొన్నాడు. నెదర్లాండ్స్ బౌలర్లను ఊచకోత కోసి 40 బంతుల్లోనే రికార్డు సెంచరీ సాధించాడు.
వన్డే ప్రపంచకప్ లో సునామీ శతకం బాదిన బ్యాటర్ ఘనతను కంగారూ హిట్టర్ గ్లెన్ మాక్స్ వెల్ దక్కించుకొన్నాడు. నెదర్లాండ్స్ బౌలర్లను ఊచకోత కోసి 40 బంతుల్లోనే రికార్డు సెంచరీ సాధించాడు.
భారతగడ్డ పై నాలుగోసారి జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్ ల్లో రికార్డుల మోత మోగుతోంది. బంతిపై బ్యాటు ఆధిపత్యం కొనసాగుతోంది.
అప్ఘనిస్థాన్, నెదర్లాండ్స్ లాంటి చిరుజట్లు ప్రపంచ మేటిజట్లపై సంచలన విజయాలు సాధిస్తుంటే..ఆస్ట్ర్రేలియా, భారత్, దక్షిణాఫ్రికా లాంటి దిగ్గజజట్లు చిన్నజట్లను దంచి కొడుతున్నాయి.
40 బంతుల్లోనే మాక్స్ వెల్ సెంచరీ!
న్యూఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన ఐదోరౌండ్ పోరులో పసికూన నెదర్లాండ్స్ ను ఐదుసార్లు విజేత ఆస్ట్ట్రేలియా 309 పరుగులతో చిత్తు చేసింది. డచ్ బౌలర్లను కంగారూ బ్యాటర్లు ఊచకోత కోసి విడిచి పెట్టారు.
50 ఓవర్లలో ఆస్ట్ర్రేలియా 8 వికెట్లకు 399 పరుగుల భారీస్కోరు నమోదు చేసింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ 104, మిడిలార్డర్ బ్యాటర్ గ్లెన్ మాక్స్ వెల్ 106 పరుగులతో చెలరేగిపోయారు.
తనదైన రోజున సూపర్ హిట్టర్ గా పేరుపొందిన కంగారూ స్పిన్ ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్ వెల్ ఆఖరి 10 ఓవర్లలోనే ప్రపంచకప్ మెరుపు శతకం బాదిన బ్యాటర్ గా రికార్డు నెలకొల్పాడు.
కేవలం 40 బంతుల్లోనే సెంచరీ బాదడం ద్వారా ప్రపంచకప్ రికార్డు నెలకొల్పాడు. మాక్స్ వెల్ సెంచరీలో 9 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి. ప్రస్తుత ప్రపంచకప్ లోనే శ్రీలంక ప్రత్యర్థిగా..న్యూఢిల్లీ వేదికగానే దక్షిణాఫ్రికా బ్యాటర్ మర్కరమ్ సాధించిన 49 బంతుల సెంచరీ రికార్డును మాక్స్ వెల్ 40 బంతుల శతకంతో తెరమరుగు చేశాడు.
గత 48 సంవత్సరాల ప్రపంచకప్ చరిత్రలో అతితక్కువ బంతుల్లో శతకం బాదిన బ్యాటర్ ఘనతను మాక్స్ వెల్ దక్కించుకొన్నాడు.
వన్డే క్రికెట్ చరిత్రలో 31 బంతుల సెంచరీ..
50 ఓవర్ల ఫార్మాట్లో ఫాస్టెస్ట్ సెంచరీ బాదిన బ్యాటర్ ప్రపంచ రికార్డును సఫారీ సూపర్ హిట్టర్ ఏబీ డివిలియర్స్ నెలకొల్పాడు. వెస్టిండీస్ పై డివిలియర్స్ 31 బంతుల్లోనే సునామీ సెంచరీ బాదాడు.
కివీ బ్యాటర్ కోరీ యాండర్సన్ 36 బంతుల్లోనూ, పాక్ మాజీ కెప్టెన్ షాహీద్ అఫ్రిదీ 37 బంతుల్లోనూ, మాక్ వెల్ 40 బంతుల్లోనూ, మర్కరమ్ 49 బంతుల్లోనూ సాధించిన శతకాలే మొదటి మొదటి ఐదు అత్యుత్తమ సెంచరీలుగా ఉన్నాయి.
సచిన్ సరసన డేవిడ్ వార్నర్..
వన్డే ప్రపంచకప్ చరిత్రలో అత్యధికంగా ఆరుశతకాలు బాదిన మాస్టర్ సచిన్ రికార్డును కంగారూ సీనియర్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ సమం చేశాడు. భారత కెప్టెన్ రోహిత్ శర్మ మొత్తం 7 సెంచరీలతో అగ్రస్థానంలో ఉంటే..సచిన్, వార్నర్ ఆరేసి శతకాలతో సంయుక్త ద్వితీయస్థానంలో ఉన్నారు.
నెదర్లాండ్స్ తో జరిగిన 5వ రౌండ్ మ్యాచ్ లో వార్నర్ 93 బంతుల్లో 11 బౌండ్రీలు, 3సిక్సర్లతో 104 పరుగులు సాధించడం ద్వారా ప్రపంచకప్ లో తన 6వ శతకం సాధించగలిగాడు.
ప్రస్తుత ప్రపంచకప్ మొదటి 5 రౌండ్ల మ్యాచ్ లు ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డికాక్ 3 శతకాలతో అగ్రస్థానంలో నిలిస్తే..వార్నర్ రెండు శతకాలతో రెండోస్థానంలో ఉన్నాడు
వన్డే ప్రపంచకప్ లో వరుసగా మూడు శతకాలు బాదిన ఆరుగురు దిగ్గజ బ్యాటర్లలో డికాక్ సైతం వచ్చి చేరాడు.
2019 వన్డే ప్రపంచకప్ లో రోహిత్ శర్మ 5 సెంచరీలతో రికార్డు నెలకొల్పితే..2015 ప్రపంచకప్ లో కుమార సంగక్కర 4 శతకాలు, 1996 ప్రపంచకప్ లో మార్క్ వా 3 శతకాలు, 2007 ప్రపంచకప్ లో మాథ్యూ హేడెన్ 3 శతకాలు, 2003 ప్రపంచకప్ లో సౌరవ్ గంగూలీ 3 శతకాలు చొప్పున సాధించారు.
48 సంవత్సరాల ప్రపంచకప్ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీ బాదిన ఘనత మాత్రం మాడ్ మ్యాక్స్ హిట్టర్ గ్లెన్ మాక్స్ వెల్ కు దక్కింది.