Telugu Global
Sports

ప్రపంచ అథ్లెటిక్స్ లో భారత రిలేజట్టు జోరు!

2023 ప్రపంచ ట్రాక్ అండ్ ఫీల్డ్ మీట్ పురుషుల 400 మీటర్ల రిలే ఫైనల్స్ కు భారతజట్టు తొలిసారిగా చేరుకొంది. సరికొత్త ఆసియా రికార్డుతో సంచలనం సృష్టించింది.

ప్రపంచ అథ్లెటిక్స్ లో భారత రిలేజట్టు జోరు!
X

2023 ప్రపంచ ట్రాక్ అండ్ ఫీల్డ్ మీట్ పురుషుల 400 మీటర్ల రిలే ఫైనల్స్ కు భారతజట్టు తొలిసారిగా చేరుకొంది. సరికొత్త ఆసియా రికార్డుతో సంచలనం సృష్టించింది.

హంగెరీ రాజధాని బుడాపెస్ట్ వేదికగా జరుగుతున్న 2023 ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ పురుషుల 400మీటర్ల రిలేలో భారత పురుషులజట్టు అంచనాలకు మించి రాణించింది. అమెరికా, జమైకా, గ్రేట్ బ్రిటన్ లాంటి ప్రపంచ మేటి జట్లకే సవాలు విసిరింది.

తొలిసారిగా ఫైనల్లో భారతజట్టు...

పురుషుల 4x400 రిలే పరుగులో మహ్మద్ అనాస్ యాహ్యా, అమోజ్ జాకబ్, మహ్మద్ అజ్మల్ వరియతోడీ, రాజేశ్ రమేశ్ లతో కూడిన భారతజట్టు సరికొత్త ఆసియా రికార్డు నెలకొల్పింది.

హీట్-2లో అమెరికాజట్టుకు గట్టి పోటీ ఇచ్చిన భారతజట్టు 2 నిముషాల 59.05 సెకెన్లరికార్డుతో తొలిసారిగా ఫైనల్స్ కు అర్హత సంపాదించింది. అమెరికాజట్టు 2 నిముషాల 58.47 సెకెన్ల టైమింగ్ తో టాపర్ గా నిలిస్తే ..భారత్ ఆ తర్వాతి స్థానంలో నిలవడం ద్వారా ఫైనల్స్ బెర్త్ ఖాయం చేసుకోగలిగింది.

ఒక్కో హీట్ లో మొదటి మూడుస్థానాలలో నిలిచినజట్ల కు మాత్రమే మెడల్ రౌండ్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకూ జపాన్ జట్టు పేరుతో ఉన్న 2 నిముషాల 59.51 సెకన్ల ఆసియా రికార్డును భారతజట్టు నిముషాల 58.47 సెకన్ల టైమింగ్ తో తెరమరుగు చేయగలిగింది.

గ్రేట్ బ్రిటన్, జమైకా లాంటి ప్రపంచ మేటిజట్లను భారత్ అధిగమించడం విశేషం. హీట్స్ లో గ్రేట్ బ్రిటన్ మూడు, జమైకా ఐదు స్థానాలలో నిలిచాయి.

నేడు నీరజ్ చోప్రా 'బంగారు' వేట!

ప్రపంచ ట్రాక్ అండ్ ఫీల్డ్ ఆఖరిరోజు పోటీలలో భాగంగా ఈ రోజు జరిగే పురుషుల జావలిన్ త్రోలో భారత ఆశాకిరణం నీరజ్ చోప్రా స్వర్ణపతకం అలవోకగా గెలుచుకొనే అవకాశాలు ఉన్నాయి.

ఇప్పటికే ఒలింపిక్స్, ఆసియా క్రీడలు, కామన్వెల్త్ గేమ్స్, డైమండ్ లీగ్ బంగారు పతకాలు సాధించిన నీరజ్..గత ప్రపంచ మీట్ లో రజత పతకంతో మాత్రమే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. స్వర్ణ పతకం లేని లోటును ప్రస్తుత ప్రపంచ మీట్ లో తీర్చుకోవాలన్న పట్టుదలతో నీరజ్ ఉన్నాడు.

క్వాలిఫైయింగ్ రౌండ్ తొలి ప్రయత్నంలోనే 25 ఏళ్ల నీరజ్ 88.77 మీటర్ల దూరం విసరడం ద్వారా ఫైనల్స్ కు అర్హత సాధించాడు. ఈ రోజు జరిగే గోల్డ్ మెడల్ రౌండ్లో మరో 11 మంది ప్రత్యర్థులతో నీరజ్ చోప్రా తలపడనున్నాడు. 90 మీటర్ల రికార్డు సాధించడమే లక్ష్యంగా నీరజ్ ప్రపంచ టైటిల్ వేటకు గురిపెట్టాడు.

First Published:  27 Aug 2023 1:44 PM IST
Next Story