ప్రపంచ విలువిద్యలో భారత్ కు ట్రిపుల్ గోల్డ్ !
2023- ప్రపంచ విలువిద్య పోటీలలో భారత ఆర్చర్లు బంగారు పంట పండించుకొన్నారు. తొలిసారిగా పురుషుల, మహిళల వ్యక్తిగత విభాగంలో స్వర్ణపతకాలు సాధించడం ద్వారా సరికొత్త చరిత్ర సృష్టించారు.
2023- ప్రపంచ విలువిద్య పోటీలలో భారత ఆర్చర్లు బంగారు పంట పండించుకొన్నారు. తొలిసారిగా పురుషుల, మహిళల వ్యక్తిగత విభాగంలో స్వర్ణపతకాలు సాధించడం ద్వారా సరికొత్త చరిత్ర సృష్టించారు.
జర్మన్ రాజధాని బెర్లిన్ వేదికగా జరిగిన 2023 ప్రపంచ విలువిద్య పోటీల టీమ్, వ్యక్తిగత విభాగాలలో భారత ఆర్చర్లు మూడు బంగారు పతకాలు సాధించడం ద్వారా సరికొత్త రికార్డు నెలకొల్పారు.
కాంపౌండ్ విభాగం పురుషుల, మహిళల వ్యక్తిగత విభాగంలో రెండు, మహిళల టీమ్ విభాగంలో ఒకటి స్వర్ణ పతకాలు సాధించారు.
17 ఏళ్ల వయసులో ప్రపంచ టైటిల్....
మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో భారత్ కు చెందిన 17 సంవత్సరాల ఆర్చర్ ఆదితీ గోపీచంద్ స్వామి బంగారు పతకంతో అరుదైన ఘనతను సొంతం చేసుకొంది.
ప్రపంచ విలువిద్య చరిత్రలోనే అత్యంత పిన్నవయసులో విశ్వవిజేతగా నిలిచిన ఆర్చర్ గా రికార్డు నెలకొల్పింది.
బంగారు పతకం కోసం జరిగిన పోరులో మెక్సికోకు చెందిన ఆండ్రియా బెసీరాను 149- 147 పాయింట్ల తేడాతో అధిగమించి విశ్వవిజేతగా నిలిచింది. భారత్ కు చెందిన ఓ ఆర్చర్ ప్రపంచ టైటిల్ సాధించడం ఇదే మొదటిసారి.
గత నెలలో ఐర్లాండ్ వేదికగా జరిగిన ప్రపంచ యువజన ఆర్చరీ పోటీల 18 సంవత్సరాల విభాగంలో జంట స్వర్ణాలు సాధించిన ఆదితీ ..ఆ తర్వాత కొద్దివారాల వ్యవధిలోనే ప్రపంచ విలువిద్య బంగారు పతకం అందుకోడం విశేషం.
ఓజాస్ కు పురుషుల ప్రపంచ టైటిల్...
పురుషుల వ్యక్తిగత విభాగంలో బంగారు పతకం సాధించిన మొనగాడిగా భారత్ కే చెందిన ఓజాస్ ప్రవీణ్ డియోటేల్ నిలిచాడు. స్వర్ణపతకం పోరులో పోలెండ్ కు చెందిన లూకాస్ ను ఒకే ఒక్కపాయింట్ తేడాతో ఓడించి విశ్వవిజేతగా నిలిచాడు. నువ్వానేనా అన్నట్లుగాసాగిన టైటిల్ పోరులో ఓజాస్ 150-149 పాయింట్లతో నెగ్గి బంగారు పతకం అందుకొన్నాడు.
ప్రపంచ విలువిద్య పోటీల పురుషుల వ్యక్తిగత విభాగంలో విజేతగా నిలిచిన తొలి భారత ఆర్చర్ ఘనతను ఓజాస్ సాధించాడు.
మహిళల టీమ్ విభాగంలో స్వర్ణం...
మహిళల కాంపౌండ్ టీమ్ విభాగంలో పర్నీత్ కౌర్, వెన్నెం జ్యోతీ, ఆదితిలతో కూడిన భారతజట్టు ప్రపంచ విజేతగా నిలిచింది. బంగారు పతకం కోసం జరిగిన పోరులో మెక్సికోకు చెందిన ఆండ్రియా బెసీరా, డాఫ్నీ క్వింటెరో, అనా సోఫియాలతో కూడిన జట్టును 235-229 పాయింట్లతో చిత్తు చేసి తొలిసారిగా ప్రపంచ టైటి్ల్ ను కైవసం చేసుకోగలిగింది.
తెలుగు ఆర్చర్ కు రెండు పతకాలు...
భారతజట్టులో సభ్యురాలిగా ఉన్న జ్యోతి వెన్నం మహిళల టీమ్, వ్యక్తిగత విభాగాలలో రెండు పతకాలు సాధించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ కే గర్వకారణంగా నిలిచింది.
మహిళల టీమ్ విభాగంలో పర్నీత్ కౌర్, ఆదితీలతో కూడిన జట్టుతో పాల్గొన్న జ్యోతి స్వర్ణ పతకంతో పాటు ప్రపంచ టైటిల్ అందుకొంది.
మహిళల వ్యక్తిగత విభాగం సెమీస్ లో ఆదితీ చేతిలో ఓడినా..చివరకు కాంస్యపతకంతో సరిపెట్టుకొంది. విజయవాడ నగరానికి చెందిన జ్యోతి గత కొద్ది సంవత్సరాలుగా
అంతర్జాతీయ విలువిద్య పోటీలలో భారత్ కు ఏదో ఒక పతకం సాధించి పెడుతూనే ఉంది.
ప్రపంచ విలువిద్య కాంపౌండ్ విభాగంలో భారత ఆర్చర్లు..ఒకే టోర్నీలో మూడు బంగారు పతకాలు సాధించడం ఇదే మొదటిసారి.