Telugu Global
Sports

వాంగ్ హ్యాట్రిక్..మహిళా ఐపీఎల్ ఫైనల్లో ముంబై!

ప్రారంభ మహిళా ఐపీఎల్ ఫైనల్స్ కు హాట్ ఫేవరెట్ ముంబై ఇండియన్స్ అలవోకగా చేరుకొంది.

వాంగ్ హ్యాట్రిక్..మహిళా ఐపీఎల్ ఫైనల్లో ముంబై!
X

ప్రారంభ మహిళా ఐపీఎల్ ఫైనల్స్ కు హాట్ ఫేవరెట్ ముంబై ఇండియన్స్ అలవోకగా చేరుకొంది. ఎలిమినేటర్ సమరంలో యూపీ వారియర్స్ ను 72 పరుగులతో చిత్తు చేసి టైటిల్ సమరానికి అర్హత సంపాదించింది....

ప్రపంచంలోనే అత్యంత భాగ్యవంతమైన భారత క్రికెట్ బోర్డు తొలిసారిగా మహిళలకు నిర్వహిస్తున్న ఐపీఎల్ ప్రారంభ సీజన్ ఫైనల్స్ కు ముంబై ఇండియన్స్ సునాయాసంగా చేరుకొంది. బ్యాటింగ్ లో స్కీవియర్ బ్రంట్, బౌలింగ్ లో ఇస్సీ వాంగ్ చెలరేగిపోడంతో ముంబైకి ఎదురేలేకుండా పోయింది.

నవీ ముంబైలోని డాక్టర్ డీవై పాటిల్ స్టేడియం వేదికగా జరిగిన ఎలిమినేటర్ రౌండ్ పోరులో ముంబై 72 పరుగులతో యూపీ వారియర్స్ ను చిత్తు చేసింది. సూపర్ సండే టైటిల్ సమరంలో ఢిల్లీ క్యాపిటల్స్ తో ముంబై అమీతుమీ తేల్చుకోనుంది.

బ్రంట్ సూపర్ హాఫ్ సెంచరీ....

ప్లే-ఆఫ్ రౌండ్స్ లో భాగంగా జరిగిన ఈ తొలినాకౌట్ (ఎలిమినేటర్ ) రౌండ్ పోరులో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన ముంబై 20 ఓవర్లలో 4 వికెట్లకు 182 పరుగుల భారీస్కోరు నమోదు చేసింది.

స్కీవర్‌ బ్రంట్‌ కేవలం 38 బంతుల్లోనే 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 72 పరుగుల నాటౌట్ స్కోరు సాధించింది.అమెలియా కెర్‌ (29; 5 ఫోర్లు), హేలీ మాథ్యూస్‌ (26; 2 ఫోర్లు, ఒక సిక్సర్‌), యస్తిక భాటియా (21; 4 ఫోర్లు), హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (14) రెండంకెల స్కోర్లు సాధించడంతో ముంబై ప్రత్యర్థి ఎదుట 183 పరుగుల భారీలక్ష్యాన్ని ఉంచగలిగింది.

ముంబై ఓపెనింగ్ జోడీ యస్తిక భాటియా, హేలీ మాథ్యూస్‌ చక్కటి ఆరంభం ఇచ్చారు. తొలి వికెట్‌కు 31 పరుగులు జోడించిన అనంతరం యస్తిక ఔటైనా.. స్కీవర్‌ క్రీజులో అడుగుపెట్టడంతో మ్యాచ్‌ స్వరూపమే మారిపోయింది. ఆరు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రాజేశ్వరి గైక్వాడ్‌ క్యాచ్‌ విడిచి పెట్టడంతో నిలదొక్కుకున్న బ్రంట్ చివరి వరకు దూకుడు కొనసాగించగలిగింది.

హేలీ మాథ్యూస్‌, హర్మన్‌ప్రీత్‌ వికెట్లు కోల్పోయినా ముంబై ధాటిగా బ్యాటింగ్ కొనసాగించింది. స్కీవర్‌.. వీలు చిక్కనప్పుడల్లా బౌండ్రీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది. అమెలియా కెర్‌ సైతం అండగా నిలవడంతో ముంబై పరుగులవేట టాప్ గేర్ లో సాగింది. ఆఖరి ఓవర్‌లో క్రీజులోకి వచ్చిన పూజ వస్ర్తాకర్‌ (4 బంతుల్లో 11 నాటౌట్‌; ఒక ఫోర్‌, ఒక సిక్సర్‌) కీలక పరుగులు అందించడంతో ముంబై భారీ స్కోరు చేయగలిగింది.

యూపీ బౌలర్లలో స్పిన్నర్ సోఫియా ఎకెల్‌స్టోన్‌ 2 వికెట్లు పడగొట్టింది.

వాంగ్ పేస్ లో యూపీ గల్లంతు!

183 పరుగుల భారీలక్ష్యంతో చేజింగ్ కు దిగిన యూపీ వారియర్స్ 17.4 ఓవర్లలో 110 పరుగులకే కుప్పకూలిపోయింది. కెప్టెన్ అలీసా హేలీతో సహా స్టార్ హిట్టర్లంతా విఫలమైనా మిడిలార్డర్ బ్యాటర్ కిరణ్‌ నవగిరె పోరాడినా ఫలితం లేకపోయింది.కెప్టెన్‌ అలీసా హేలీ (11) త్వరగానే అవుటయ్యింది. శ్వేత షెరావత్‌ (1), తహిలా మెక్‌గ్రాత్‌ (7) విఫలమయ్యారు. కిరణ్ 27 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 43 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచింది. ఒకదశలో 21 పరుగులకే మూడు టాపార్డర్ వికెట్లు కోల్పోయిన యూపీ ఎదురీత మొదలు పెట్టింది. ఈ దశలో కిరణ్‌ నవగిరె కాస్త పోరాడింది. గ్రేస్‌ హారిస్‌ (14), దీప్తి శర్మ (16) అండతో జట్టును విజయ తీరాలకు చేర్చేందుకు ప్రయత్నించినా.. మీడియం పేసర్ ఇస్సీ వాంగ్ జోరుతో విఫలం కాక తప్పలేదు.

ముంబై బౌలర్లు కీలక సమయాల్లో వికెట్లు పడగొడుతూ పట్టు బిగించారు. ఇన్నింగ్స్‌ 13వ ఓవర్‌లో ఇస్సీ వాంగ్‌ హ్యాట్రిక్‌ నమోదు చేసుకుంది. రెండో బంతికి కిరణ్‌ ఔట్‌ కాగా.. ఆ తర్వాత రెండు బంతుల్లో సిమ్రన్‌ (0), సోఫియా (0) డౌకట్లుగా వెనుదిరిగారు. దీంతో యూపీ ఘోరపరాజయం, ముంబై భారీవిజయం ఖాయమైపోయాయి.

ముంబై బౌలర్లలో పేసర్ ఇస్సీ వాంగ్‌ ‘హ్యాట్రిక్‌’తో సహా నాలుగు వికెట్లు పడగొట్టగా.. సైకా ఇషాఖ్‌ రెండు వికెట్లు ఖాతాలో వేసుకుంది.

కీలక హాఫ్ సెంచరీతో ముంబై భారీస్కోరులో ప్రధానపాత్ర వహించిన స్కీవర్‌ బ్రంట్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది.

ఈ మ్యాచ్ కు ఒలింపిక్స్ జావలిన్ త్రో హీరో నీరజ్ చోప్రా, యూపీ కెప్టెన్ అలీసా హేలీ భర్త, కంగారూ ఫాస్ట్ బౌలర్ మిషెల్ స్టార్క్ ..హాజరుకావడం విశేషం.

ముంబై వేదికగా ఆదివారం జరిగే టైటిల్ సమరంలో లీగ్ టేబుల్ టాపర్ ఢిల్లీ క్యాపిటల్స్ తో ముంబై ఇండియన్స్ తలపడనుంది.

First Published:  25 March 2023 1:00 PM IST
Next Story