Telugu Global
Sports

హంపికి కరోనా భయం, ఏషియాడ్ కు దూరం?

ఆసియాక్రీడల్లో డబుల్ గోల్డ్ మెడలిస్ట్ , గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి చైనా వేదికగా జరిగే 2023 ఆసియాక్రీడలకు దూరంగా ఉండాలని నిర్ణయించింది.

హంపికి కరోనా భయం, ఏషియాడ్ కు దూరం?
X

ఆసియాక్రీడల్లో డబుల్ గోల్డ్ మెడలిస్ట్ , గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి చైనా వేదికగా జరిగే 2023 ఆసియాక్రీడలకు దూరంగా ఉండాలని నిర్ణయించింది.

తెలుగుతేజం, ప్రపంచ మాజీ చాంపియన్, గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపిని కరోనా భయం వెంటాడుతోంది. చైనా లోని హాంగ్జూ వేదిక జరిగే 2023 ఆసియాక్రీడల్లో తాను పాల్గొనేది లేనిది ఇప్పుడు చెప్పలేనని ప్రకటించింది.

ఆసియాక్రీడల్లో 13 సంవత్సరాల విరామం తర్వాత తిరిగి చెస్ పోటీలను మెడల్ అంశంగా నిర్వహిస్తున్నారు.

రెండుసార్లు ఏషియాడ్ విజేత హంపి..

ఆసియాక్రీడల్లో రెండు బంగారు పతకాలు సాధించిన అరుదైన రికార్డు కోనేరు హంపికి ఉంది. 2006 దోహా ఒలింపిక్స్ లో తొలిసారిగా ప్రవేశపెట్టిన ఆసియాక్రీడల చదరంగంలో హంపి బంగారు పతకం సాధించింది. మహిళల వ్యక్తిగత విభాగంలో మాత్రమే కాదు..టీమ్ మిక్సిడ్ విభాగంలో సైతం స్వర్ణపతకం అందుకొంది.

గతేడాది మహాబలిపురం వేదికగా జరిగిన ప్రపంచ చెస్ ఒలింపియాడ్ లో భారత మహిళలు కాంస్య పతకం సాధించడంలోనూ గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి ప్రధానపాత్ర వహించింది.

అయితే..చైనా వేదికగా సెప్టెంబర్ లో జరుగనున్న 2023 ఆసియాక్రీడల్లో తాను పాల్గొనటం అనుమానమేనని చెప్పింది. చైనాలో కరోనా వికటాట్టహాసం చేస్తుంటే పోటీలలో ఎలా పాల్గొనాలో తనకు అర్థంకావడం లేదని వాపోయింది.

ఆసియాక్రీడల్లో తాను పాల్గొనేది లేనిదీ జూన్ లేదా జులై మాసాలలో నిర్ణయించుకొంటానని చెప్పింది.

13 సంవత్సరాల తర్వాత తిరిగి ఆసియాక్రీడల్లో చెస్ ను నిర్వహించడం సంతోషమే అయినా..వేదికగా చైనా ఉండటంతో తాను ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సి వస్తోందని వాపోయింది.

2019లో ప్రపంచ మహిళా ర్యాపిడ్ చెస్ టైటిల్ సాధించిన హంపికి ప్రస్తుత ఆసియాక్రీడల్లో నేరుగా పాల్గొనే అవకాశం దక్కింది.

మహిళా చెస్ కు ఆదరణ ఏదీ?

మనదేశంలో మహిళా చెస్ లో ఎందరో గ్రాండ్ మాస్టర్లున్నా..తగిన ప్రోత్సాహం, ఆదరణ లభించడలేదంటూ హంపి ఆందోళన వ్యక్తం చేసింది. అంతర్జాతీయ పోటీలకు మహిళలు సన్నద్ధం కావాలన్నా, పోటీలలో పాల్గొనాలన్నా తలకుమంచిన భారంగా మారిందని, మహిళల కోసమే ప్రత్యేకంగా పోటీలు నిర్వహించాలని సూచించింది.

పురుషులు ఓ జట్టుగా కలసి సాధన చేయటం, విదేశీ టోర్నీలలో పాల్గొనటం తేలికని..అదే మహిళల విషయంలో అంతతేలిక కాదని హంపి అభిప్రాయపడింది.

చెస్ క్రీడలో మహిళల ఉన్నతికి చైనా అనుసరిస్తున్న వ్యూహాలు, విధానాలను మనమూ అనుసరించాలని సూచించింది.

First Published:  7 April 2023 11:40 AM IST
Next Story