లండన్ స్టార్ హోటెల్ లో భారత క్రికెటర్ బ్యాగు చోరీ!
ఇంగ్లండ్ రాజధాని లండన్ నగరంలోని స్టార్ హోటెల్ లో భారత మహిళా క్రికెటర్ తానియా భాటియాకు చేదుఅనుభవం ఎదురయ్యింది. హోటెల్ గదిలో ఉంచిన తానియా బ్యాగులోని నగలు, విలువైన వస్తువులు, బ్యాంకు కార్డులు గల్లంతయ్యాయి.
ఇంగ్లండ్ రాజధాని లండన్ నగరంలోని స్టార్ హోటెల్ లో భారత మహిళా క్రికెటర్ తానియా భాటియాకు చేదుఅనుభవం ఎదురయ్యింది. హోటెల్ గదిలో ఉంచిన తానియా బ్యాగులోని నగలు, విలువైన వస్తువులు, బ్యాంకు కార్డులు గల్లంతయ్యాయి...
లండన్ నగరంలోని అంతర్జాతీయ నక్షత్రాల హోటెళ్లు సురక్షితం, భద్రం అనుకొంటే అంతకుమించిన పొరపాటు మరొకటి ఉండదు. కొద్దిరోజుల క్రితమే ఇంగ్లండ్ పర్యటన ముగించుకు వచ్చిన భారత మహిళా క్రికెట్ సభ్యురాలు, వికెట్ కీపర్ బ్యాటర్ తానియా భాటియాకు చేదుఅనుభవమే ఎదురయ్యింది.
ఇంగ్లండ్ తో ముగిసిన టీ-20, వన్డే సిరీస్ పోటీలలో భారతజట్టు సభ్యురాలిగా తానియా పాల్గొంది. తమ దేశానికి వచ్చిన భారతజట్టు సభ్యులకు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు..లండన్ నగరంలోని మారియెట్ స్టార్ హోటెల్ లో బస కల్పించింది.
తానియాకు కేటాయించిన హోటెల్ గదిలో ఉంచిన బ్యాగు గల్లంతయ్యింది. ఆ బ్యాగులో ఉంచిన నగదు, క్రెడిట్ కార్డులు, విలువైన వాచీలు, బంగారు నగల్ని ఎవరో తన గదికి వచ్చి తస్కరించారని తానియా ఫిర్యాదు చేసింది.
ట్విట్టర్ ద్వారా తానియా తనగోడును వెళ్లబోసుకొంది. స్టార్ హోటెళ్లలో...అదీ లండన్ నగరంలో ఇలా జరుగుతుందని తాను ఊహించలేదని, తనకు జరిగిన నష్టానికి మారియెట్ హోటెల్ యాజమాన్యం బాధ్యత వహించాలంటూ తానియా డిమాండ్ చేసింది.
సాధ్యమైనంత త్వరగా విచారణ జరిపి తనకు న్యాయం చేయాలని తానియా కోరింది. మరోవైపు..తానియా పూర్తివివరాలను తమకు అందచేస్తే విచారణ జరుపుతామంటూ హోటెల్ యాజమాన్యం వర్తమానం పంపింది.
ఇంగ్లండ్ మహిళలజట్టుతో ముగిసిన తీన్మార్ టీ-20 సిరీస్ ను 0-3తో చేజార్చుకొన్న భారత్...మూడుమ్యాచ్ ల వన్డే సిరీస్ ను మాత్రం 3-0తో గెలుచుకొన్న సంగతి తెలిసిందే.
భారతజట్టులో సభ్యురాలిగా 19 వన్డేలు, 53 అంతర్జాతీయ టీ-20 మ్యాచ్ ల్లో పాల్గొన్న అనుభవం తానియాకు ఉంది. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలలో పర్యటించిన తనకు..
ఓ స్టార్ హోటెల్ లో ఇలాంటి చేదుఅనుభవం ఎదురుకావడం ఇదే మొదటిసారని తానియా పేర్కొంది.