అవమానాలు భరించి హాకీ శిఖరంపై వందన!
భారత హాకీ మహిళాస్టార్ వందన కటారియా ఓ అరుదైన ఘనత సంపాదించింది. అవమానాలను దిగమింగుకొని అగ్రభాగాన నిలిచింది.
భారత హాకీ మహిళాస్టార్ వందన కటారియా ఓ అరుదైన ఘనత సంపాదించింది. అవమానాలను దిగమింగుకొని అగ్రభాగాన నిలిచింది.
భారత మహిళా హాకీ చరిత్రలో మరే మహిళా సాధించని రికార్డు, ఘనతను 31 సంవత్సరాల వందన కటారియా సొంతం చేసుకొంది. తనను సూటిపోటి మాటలతో వేధించిన, అవమానించిన తన గ్రామప్రజలకు మాత్రమే కాదు..దేశానికే గర్వకారణంగా నిలిచింది.
31 ఏళ్ల వయసులో300 మ్యాచ్ లు....
మనదేశంలో గ్రామీణ ప్రాంతాలకు చెందిన యువతులు, బాలికలు తమకు నచ్చిన ఆటలు ఆడాలన్నా, క్రీడల్లో పాల్గొనాలన్నా అదొక యుద్ధమే. ఇంటిపట్టున ఉండాల్సిన ఆడపిల్లలు పొట్టినిక్కర్లు వేసుకొని మగరాయుళ్ళులా ఆటలాడటమేంటి అన్ని ప్రశ్నించేవారు కొందరైతే...ఆడపిల్లలు ఆటలాడి ఉద్యోగాలు చేయాలా? ఊళ్ళు ఏలాలా అని దెప్పిపొడిచే వారు మరికొందరు. అయితే..ఆటలాడటం ద్వారా ఆడపిల్లలు అందలమెక్కగలరు, ఉద్యోగాలు సంపాదించగలరు, దేశానికే గర్వకారణంగా నిలువగలరని ఉత్తరాఖండ్ లోని రోష్నాబాద్ గ్రామానికి చెందిన యువతి వందన కటారియా చాటి చెప్పింది.
హిమశిఖరాల నుంచి గంగానది నేలపైకి దిగి పాయలు పాయలుగా చీలిపోయే హరిద్వార్ కు సమీపంలోనే గ్రామమే రోష్నాబాద్. ఈ గ్రామం నుంచి అంతర్జాతీయస్థాయికి ఎదిగిన భారత హాకీ సంచలనమే వందన కటారియా.
భారత హాకీకి అమూల్య సేవలు..
గత దశాబ్దకాలంగా భారత హాకీకి అసమాన సేవలు అందిస్తూ పద్మశ్రీ పురస్కారం అందుకొన్న వందన కటారియా ప్లేయర్ కాకముందు, ప్లేయర్ గా గుర్తింపు సంపాదించిన తరువాత తన గ్రామప్రజల నుంచి అవమానాలను, చీత్కారాలను ఎదుర్కొంది. వందన మాత్రమే కాదు.ఆమె కుటుంబ సభ్యులు సైతం వేదనను, క్షోభను భరించాల్సి వచ్చింది.
రాంచీ వేదికగా జరుగుతున్న 2023 మహిళా ఆసియా చాంపియన్స్ ట్రోఫీ పోటీలలో భాగంగా జపాన్ తో జరిగిన పోరు ద్వారా 300 అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడిన భారత తొలి మహిళగా వందన చరిత్ర సృష్టించింది. జపాన్ పై భారత్ 2-1 గోల్స్ తో విజయం సాధించడంలో ప్రధాన పాత్ర వహించింది.
వచ్చే ఏడాది జరిగే పారిస్ ఒలింపిక్స్ కు అర్హతగా జరుగుతున్న ఈ టోర్నీలో భారత్ వరుసగా నాలుగు మ్యాచ్ ల్లో అజేయంగా నిలిచింది.
థాయ్ లాండ్ తో జరిగిన తొలి రౌండ్లో 7-1 గోల్స్ తేడాతో నెగ్గిన భారత్..రెండో రౌండ్లో 5-0తో మలేసియాను చిత్తు చేసింది. కీలక మూడో రౌండ్లో చైనాను 2-1 గోల్సుతోను, 4వ రౌండ్లో జపాన్ ను 2-1 గోల్స్ తోను అధిగమించడం ద్వారా 8 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఆఖరి రౌండ్లో దక్షిణ కొరియాతో భారత్ తలపడాల్సి ఉంది.
వందనకు భారతహాకీ సమాఖ్య సత్కారం...
జపాన్ తో జరిగిన 4వ రౌండ్ మ్యాచ్ ఆడటం ద్వారా వందన కటారియా 300 అంతర్జాతీయ మ్యాచ్ ల మైలురాయిని చేరిన భారత తొలి మహిళగా రికార్డు నెలకొల్పింది.
జర్మనీ వేదికగా జరిగిన జూనియర్ ప్రపంచ హాకీ పోటీల ద్వారా వెలుగులోకి వచ్చిన వందన ఆ తర్వాత మరి వెనుదిరిగి చూసింది లేదు. ప్రపంచ జూనియర్ హాకీ టోర్నీలో భారత్ కాంస్య పతకం గెలుచుకోడంలో వందన కీలక పాత్ర పోషించింది.
ఆ తర్వాత భారత సీనియర్ జట్టులో తన స్థానం పదిలం చేసుకొంది. టోక్యో వేదికగా జరిగిన 2020 ఒలింపిక్స్ లో భారత్ 4వ స్థానంలో నిలవడంలో వందన తనవంతు పాత్ర పోషించింది.
ఒలింపిక్స్ హాకీలో హ్యాట్రిక్ గోల్స్ సాధించిన భారత తొలి ప్లేయర్ గా వందన అరుదైన రికార్డు నెలకొల్పింది.2016, 2017 సంవత్సరాలలో ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో విజేతగా నిలిచిన భారత జట్టు సభ్యురాలిగా రెండు బంగారు పతకాలు అందుకొంది. 2022 ఆసియాకప్ టోర్నీలో కాంస్య పతకంతోపాటు..2021-2022 ప్రో హాకీ లీగ్, నేషన్స్ కప్ టోర్నీలతో పాటు..2022 కామన్వెల్త్ గేమ్స్ లో కాంస్య పతకం నెగ్గిన భారత జట్టులో వందన సభ్యురాలిగా ఉంది.
2022లో పద్మశ్రీ పురస్కారం...
భారత హాకీకి వందన చేసిన అసమాన సేవలకు గుర్తింపుగా 2022 లో పద్మశ్రీ పురస్కారం లభించింది. భారత జట్టులో సభ్యురాలిగా 300 మ్యాచ్ లు ఆడే అవకాశం రావడం నిజంగా తన అదృష్టమని, ఇకముందు కూడా అత్యుత్తమంగా రాణించడానికి కృషి చేస్తానని పొంగిపోతూ చెప్పింది.
టోక్యో ఒలింపిక్స్ లో అద్భుతంగా రాణించిన వందనను ఉత్తరాఖండ్ ప్రభుత్వం 25 లక్షల రూపాయల నగదు పురస్కారంతో సత్కరించింది.
సెమీఫైనల్ ఓటమితో చేదుఅనుభవం..
టోక్యో ఒలింపిక్స్‌లో దక్షిణాఫ్రికాపై వందన హ్యాట్రిక్ గోల్స్ తో సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఓ భారత మహిళా హాకీ ప్లేయర్ ఒలింపిక్స్ లో హ్యాట్రిక్ సాధించడం ఇదే మొదటిసారి.ఈ మ్యాచ్‌లో భారత్ 4-3 గోల్స్ తేడాతో విజయం సాధించి సెమీస్ కు అర్హత సంపాదించింది.
టోక్యో గేమ్స్ సెమీస్ పోరులో భారత్ 1-2 గోల్స్ తో అర్జెంటీనా చేతిలో ఓటమి పొందటానికి వందన కటారియానే కారణమంటూ సోషల్ మీడియా ద్వారా దారుణమైన ట్రోలింగ్‌కు పాల్పడ్డారు. కొందరు ఆమె నివాసం వద్ద నిరసనకు దిగారు. ఆమె గ్రామంలోని ఇద్దరు వ్యక్తులు కులం పేరుతో దూషించడం, ఇంటిపైన దాడి చేయటం అప్పట్లో కలకలం రేపింది. నిపై వందన కుటుంబ సభ్యులు అప్పట్లో పోలీసులకు సైతం ఫిర్యాదు చేశారు.
ఆ తరువాత కాంస్య పతకం కోసం గ్రేట్ బ్రిటన్ తో జరిగిన హోరాహోరీ పోరులో భారత్ లో 3-4 తేడాతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. చివరి క్వార్టర్‌లో ఫలితం తారుమారుకావడంతో ఒలింపిక్స్ పతకం గెలుచుకొనే అరుదైన అవకాశాన్ని భారత్ చేజార్చుకోవాల్సి వచ్చింది.
వచ్చే ఏడాది జరిగే పారిస్ ఒలింపిక్స్ కు భారత్ అర్హత సంపాదించగలిగితేనే వందన కటారియా ఒలింపిక్స్ పతకం కలలు సాకారమయ్యే అవకాశం ఉంది.