Telugu Global
Sports

నేటినుంచే మహిళా ఐపీఎల్ హంగామా!

భారత, ప్రపంచ మహిళా క్రికెట్ దశ, దిశను మార్చే ప్రారంభ ఇండియన్ ప్రీమియర్ లీగ్ తొలిసీజన్ సమరానికి ముంబై వేదికగా ఈరోజు తెరలేవనుంది. ఐదుజట్లు, 22 మ్యాచ్ ల హంగామా మార్చి 26 వరకూ కొనసాగనుంది.

నేటినుంచే మహిళా ఐపీఎల్ హంగామా!
X

భారత, ప్రపంచ మహిళా క్రికెట్ దశ, దిశను మార్చే ప్రారంభ ఇండియన్ ప్రీమియర్ లీగ్ తొలిసీజన్ సమరానికి ముంబై వేదికగా ఈరోజు తెరలేవనుంది. ఐదుజట్లు, 22 మ్యాచ్ ల హంగామా మార్చి 26 వరకూ కొనసాగనుంది....

ప్రపంచంలోనే అత్యంత భాగ్యవంతమైన భారత క్రికెట్ బోర్డు..పెద్దమనుషుల క్రీడ క్రికెట్ నే గొప్పలాభసాటి వ్యాపారంగా మార్చి వేలకోట్ల రూపాయలు ఆర్జిస్తూ క్రికెటర్ల జీవితాలనే మార్చి వేస్తూ వస్తోంది.

2008 లో ప్రారంభమైన పురుషుల ఐపీఎల్ తో ప్రపంచ క్రికెట్ నే శాసించే స్థాయికి ఎదిగిన బీసీసీఐ గత 15 సీజన్ల ఐపీఎల్ విజయవంతం కావడంతో..దానికి కొనసాగింపుగా మహిళలకు సైతం ఓ ప్రీమియర్ లీగ్ నిర్వహించడానికి ముంబై మహానగరం వేదికగా రంగం సిద్ధం చేసింది.

ఈరోజు జరిగే ప్రారంభమ్యాచ్ లో బెత్ మూనీ నాయకత్వంలోని గుజరాత్ జెయింట్స్ తో హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్సీలోని ముంబై ఇండియన్స్ తలపడనుంది. ఈమ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభంకానుంది.

అట్టహాసంగా ప్రారంభ వేడుకలు..

ముంబైలోని డాక్టర్ డీవై పాటిల్ స్టేడియం వేదికగా ఈ రోజు సాయంత్రం అట్ట‌హాసంగా ఆరంభ వేడుక‌ల్ని బీసీసీఐ నిర్వ‌హించ‌నుంది. ఈ వేడుక‌ల్లో బాలీవుడ్ స్టార్లు ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నారు.

కియ‌రా అడ్వానీ, కృతి స‌న‌న్ వంటి హీరోయిన్లు డాన్స్‌ల‌తో అల‌రించనున్నారు. పంజాబీ – కెన‌డా ర్యాప‌ర్ ఏపీ ధిల్లాన్ కూడా ప్ర‌ద‌ర్శ‌న ఇవ్వ‌నున్నాడు. తొలి మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్‌, ముంబై ఇండియ‌న్స్ జ‌ట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి.

డ‌బ్ల్యూపీఎల్ టైటిల్ స్పాన్స‌ర్ హక్కుల‌ను ఐదేళ్ల కాలానికి టాటా గ్రూప్, మీడియా హ‌క్కుల‌ను వైకోమ్ 18 సంస్థ ద‌క్కించుకున్న విష‌యం తెలిసిందే.

ఐదుజట్లతోనే తొలి మహిళా ఐపీఎల్...

మొట్టమొదటి మహిళా ఐపీఎల్ కేవలం ఐదు జట్ల సమరంలానే జరుగనుంది. రౌండ్ రాబిన్ లీగ్ కమ్ నాకౌట్ తరహాలో జరిగే ఈటోర్నీలో ముంబై ఇండియన్స్, గుజరాత్ జెయింట్స్, బెంగళూరు రాయల్ చాలెంజర్స్, ఢిల్లీ క్యాపిటల్స్, యూపీ వారియర్స్ జట్లు ఢీ కొనబోతున్నాయి.

గుజరాత్ ఫ్రాంచైజీ హక్కులను అదానీ స్పోర్ట్స్ లైన్ ప్రయివేట్ లిమిటెడ్ 1289 కోట్ల రూపాయల ధరకు వేలం ద్వారా సొంతం చేసుకొంది. ముంబై ఫ్రాంచైజీ హక్కుల్ని ముఖేశ్ అంబానీ కి చెందిన ఇండియావిన్ స్పోర్ట్స్ ప్రయివేట్ లిమిటెడ్ 912. 99 కోట్లకు, బెంగళూరు ఫ్రాంచైజీ హక్కుల్ని రాయల్ చాలెంజర్స్ స్పోర్ట్స్ ప్రయివేట్ లిమిటెట్ 901 కోట్ల రూపాయల ధరకు, ఢిల్లీ ఫ్రాంచైజీ హక్కుల్ని జీఎమ్మార్ క్రికెట్ ప్రయివేట్ లిమిటెడ్ 810 కోట్ల రూపాయల ధరకు, లక్నో ఫ్రాంచైజీ హక్కుల్ని కాప్రి గ్లోబల్ హోల్డింగ్స్ ప్రయివేట్ లిమిటెడ్ 757 కోట్ల రూపాయల ధరకు ఆన్ లైన్ బిడ్డింగ్ ద్వారా కైవసం చేసుకొన్నాయి.

రెండు జట్లకే భారత కెప్టెన్లు...

లీగ్ లో తలపడుతున్న జట్లలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ఓపెనర్ స్మృతి మందన, ముంబై ఇండియన్స్ కు హర్మన్ ప్రీత్ కౌర్, యూపీ వారియర్స్ కు ఆస్ట్ర్రేలియా వికెట్ కీపర్ బ్యాటర్ అలీసా హేలీ, గుజరాతీ జెయింట్స్ కు బెత్ మూనీ, ఢిల్లీ క్యాపిటల్స్ కు మెగ్ లానింగ్ కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు.

ప్లేయర్ల వేలంలో రికార్డు (అత్యధిక )ధర 3 కోట్ల 40 లక్షల రూపాయలు దక్కించుకొన్న స్మృతి మందన నాయకత్వంలోని బెంగళూరు రాయల్ చాలెంజర్స్ టైటిల్ వేటకు ఉరకలేస్తోంది.

యూపీ వారియర్స్ జట్టులో అలీసా హేలీతో పాటు స్టార్ ఆల్ రౌండర్ దీప్తి శర్మ, తహ్లియా మెక్ గ్రాత్, సోఫియా ఈక్లెస్టెన్ లాంటి దిగ్గజ ప్లేయర్లున్నారు.

భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ జట్టులో ఇంగ్లండ్ వైస్ కెప్టెన్ నాట్ స్కీవెర్ తో సహా పలువురు యువక్రికెటర్లున్నారు. హర్మన్ ప్రీత్ కౌర్ ను కోటీ 80 లక్షల రూపాయల ధరకు ముంబై యాజమాన్యం దక్కించుకొంది.

ఆస్ట్ర్రేలియా స్టార్ ప్లేయర్ బెత్ మూనీ నాయకత్వంలోని గుజరాత్ జెయింట్స్ జట్టులో సూపర్ ఆల్ రౌండర్ యాష్లీగా గార్డ్నర్, బెత్ మూనీ లాంటి సూపర్ స్టార్లున్నారు.

బెత్ మూనీకి 2 కోట్ల రూపాయల ధర పలికింది. రాచెల్ హేన్స్ చీఫ్ కోచ్ గా వ్యవహరిస్తోంది.

మెగ్ లానింగ్ నాయకత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో యంగ్ గన్స్ షెఫాలీవర్మ, జెమీమా రోడ్రిగేజ్ ఉన్నారు. జెమీమా రోడ్రిగేజ్ కు 2 కోట్ల రూపాయల ధర దక్కింది.

ముంబైలోని వేదికల్లోనే పోటీలు..

మహిళా ఐపీఎల్ తొలిసీజన్ పోటీలను కేవలం ముంబై నగరంలోని రెండు వేదికలు ( బ్రబోర్న్ స్టేడియం, డీవై పాటిల్ స్టేడియాలకు ) మాత్రమే పరిమితం చేశారు.

మార్చి 4 నుంచి 26 వరకూ జరిగే ఈటోర్నీని డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ కమ్ ప్లే-ఆఫ్ నాకౌట్ సమరంలా నిర్వహిస్తారు.

ముంబై నగరంలోని బ్రబోర్న్ స్టేడియం కెపాసిటీ 20వేలు కాగా..నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం సామర్థ్యం 60వేలుగా ఉంది. భారత కాలమానం ప్రకారం మార్చి 4 నుంచి ప్రతిరోజు రాత్రి 7 గంటల నుంచి మార్చి 26 వరకూ మ్యాచ్ లు నిర్వహించనున్నారు.

రౌండ్ రాబిన్ లీగ్ లోని ఆఖరి పోటీ మార్చి 21న ముంబై ఇండియన్స్, యూపీ వారియర్స్ జట్ల నడుమ జరుగనుంది. 20 మ్యాచ్ లు రౌండ్ రాబిన్ లీగ్ తరహాలో నిర్వహిస్తారు.

మార్చి 24న డాక్టర్ డీవై పాటిల్ స్టేడియం వేదికగా ఎలిమనేటర్ రౌండ్ మ్యాచ్ జరుగుతుంది. మార్చి 26న ముంబై బ్రబోర్న్ స్టేడియం వేదికగా టైటిల్ సమరం నిర్వహిస్తారు.

మహిళా క్రికెట్లో అంత మజా ఉంటుందా?

పురుషుల క్రికెట్ తో పోల్చిచూస్తే మహిళా క్రికెట్లో అంత మజా ఉండదని గత కొద్ది సంవత్సరాలుగా జరుగుతున్న ప్రపంచకప్ టోర్నీలే చెబుతున్నాయి. పురుషులతో సమానంగా మహిళా క్రికెట్ ను అభివృద్ధి చేయాలన్న పట్టుదలతోనే అటు ఐసీసీ, ఇటు బీసీసీఐ వందలకోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాయి. పురుషులతో సమానంగా మహిళలకూ సదుపాయాలు కల్పిస్తూ, మ్యాచ్ ఫీజులు సైతం చెల్లిస్తున్నాయి.

అయితే..పురుషుల క్రికెట్లో బౌండ్రీ లైన్ 70 నుంచి 80 మీటర్ల వరకూ ఉంటే..మహిళల క్రికెట్లో 50 మీటర్లకే బౌండ్రీలైన్ ను పరిమితం చేయటం చర్చనీయాంశంగా మారింది.

పురుషులతో పోల్చిచూస్తే మహిళలు పుట్టుకతోనే సుకుమారులుగా ఉండటం, అంత బలంగా ఉండక పోడం కూడా..ఆటలో అంతరానికి కారణమని చెప్పక తప్పదు.

పురుషుల ఐపీఎల్ గంటకు వంద కిలోమీటర్ల వేగంతో సాగితే..మహిళా ఐపీఎల్ గంటకు 30 కిలోమీటర్ల వేగానికే పరిమితమైనా ఆశ్చర్యం లేదు.

గత 15 సీజన్లుగా సాగుతున్న పురుషుల ఐపీఎల్ ను చూసిన కళ్లతో..తొలిసారిగా జరుగనున్న మహిళా ఐపీఎల్ ను చూస్తే అంత మజా, ఉత్కంఠ ఉండక పోవచ్చు. అయినా..మహిళా క్రికెట్ అభివృద్ధి, సమానఅవకాశాల పేరుతో బీసీసీఐ, ఐసీసీ చేస్తున్న ఈ క్రికెట్ వ్యాపారాన్ని సైతం అభిమానులు ఇష్టం ఉన్నా..లేకున్నా భరించక తప్పదు.

First Published:  4 March 2023 11:00 AM IST
Next Story