Telugu Global
Sports

అర్హతకు గెలుపుదూరంలో విండీస్!

టీ-20 ప్రపంచకప్ అర్హత రౌండ్ లీగ్ మ్యాచ్ లు ఆసక్తికరంగా సాగుతున్నాయి

అర్హతకు గెలుపుదూరంలో విండీస్!
X

టీ-20 ప్రపంచకప్ అర్హత రౌండ్ లీగ్ మ్యాచ్ లు ఆసక్తికరంగా సాగుతున్నాయి. సూపర్ -12 రౌండ్లో చోటుకు రెండుసార్లు చాంపియన్ వెస్టిండీస్ గెలుపుదూరంలో నిలిచింది.

జింబాబ్వేతో ముగిసిన డూ ఆర్ డై మ్యాచ్ లో నెగ్గడం ద్వారా అర్హత అవకాశాలను సజీవంగా నిలుపుకోగలిగింది.

ఆస్ట్ర్రేలియా వేదికగా ప్రారంభమైన టీ-20 ప్రపంచకప్ తొలిదశ అర్హత రౌండ్ పోటీలలో మాజీ దిగ్గజం, రెండుసార్లు విజేత వెస్టిండీస్ పరిస్థితి ఇంత బతుకూ బతికి అన్నట్లుగా తయారయ్యింది.

12జట్ల అసలుసిసలు సూపర్ -12 రౌండ్లో చోటు కోసం జరుగుతున్న క్వాలిఫైయింగ్ రౌండ్లో భాగంగా తన గ్రూపులో జింబాబ్వే, స్కాట్లాండ్, ఐర్లాండ్ జట్లతో వెస్టిండీస్ తలపడుతోంది.

గ్రూప్ ప్రారంభమ్యాచ్ లో పసికూన స్కాట్లాండ్ చేతిలో పరాజయం పొందిన కరీబియన్ టీమ్..నెగ్గితీరాల్సిన తన రెండోరౌండ్ పోరులో జింబాబ్వేను 31 పరుగులతో చిత్తు చేయడం ద్వారా ఊపిరిపీల్చుకొంది.

అల్జారీ జోసెఫ్ షో....

హోబర్ట్ స్టేడియం వేదికగా ముగిసిన రెండోరౌండ్ పోరులో..154 పరుగుల టార్గెట్ తో చేజింగ్ కు దిగిన జింబాబ్వేను విండీస్ బౌలర్లు 122 పరుగులకే కుప్పకూల్చారు.

ఫాస్ట్ బౌలర్ అల్జారీ జోసెఫ్ తన కోటా 4 ఓవర్లలో 16 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టడంతో జింబాబ్వే 18.2 ఓవర్లలో 122 పరుగులకే ఆలౌటయ్యింది.

జెయింట్ ఫాస్ట్ బౌలర్ జాసన్‌ హోల్డర్‌(3/12) సైతం తనజట్టుకు అండగా నిలిచాడు.

అంతకుముందు...ఓపెనర్ జాన్సన్‌ చార్లెస్‌(45), రోవ్‌మన్‌ పావెల్‌(28) రాణించడంతో విండీస్ జట్టు 20 ఓవర్లలో 153/7 స్కోరు చేసింది. నాలుగు వికెట్లతో జట్టు విజయంలో కీలకంగా వ్యవహరించిన జోసెఫ్‌కు 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' దక్కింది.

గ్రూపు ఆఖరిరౌండ్ పోరులో ఐర్లాండ్ ను ఓడించగలిగితేనే విండీస్ సూపర్ -12 రౌండ్ చేరుకోగలుగుతుంది.

స్కాట్లాండ్ కు ఐర్లాండ్ షాక్..

ఇదే గ్రూపులో భాగంగా జరిగిన మరో రెండోరౌండ్ పోరులో స్కాట్లాండ్‌పై ఐర్లాండ్‌ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ కు దిగిన స్కాట్లాండ్‌ 20 ఓవర్లలో 176/5 స్కోరు చేసింది. తర్వాత లక్ష్యఛేదనలో ఐర్లాండ్‌ 4 వికెట్లు మాత్రమే నష్టపోయి 180 పరుగులు చేసింది. ఐర్లాండ్ విజయంలో ప్రధానపాత్ర వహించిన ఆల్ రౌండర్ కాంఫర్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

కర్టిస్ కాంఫర్ కేవలం32 బంతుల్లోనే 72 నాటౌట్ స్కోరు సాధించడంతో పాటు బౌలర్ గా రెండు కీలక వికెట్లు పడగొట్టాడు.

స్కాట్లాండ్ కు పగ్గాలు..

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. ఓపెనర్ మైకేల్ జోన్స్ (86), రిచీ బెర్నింగ్టన్ (37) రాణించారు. అనంతరం లక్ష్య ఛేదనలో ఐర్లాండ్‌కు శుభారంభం దక్కలేదు. పాల్ స్టిర్లింగ్ (8), ఆండీ బాల్‌బిర్నీ (14) పెద్దగా ఆకట్టుకోలేదు. ఆ తర్వాత వచ్చిన లోర్గాన్ టక్కర్ (20), హారీ టెక్టర్ (14) కూడా నిరాశ పరిచారు.

తమజట్టు కష్టాలలో ఉన్న సమయంలో కాంఫర్‌తో కలిసిన జార్జ్ డాక్‌రెల్ (39 నాటౌట్) కూడా ధాటిగా ఆడటంతో ఐర్లాండ్ జట్టు 19 ఓవర్లలోనే 4 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది.

మొత్తమ్మీద మరో ఆరు బంతులు మిగిలుండగానే ఆరు వికెట్ల తేడాతో స్కాట్లాండ్‌పై విజయం సాధించింది.

సూపర్ -12రౌండ్ చేరాలంటే తమ ఆఖరి రౌండ్ మ్యాచ్ ల్లో జింబాబ్వే పైన స్కాట్లాండ్, ఐర్లాండ్ పైన వెస్టిండీస్ జట్లు నెగ్గితీరాల్సి ఉంది. గ్రూపులోని మొత్తం నాలుగుజట్లు ఒక్కో గెలుపు, ఓటమి రికార్డుతో ఉండడంతో ఆఖరిరౌండ్ మ్యాచ్ లు కీలకంగా మారాయి.

ఆఖరిరౌండ్లో విజయం సాధించినజట్లకే సూపర్ -12 రౌండ్ చేరే అవకాశం ఉంది.

వాట్, బ్రాడ్ వీల్, సఫయాన్ షరీఫ్, మైకేల్ లీస్క్ తలో వికెట్ తీసుకున్నారు.

First Published:  20 Oct 2022 10:09 AM IST
Next Story