Telugu Global
Sports

వింబుల్డన్ ఫైనల్లో నేడు కొండతో కూన ఢీ!

వింబుల్డన్ పురుషుల సింగిల్స్ టైటిల్ సమరంలో కొండతో ఓ కూన ఢీ కొనబోతోంది. ఈ పోరులో ఎవరూ నెగ్గినా అది సరికొత్త చరిత్రే అవుతుంది.

నొవాక్ జొకోవిచ్ మరియు కార్లోస్ అల్కరాజ్‌
X

నొవాక్ జొకోవిచ్ మరియు కార్లోస్ అల్కరాజ్‌

వింబుల్డన్ పురుషుల సింగిల్స్ టైటిల్ సమరంలో కొండతో ఓ కూన ఢీ కొనబోతోంది. ఈ పోరులో ఎవరూ నెగ్గినా అది సరికొత్త చరిత్రే అవుతుంది.

2023 గ్రాండ్ స్లామ్ సర్క్యూట్ మూడో టోర్నీగా లండన్ వేదికగా జరుగుతున్న వింబుల్డన్ పురుషుల సింగిల్స్ క్లైయ్ మాక్స్ దశకు చేరింది. గ్రాండ్ స్లామ్ టెన్నిస్ శిఖరం, 36 ఏళ్ల నొవాక్ జోకోవిచ్ కు 20 సంవత్సరాల కుర్రఆటగాడు కార్లోస్ అల్ కరాజ్ సవాలు విసురుతున్నాడు.

జోకోవిచ్ కు అల్ కరాజ్ టెన్షన్...

గ్రాండ్ స్లామ్ టెన్నిస్ చరిత్రలోనే అత్యధికంగా 23 టైటిల్స్ నెగ్గిన అసాధారణ రికార్డు, అపూర్వ అనుభవం కలిగిన జోకోవిచ్ తన కెరియర్ లోనే అతిపెద్ద పరీక్షకు సిద్ధమయ్యాడు. తన కెరియర్ లో ఇప్పటికే 9సార్లు వింబుల్డన్ ఫైనల్స్ చేరి..7సార్లు టైటిల్ విన్నర్ గా నిలిచిన రెండోసీడ్ జోకోవిచ్ ప్రస్తుత సీజన్ వింబుల్డన్ పయనం

ఏమంతసాఫీగా సాగలేదు. అడుగడుగునా గట్టి పోటీ ఎదుర్కొంటూ, తన అనుభవాన్ని ఉపయోగించి పలుమార్లు ఓటమి అంచుల నుంచి బయటపడటం ద్వారా తొమ్మిదోసారి టైటిల్ వేటకు సిద్ధమయ్యాడు.

క్వార్టర్ ఫైనల్లో ఐదుసెట్ల విజయం, సెమీఫైనల్లో ఇటలీ ఆటగాడు యానిక్ సిన్నర్ పైన 3 సెట్ల పోరులో నెగ్గడం ద్వారా ఫైనల్లో అడుగుపెట్టాడు. గత దశాబ్దకాలంగా వింబుల్డన్ సెంటర్ కోర్టులో ఆడిన పోటీల్లో ఓటమి అంటే ఏమిటో తెలియని జోకోవిచ్ ..మరో టైటిల్ నెగ్గితే ..గ్రాస్ కోర్ట్ టెన్నిస్ గ్రేట్ ఫెదరర్ 8 టైటిల్స్ రికార్డును సమం చేయగలుగుతాడు. అంతేకాదు..24వ గ్రాండ్ స్లామ్ టైటిల్ నెగ్గిన తొలి ఆటగాడిగా...ఆస్ట్ర్రేలియన్ గ్రేట్ మార్గారెట్ కోర్ట్ సరసన చోటు సంపాదించే అవకాశం ఉంది.

అయితే..అదేమంత తేలికగా కనిపించడం లేదు. టైటిల్ సమరంలో స్పానిష్ చిచ్చరపిడుగు, టాప్ సీడ్ కార్లోస్ అల్ కరాజ్ ను అధిగమించాల్సి ఉంది.

తొలిటైటిల్ కు అల్ కరాజ్ గురి...

మరోవైపు...తన కెరియర్ లో తొలిసారిగా వింబుల్డన్ ఫైనల్స్ చేరిన యువకెరటం అల్ కరాజ్ తొలి గ్రాస్ కోర్ట్ టైటిల్ కోసం ఉరకలేస్తున్నాడు. సెమీఫైనల్లో విశ్వరూపం ప్రదర్శించడం ద్వారా 3వ సీడ్ మెద్వదేవ్ ను వరుస సెట్లలో చిత్తు చేయడం ద్వారా ఫైనల్స్ బెర్త్ సంపాదించాడు.

ఇప్పటికే యూఎస్ ఓపెన్ తో సహా రెండుగ్రాండ్ స్లామ్ టైటిల్స్ మాత్రమే సాధించిన అల్ కరాజ్ ఉరకలేసే తన వయసుతో పాటు..దూకుడుగా ఆడగలిగితేనే అపారఅనుభవం కలిగిన జోకోవిచ్ ను ఓడించే అవకాశం ఉంది.

ఒక విధంగా చెప్పాలంటే టెన్నిస్ ప్రపంచంలోనే కొండలాంటి జోకోవిచ్ ను పసికూన లాంటి అల్ కరాజ్ ఢీకొనబోతున్నాడు. జోకోవిచ్ అనుభవానికి..అల్ కరాజ్ దూకుడుకు నడుమ జరిగే పోరుగా టెన్నిస్ పండితులు చెబుతున్నారు.

ప్రస్తుత ప్రో టెన్నిస్ లో సంపూర్ణ ఆటగాడు జోకోవిచ్ మాత్రమేనని, అలాంటి అనుభవశాలితో తలపడటం తనకు గొప్పఅనుభవం కాగలదని అల్ కరాజ్ చెబుతున్నాడు.

టాప్ సీడ్ అల్ కరాజ్, రెండో సీడ్ జోకోవిచ్ ల నడుమ జరిగే ఈ సమరం ఐదుసెట్ల పాటు హోరాహోరీగా సాగుతుందా? లేక ఏకపక్షంగా ముగిసిపోతుందా? ట్రోఫీతో పాటు..25 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ ఎవరికి సొంతమవుతుంది...తెలుసుకోవాలంటే మరికొద్దిగంటలపాటు వేచి చూడక తప్పదు.

జోకోవిచ్ విజేతగా నిలిస్తే అరుదైన రెండుజంట రికార్డులు నెలకొల్పినవాడవుతాడు. అదే అల్ కరాజ్ నెగ్గితే..తొలిసారిగా వింబుల్డన్ ట్రోఫీ అందుకోడంతో పాటు..గత దశాబ్దకాలంలో జోకోవిచ్ ను గెలిచిన తొలి ప్లేయర్ గా చరిత్రలో మిగిలిపోతాడు.

First Published:  16 July 2023 10:51 AM GMT
Next Story