వింబుల్డన్ ఫైనల్లో స్పానిష్ చిచ్చరపిడుగు!
2023 వింబుల్డన్ పురుషుల సింగిల్స్ ఫైనల్స్ కు టాప్ సీడ్ కార్లోస్ అల్ కరాజ్, రెండోసీడ్ నొవాక్ జోకోవిచ్ చేరుకొన్నారు. మెద్వదేవ్, సిన్నర్ ల పోరు సెమీస్ లోనే ముగిసింది.
2023 వింబుల్డన్ పురుషుల సింగిల్స్ ఫైనల్స్ కు టాప్ సీడ్ కార్లోస్ అల్ కరాజ్, రెండోసీడ్ నొవాక్ జోకోవిచ్ చేరుకొన్నారు. మెద్వదేవ్, సిన్నర్ ల పోరు సెమీస్ లోనే ముగిసింది....
స్పానిష్ యువఆటగాడు కార్లోస్ అల్ కరాజ్ వింబుల్డన్ పురుషుల సింగిల్స్ ఫైనల్స్ కు అలవోకగా చేరుకొన్నాడు. సెమీఫైనల్లో రష్యా ఆటగాడు, 3వ సీడ్ డేనియల్ మెద్వదేవ్ ను వరుససెట్లలో చిత్తు చేయడం ద్వారా టైటిల్ పోరుకు అర్హత సంపాదించాడు.
రెండోసెమీఫైనల్లో రెండోసీడ్ , ఏడుసార్లు వింబుల్డన్ విన్నర్ నొవాక్ జోకోవిచ్ సైతం మూడుసెట్ల పోరులో సిన్నర్ ను అధిగమించడం ద్వారా 9వసారి ఫైనల్లో అడుగుపెట్టాడు.
ఆదివారం జరిగే టైటిల్ పోరులో టాప్ సీడ్ అల్ కరాజ్ తో 2వ సీడ్ జోకోవిచ్ అమీతుమీ తేల్చుకోనున్నాడు.
అల్ కరాజ్..అలవోకగా....
లండన్ లోని ఆల్- ఇంగ్లండ్ క్లబ్ సెంటర్ కోర్టు వేదికగా జరిగిన తొలిసెమీఫైనల్లో 20 ఏళ్ల అల్ కరాజ్ విశ్వరూపమే ప్రదర్శించాడు. ఆల్ కోర్ట్ గేమ్ తో చెలరేగిపోయాడు.
పదునైన సెర్వ్, మెరుపు గ్రౌండ్ స్ట్ర్రోక్ లతో 3వ సీడ్ ఆటగాడు డేనియల్ మెద్వదేవ్ ను 6-3, 6-3, 6-3 తో అలవోకగా ఓడించాడు. మెద్వదేవ్ ఏవిధంగానూ అల్ కరాజ్ కు సమఉజ్జీ కాలేకపోయాడు. అల్ కరాజ్ వింబుల్డన్ ఫైనల్స్ చేరడం ఇదే తొలిసారి.
తన గ్రాండ్ స్లామ్ కెరియర్ లో సాధించిన అత్యుత్తమ విజయాలలో ఈ విజయం ఒకటని ఫైనల్స్ చేరిన అనంతరం అల్ కరాజ్ వ్యాఖ్యానించాడు. గత నెలలో ముగిసిన ఫ్రెంచ్ ఓపెన్ సెమీఫైనల్స్ లో కాలినరం పట్టేయడంతో అర్థంతరంగా పోటీ నుంచి తప్పుకొన్న అల్ కరాజ్ వింబుల్డన్ టైటిల్ పోరులో మాత్రం పూర్తి ఫిట్ నెస్ తో, సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగాలన్న పట్టుదలతో ఉన్నాడు.
ప్రస్తుత ప్రపంచ టెన్నిస్ లో ఏకైక పరిపూర్ణ ఆటగాడు జోకోవిచ్ మాత్రమేనని..అలాంటి దిగ్గజంతో టైటిల్ పోరులో ఢీ కొనడం తన సత్తాకు సవాలని తెలిపాడు.
9వసారి ఫైనల్లో జోకోవిచ్...
23 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ విన్నర్, 36 ఏళ్ళ నొవాక్ జోకోవిచ్ రెండోసెమీఫైనల్లో విజేతగా కేవలం మూడుసెట్ల పోరులోనే నిలిచాడు. ఇటలీ ఆటగాడు, 8వ సీడ్ యానిక్ సిన్నర్ తో జరిగిన పోరులో తన అనుభవాన్నంతా ఉపయోగించి ఆడి 9వసారి ఫైనల్లో అడుగుపెట్టాడు.
రెండోసీడ్ జొకోవిచ్ 6-3, 6-4, 7-6 (7/4)తో ఎనిమిదో సీడ్ సిన్నెర్‌పై విజయం సాధించాడు. జొకోకు గ్రాస్‌కోర్టులో ఇది వరుసగా 34వ విజయం కావడం విశేషం. దాదాపు మూడు గంటల పాటు సాగిన పోరులో జొకో ఆరు బ్రేక్ పాయింట్లను కాచుకున్నాడు. 11 ఏస్‌లు సంధించిన జొకో.. ఒక్క డబుల్ ఫాల్ట్ కూడా చేయలేదు. మరోవైపు 8 ఏస్‌లకే పరిమితమైన సిన్నెర్ 3 డబుల్ పాల్ట్స్ చేసి 44 విన్నర్లు కొట్టాడు. అయితే 35 అనవసర తప్పిదాలు సిన్నెర్ వైఫల్యానికి కారణమయ్యాయి.
36 సంవత్సరాల వెటరన్ జోకోవిచ్ ఆదివారం జరిగే టైటిల్ పోరులో యువఆటగాడు అల్ కరాజ్ కు పగ్గాలు వేయగలిగితే 8వ వింబుల్డన్ టైటిల్ తో ఫెదరర్ రికార్డును సమం చేయడంతో పాటు..24 టైటిల్స్ విన్నర్ మార్గారెట్ కోర్ట్ సరసన నిలువగలుగుతాడు.