Telugu Global
Sports

కలచెదిరిన జబేర్- నయాక్వీన్ వోండ్రుసోవా

2023 వింబుల్డన్ మహిళల సింగిల్స్ లో ఓ సంచలనం, మరో అపూర్వమైన రికార్డు నమోదయ్యాయి.

కలచెదిరిన జబేర్- నయాక్వీన్ వోండ్రుసోవా
X

కలచెదిరిన జబేర్- నయాక్వీన్ వోండ్రుసోవా

2023 వింబుల్డన్ మహిళల సింగిల్స్ లో ఓ సంచలనం, మరో అపూర్వమైన రికార్డు నమోదయ్యాయి. చెక్ అన్ సీడెడ్ ప్లేయర్ మార్కెటా వోండ్రుసోవా ట్రోఫీతోపాటు 25 కోట్ల రూపాయల ప్రైజ్ మనీని సొంతం చేసుకొంది.

వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ టోర్నీ మహిళల సింగిల్స్ సంచలనాలకు వేదికగా నిలిచింది. మహిళల సింగిల్స్ టైటిల్ సాధించిన తొలి అరబ్ మహిళగా నిలవాలన్న ట్యునీసియా ప్లేయర్ ఓన్స్ జబేర్ కల వరుసగా రెండో ఏడాదీ చెదిరింది. టైటిల్ సమరంలో అన్ సీడెడ్ చెక్ స్టార్ మార్కెటా వోండ్రుసోవా చేతిలో జబేర్ వరుస సెట్ల ఓటమితో కన్నీరుమున్నీరయ్యింది.

2023 వింబుల్డన్ సంచలనం మార్కెటా వోండ్రుసోవా...

వింబుల్డన్ గత 60 సంవత్సరాలలో ఓ అసాధారణ రికార్డు నమోదు చేసిన ఘనతను చెక్ రిపబ్లిక్ కు చెందిన మార్కెటా వోండ్రుసోవా సొంతం చేసుకొంది. అన్ సీడెడ్ ప్లేయర్ గా బరిలో నిలిచిన వోండ్రుసోవా ఏమాత్రం అంచనాలు లేకుండా విజేతగా నిలవడం ద్వారా సరికొత్త చరిత్ర సృష్టించింది.

గతేడాది రన్నరప్, 6వ సీడ్ ఓన్స్ జబేర్ తో జరిగిన టైటిల్ సమరంలో 24 సంవత్సరాల వోండ్రుసోవాకు పోటీనే లేకుండా పోయింది. పోరు కనీసం మూడుసెట్ల వరకూ కూడా సాగలేదు.

తొలిరౌండ్ నుంచి సంచలన విజయాలు సాధిస్తూ ఫైనల్లో అడుగుపెట్టిన అన్ సీడెడ్ వోండ్రుసోవా టైటిల్ పోరులోనూ అదేజోరు కొనసాగించింది. గంటా 20 నిముషాల పోరులో 6-4, 6-4తో 6వ సీడ్ జబేర్ ను చిత్తు చేసింది.

గతేడాది వింబుల్డన్ ఫైనల్ వరకూ వచ్చి రన్నరప్ గా నిలిచిన జబేర్ వరుసగా రెండో ఏడాది ఫైనల్స్ చేరినా టైటిల్ చేజిక్కించుకోలేకపోయింది. టైటిల్ సమరంలో స్థాయికి తగ్గ ఆటతీరు ప్రదర్శించలేకపోయింది. వరుసగా రెండో ఏడాది వింబుల్డన్ రన్నరప్ ట్రోఫీ అందుకొన్న జబేర్ విజేతగా నిలువలేక కన్నీరు మున్నీరయ్యింది.

వోండ్రుసోవా' గ్రాండ్ 'షో...

గ్రాండ్ స్లామ్ టోర్నీ విజేతగా నిలవాలన్న తన లక్ష్యాన్ని వోండ్రుసోవా రెండో ప్రయత్నంలో నెరవేర్చుకోగలిగింది. 2019 ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్స్ కు తొలిసారిగా చేరిన వోండ్రుసోవా టైటిల్ సమరంలో ఆస్ట్ర్రేలియా ప్లేయర్ యాష్లీ బార్టీ చేతిలో ఓటమితో రన్నరప్ గా నిలిచింది.

అయితే..కేవలం మూడేళ్ల విరామం తర్వాత మరో గ్రాండ్ స్లామ్ ఫైనల్స్ చేరడం, విజేతగా ట్రోఫీతో పాటు 25 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ అందుకోడం జరిగిపోయాయి.

వోండ్రుసోవా కెరియర్ లో ఇదే తొలిగ్రాండ్ స్లామ్ టైటిల్ కావడం విశేషం. వింబుల్డ‌న్‌ మహిళల సింగిల్స్ లో ఆరో కొత్త చాంపియన్ గా వోండ్రుసోవా తెరమీదకు వచ్చింది.

యానా నోవాట్నా, పెట్రా కివిటోవా తర్వాత వింబుల్డన్ మహిళల సింగిల్స్ టైటిల్ నెగ్గిన చెక్ ప్లేయర్ గా వోండ్రుసోవా రికార్డుల్లో చేరింది.

ఒలింపిక్స్ మహిళల సింగిల్స్ లో రజత విజేతగా కూడా నిలిచిన వోండ్రుసోవా..ఇప్పుడు వింబుల్డన్ క్వీన్ గాను గుర్తింపు సంపాదించింది.

First Published:  16 July 2023 12:00 PM IST
Next Story