Telugu Global
Sports

ఐసీసీ టెస్ట్ లీగ్ ఫైనల్ కు భారత్ చేరేదెలా?

ఇండోర్ టెస్ట్ ఓటమితో భారత్ సరికొత్త కష్టాన్ని కొని తెచ్చుకొంది. ఐసీసీ టెస్ట్ లీగ్ ఫైనల్ బెర్త్ ను మరింత సంక్లిష్టం చేసుకొంది.

ఐసీసీ టెస్ట్ లీగ్ ఫైనల్ కు భారత్ చేరేదెలా?
X

ఇండోర్ టెస్ట్ ఓటమితో భారత్ సరికొత్త కష్టాన్ని కొని తెచ్చుకొంది. ఐసీసీ టెస్ట్ లీగ్ ఫైనల్ బెర్త్ ను మరింత సంక్లిష్టం చేసుకొంది....

ప్రపంచ నంబర్ వన్ ఆస్ట్ర్రేలియాతో జరుగుతున్న నాలుగుమ్యాచ్ ల బోర్డ్రర్ - గవాస్కర్ ట్రోఫీని నిలబెట్టుకొన్న ఆనందం రెండోర్యాంకర్ భారతజట్టుకు లేకుండా పోయింది.

ఇండోర్ వేదికగా రెండున్నర రోజుల్లోనే ముగిసిన కీలక మూడోటెస్ట్ ఓటమితో రోహిత్ సేన ఆనందం కాస్త ఆవిరైపోయింది.

రెండడుగులు ముందుకు..ఓ అడుగువెనక్కి....

ఐసీసీ టెస్టు లీగ్ ఫైనల్ బెర్త్ సాధించాలంటే ఆస్ట్ర్రేలియాతో నాలుగుమ్యాచ్ ల సిరీస్ ను 3-0 లేదా 3-1తో నెగ్గితీరాల్సిన భారత్..మొదటి రెండుటెస్టుల్లో అలవోక విజయాలు సాధించడం ద్వారా శుభారంభమే చేసింది.

అయితే..ఇండోర్ హోల్కార్ స్టేడియం వేదికగా జరిగిన నిర్ణయాత్మక మూడోటెస్టులో సైతం భారత్ నెగ్గి ఉంటే నేరుగా ప్రపంచకప్ లీగ్ ఫైనల్స్ చేరి ఉండేది. కానీ ప్రత్యర్థిని

తక్కువగా అంచనావేయటం, మితిమీరిన ఆత్మవిశ్వాసం రోహిత్ సేనను నిలువునా ముంచాయి. తొలిఇన్నింగ్స్ లో 109 పరుగులకే కుప్పకూలటం, కంగారూ సీనియర్ స్పిన్నర్ నేథన్ లయన్ కు 8 వికెట్లు, యువస్పిన్నర్ కున్ మాన్ కు 5 వికెట్లు అప్పగించుకోడం..వెరసి 9 వికెట్ల ఘోరపరాజయం చవిచూడటం భారత్ ను బిత్తరపోయేలా చేశాయి.

ఐసీసీ టెస్ట్ లీగ్ ఫైనల్ దిశగా భారత్ పయనాన్ని రెండడుగులు ముందుకు, ఓ అడుగు వెనక్కి అనుకొనేలా చేశాయి.

ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకొన్న ఆస్ట్ర్రేలియా...

భారత్ తో నాలుగుమ్యాచ్ ల సిరీస్ లోని మొదటి రెండుటెస్టుల్లో ఘోరపరాజయాలు చవిచూసినా..ఇండోర్ టెస్టు విజయంతో ప్రపంచ టాప్ ర్యాంకర్ ఆస్ట్ర్రేలియా ఐసీసీ టెస్టు లీగ్ ఫైనల్స్ బెర్త్ ను ఖాయం చేసుకోగలిగింది.

కేవలం రెండున్నరరోజుల్లోనే భారత్ ను చిత్తు చేయడం ద్వారా ఆస్ట్ర్రేలియా టెస్టు లీగ్ పాయింట్ల శాతం 60.29కి పెరిగిపోయింది. దీంతో అలవోకగా ఫైనల్స్ చేరుకోగలిగింది.

మరోవైపు 60.29 పాయింట్ల శాతంతో లీగ్ టేబుల్ రెండోస్థానంలో కొనసాగుతున్న భారత్..ఈనెల 9 నుంచి అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగే ఆఖరి టెస్టులో ఆస్ట్ర్రేలియాను ఓడించగలిగితేనే ఫైనల్స్ చేరుకోగలుగుతుంది.

ఒకవేళ ఆఖరిటెస్టు ను డ్రాగా ముగించినా..పరాజయం ఎదురైనా..భారత్ ఫైనల్స్ బెర్త్ దొడ్డిదారిన ఖాయం చేసుకొనే అవకాశం సైతం లేకపోలేదు.

శ్రీలంక-న్యూజిలాండ్ సిరీసే కీలకం..

టెస్ట్ లీగ్ టేబుల్ మూడోస్థానంలో కొనసాగుతున్న శ్రీలంక, మాజీ చాంపియన్ న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగనున్న రెండుమ్యాచ్ ల టెస్టు సిరీస్ ఫలితం పైనే భారత్ లీగ్ ఫైనల్ చేరేది లేనిది ఆధారపడి ఉంది.

ఒకవేళ న్యూజిలాండ్ 2-0తో శ్రీలంకను చిత్తు చేస్తే..భారత్ కు ఫైనల్స్ బెర్త్ ఖాయమైపోతుంది. భారతజట్టు ఆఖరిటెస్టులో సైతం ఓడి..న్యూజిలాండ్ పై శ్రీలంక 2-0తో నెగ్గితే మాత్రం రోహిత్ సేన ఐసీసీ టెస్ట్ లీగ్ ఫైనల్ బెర్త్ కు నీళ్లు వదులుకోక తప్పదు. శ్రీలంక ప్రస్తుతం 53.33 పాయింట్ల శాతంతో లీగ్ టేబుల్ మూడోస్థానంలో కొనసాగుతోంది.

న్యూజిలాండ్ గడ్డపై న్యూజిలాండ్ ను 2-0తో శ్రీలంక ఓడించడం అంతతేలిక కాదు. శ్రీలంక 2-0తో కివీస్ ను చిత్తు చేయగలిగితే అదో సంచలనం, అపూర్వవిజయమే అవుతుంది.

ఇంగ్లండ్ లోని ఓవల్ వేదికగా జూన్ లో జరిగే టెస్టు లీగ్ టైటిల్ సమరంలో ప్రపంచ టాప్ ర్యాంకర్ ఆస్ట్ర్రేలియాతో రెండోర్యాంకర్ భారతజట్టు తలపడటానికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

First Published:  4 March 2023 11:45 AM IST
Next Story