Telugu Global
Sports

చేజింగ్ లో భారత్ సరికొత్త చరిత్ర సృష్టిస్తుందా?

ఐసీసీ ప్రపంచ టెస్టులీగ్ ఫైనల్స్ ఆఖరిరోజుఆటలో ఓ ప్రపంచ రికార్డు భారత్ ను ఊరిస్తోంది. 90 ఓవర్లలో 280 పరుగులు సాధించగలిగితే సరికొత్త చరిత్ర సృష్టించిన జట్టుగా నిలువగలుగుతుంది.

చేజింగ్ లో భారత్ సరికొత్త చరిత్ర సృష్టిస్తుందా?
X

చేజింగ్ లో భారత్ సరికొత్త చరిత్ర సృష్టిస్తుందా?

ఐసీసీ ప్రపంచ టెస్టులీగ్ ఫైనల్స్ ఆఖరిరోజుఆటలో ఓ ప్రపంచ రికార్డు భారత్ ను ఊరిస్తోంది. 90 ఓవర్లలో 280 పరుగులు సాధించగలిగితే సరికొత్త చరిత్ర సృష్టించిన జట్టుగా నిలువగలుగుతుంది....

క్రికెట్..మూడక్షరాల ఈ ఆటలో..ఫార్మాట్ ఏదైనా అసాధ్యం అన్నమాటకు చోటే లేదు. ఏదైనా సాధ్యమేనని, ఎంతటి కష్టమైన లక్ష్యాన్నైనా చేధించ వచ్చునని గతంలోని పలు రికార్డులు చెప్పకనే చెబుతున్నాయి.

లండన్ లోని ఓవల్ వేదికగా జరుగుతున్న 2023 ఐసీసీ టెస్టు లీగ్ ఫైనల్స్ ఆఖరిరోజుఆటలో టాప్ ర్యాంకర్ భారత్ కు సరికొత్త చరిత్ర సృష్టించే అవకాశం వచ్చింది.

టెస్ట్ లీగ్ టైటిల్ నెగ్గాలంటే నాలుగో ( టెస్టుమ్యాచ్ ఆఖరిరోజు ఆట) ఇన్నింగ్స్ లో భారత్ 444 పరుగుల ప్రపంచ రికార్డు లక్ష్యం సాధించాల్సి ఉంది. నాలుగోరోజు ఆట ముగిసే సమయానికే 3 వికెట్లకు 164 పరుగులు చేయటం ద్వారా విజయానికి 280 పరుగుల దూరంలో నిలిచింది.

టెస్టు మ్యాచ్ ఆఖరిరోజు ఆటలో భారత్ 90 ఓవర్లలో 280 పరుగులు చేయగలిగితే...అతిపెద్ద లక్ష్యాన్ని చేధించినజట్టుగా సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పగలుగుతుంది.

1976 లో 406 పరుగుల లక్ష్యం...

టెస్టు క్రికెట్ చరిత్రలో భారత్ నాలుగో ఇన్నింగ్స్ లో 400కు పైగా లక్ష్యాన్నిఒక్కసారి మాత్రమే సాధించగలిగింది. పోర్డ్ ఆఫ్ స్పెయిన్ వేదికగా వెస్టిండీస్ తో 1976 ఏప్రిల్ లో జరిగిన టెస్టుమ్యాచ్ లో కరీబియన్ ఫాస్ట్ బౌలర్ల దండును ఎదుర్కొని భారత్ కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 406 పరుగుల లక్ష్యాన్ని చేరుకోగలిగింది.

టెస్టు క్రికెట్‌లో ఇప్పటివరకు భారత్‌ ఛేదించిన అత్యధిక లక్ష్యంగా రికార్డుల్లో పదిలంగా ఉంది. ఆ తర్వాత 2008 డిసెంబర్‌లో చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 98.3 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 387 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించగలిగింది. ఇది భారత్‌కు రెండో అత్యధిక లక్ష్య ఛేదన.

2021లో కంగారూ గడ్డపైన..

2021 జనవరిలో బ్రిస్బేన్‌ గబ్బా వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో భారత్‌ 97 ఓవర్లు ఆడి 7 వికెట్లు కోల్పోయి 329 పరుగుల లక్ష్యాన్ని అందుకోగలిగింది. ఇది భారత్‌ చేధించిన మూడో అత్యధిక లక్ష్య ఛేదనగా రికార్డుల్లో ఉంది. అదేవిధంగా ఆస్ట్రేలియా జట్టు మీద భారత్‌ ఛేదించిన అత్యధిక లక్ష్యసాధనగా కూడా ఇదే ఉంది. ఇప్పుడు అదే ఆస్ట్రేలియా ప్రత్యర్థిగా ప్రస్తుత టెస్టు లీగ్ ఫైనల్లో భారత్ 444 పరుగుల భారీ లక్ష్యాన్ని చేజింగ్ చేయటానికి బరిలోకి దిగింది.

ఓవల్ వేదికగా అత్యధిక చేజింగ్ టార్గెట్ 263...

2023 ఐసీసీ టెస్టు లీగ్ ఫైనల్స్ కు ఆతిథ్యమిస్తున్న ఓవల్‌ క్రికెట్‌ స్టేడియంలో ఇప్పటివరకు 263 పరుగులే అత్యధిక లక్ష్య ఛేదనగా ఉంది. 1902లో ఆస్ట్రేలియాపై ఇంగ్లండ్‌ ఆ లక్ష్యాన్ని ఛేదించింది. ఆ తర్వాత వెస్టిండీస్‌ ఛేదించిన 253 పరుగులే రెండో అత్యధిక లక్ష్య ఛేదనగా ఉంది

ఓవల్ లో మూడో అత్యధిక లక్ష్య ఛేదన 242 పరుగులు మాత్రమే. అయితే..భారత్ ఎదుట ఉన్న 444 పరుగుల లక్ష్యం చూస్తే...కొండంతేనని చెప్పక తప్పదు.

444 పరుగుల ఈ కొండంత లక్ష్యాన్ని పిండి చేయగల మొనగాళ్లు విరాట్ కొహ్లీ, అజింక్యా రహానే ల రూపంలో భారతజట్టులో ఉన్నారు.

ఆఖరిరోజు ఆటలో సైతం ఈ ఇద్దరు పోరాటయోధులు నిలదొక్కుకొని ఆడగలిగితే..90 ఓవర్లలో మిగిలిన 280 పరుగులు సాధించడం భారత్ కు ఏమంత కష్టంకాబోదు.

ఓవల్ పిచ్ ఆఖరిరోజు ఆటలో సైతం బ్యాటింగ్ కు అనువుగా ఉంటే..భారత్ కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదే పిచ్ లో ఏమాత్రం తేడా వచ్చినా ఆస్ట్రేలియానే విజేతగా నిలవడం ఖాయమని చెప్పక తప్పదు.

భారత చేజింగ్ కింగ్ విరాట్ కొహ్లీ- ట్రబుల్ షూటర్ అజింక్యా రహానే తమ భాగస్వామ్యాన్ని భారీభాగస్వామ్యంగా మార్చగలిగితే..ఆస్ట్ర్రేలియాకు కంగారూ తప్పదు కాక తప్పదు.

First Published:  11 Jun 2023 1:00 PM IST
Next Story