కూడుపెట్టని క్రికెట్ ఎందుకు- డారెన్ సమీ!
వెస్టిండీస్ లో క్రికెట్ అంతరించిపోయే ప్రమాదంలో పడిందంటూ మాజీ కెప్టెన్, ప్రపంచకప్ విజేత డారెన్ సమీ ఆందోళన వ్యక్తం చేశాడు. కరీబియన్ ద్వీపాల క్రికెటర్లు అరకొరవేతనాలతో అల్లాడి పోతున్నారని వాపోయాడు.
వెస్టిండీస్ లో క్రికెట్ అంతరించిపోయే ప్రమాదంలో పడిందంటూ మాజీ కెప్టెన్, ప్రపంచకప్ విజేత డారెన్ సమీ ఆందోళన వ్యక్తం చేశాడు. కరీబియన్ ద్వీపాల క్రికెటర్లు అరకొరవేతనాలతో అల్లాడి పోతున్నారని వాపోయాడు...
వెస్టిండీస్..1970 దశకంలో ప్రపంచ క్రికెట్ ను కంటిచూపుతో శాసించిన జట్టు. వన్డే, టీ-20 ఫార్మాట్లలో రెండేసిసార్లు విజేతగా నిలిచిన ఘనత వెస్టిండీస్ కు మాత్రమే దక్కుతుంది.
వెస్టిండీస్ అనగానే వీరబాదుడు బాదే వీవ్ రిచర్డ్స్ , పోలార్డ్, డెస్మండ్ హేన్స్, గార్డన్ గ్రీనిడ్జ్, ఆల్ టైమ్ గ్రేట్ గార్ ఫీల్డ్ సోబర్స్, క్లైవ్ లాయిడ్ లాంటి దిగ్గజ బ్యాటర్లు, వెస్ హాల్, గ్రిఫిత్స్, ప్యాటర్సన్, మైకేల్ హోల్డింగ్, కోట్నీ వాల్ష్ , మాల్కం మార్షల్ లాంటి మెరుపు ఫాస్ట్ బౌలర్లు మాత్రమే మనకు గుర్తుకు వస్తారు. అయితే గత మూడుదశాబ్దాల కాలంగా వెస్టిండీస్ క్రికెట్ క్రమంగా క్షీణిస్తూ వస్తోంది. ఇటీవలే ముగిసిన టీ-20 ప్రపంచకప్ క్వాలిఫైయింగ్ రౌండ్ నుంచే నిష్క్ర్రమించడమే దానికి నిదర్శనం.
కరీబియన్ ద్వీపాల సమాహారం..
ప్రపంచ పటంలో వెస్టిండీస్ అన్న దేశం మనకు కనిపించదు. కేవలం క్రికెట్ కోసమే...కరీబియన్ సముద్ర ద్వీపాలన్నీ కలసి ఏర్పాటు చేసుకొన్నదే వెస్టిండీస్ క్రికెట్ బోర్డు.
జమైకా, బార్బెడోస్, ట్రినిడాడ్ అండ్ టొబాగో, ఆంటీగా, సెయింట్ కిట్స్ అండ్ నివీస్, గయానా, గ్రెనెడా, విండ్ వర్డ్, లీవార్డ్ ఐలాండ్స్ దేశాలన్నీ..కరీబియన్ క్రికెట్ జట్టుగా, వెస్టిండీస్ క్రికెట్ బోర్డులో భాగస్వాములుగా ఉన్నాయి.
క్రికెట్లో వెస్టిండీస్ కు ఘనమైన చరిత్రే ఉంది. వెస్టిండీస్ లేని క్రికెట్ ఉప్పు,కారం లేని భోజనం లాంటిదే. 1970 దశకం వరకూ ప్రపంచక్రికెట్లో అగ్రగామిగా నిలిచిన వెస్టిండీస్ లో రానురాను క్రికెట్ ప్రాభవం కోల్పోతూ వచ్చింది.
క్రికెట్ కు కొరవడిన ప్రోత్సాహం...
కరీబియన్ ద్వీప దేశాలకు చెందిన క్రికెటర్లకు క్రికెట్ ద్వారా వచ్చే ఆదాయం నామమాత్రంగా మారిపోయింది. దీంతో ఆయా దేశాల యువత క్రికెట్ ను విడిచిపెట్టి బాస్కెట్ బాల్, ట్రాక్ అండ్ ఫీల్డ్, ఫుట్ బాల్ లాంటి క్రీడల పట్ల మొగ్గుచూపుతున్నారు.
భారత దేశవాళీ క్రికెటర్లకు లభిస్తున్న ఆదాయం కూడా...వెస్టిండీస్ అంతర్జాతీయ క్రికెటర్లకు లేకపోడం ప్రమాణాలను దారుణంగా దెబ్బతీస్తోంది. దీనికితోడు అరకొర ఆదాయంతో వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ఆటగాళ్లకు తగిన వేతనాలు చెల్లించలేకపోతోంది.
కీరాన్ పోలార్డ్, డ్వయన్ బ్రావో, యాండ్రీ రస్సెల్ లాంటి పేరున్న కొందరు టీ-20 స్పెషలిస్టులు మాత్రమే విదేశీ క్రికెట్ లీగ్ ల్లో పాల్గొంటూ రెండుచేతులా ఆర్జించగలుగుతున్నారు.
భారత్ లో పేరున్న ఒక్కో క్రికెటర్ ఏడాదికి సగటున 7 నుంచి 10 కోట్ల రూపాయల వరకూ ఆర్జిస్తుంటే...వెస్టిండీస్ స్టార్ క్రికెటర్లకు కో్టిరూపాయలు కూడా దక్కడం లేదంటూ మాజీ కెప్టెన్, వెస్టిండీస్ కు టీ-20 ప్రపంచకప్ అందించిన కెప్టెన్ డారెన్ సమీ వాపోయాడు.
కడుపు నింపని క్రికెట్ ఎందుకు?
క్రికెట్ పైన ప్రేమ ఉంటే కడుపు నిండదని, ఆటగాళ్లకూ కుటుంబాలు, అవసరాలు ఉంటాయని, ఆదాయం లేనప్పుడు క్రికెట్ ఆడటం ఎందుకని తమ క్రికెటర్లు, యువకులు ప్రశ్నిస్తున్నారని, అమెరికాలో ఉన్న పలురకాల బాస్కెట్ బాల్ లీగ్ ల్లో పాల్గొంటూ దండిగా ఆర్జిస్తున్నారని సామీ తెలిపాడు.
కరీబియన్ దేశవాళీ క్రికెటర్లకు అవసరాలు తీర్చే మొత్తం వేతనంగా అందితేనే కానీ వెస్టిండీస్ క్రికెట్ బతికి బట్టకట్టలేదని తేల్చి చెప్పాడు. ఆస్ట్ర్రేలియా వేదికగా ముగిసిన 2022 టీ-20 ప్రపంచకప్ అర్హత రౌండ్ పోటీల నుంచే వెస్టిండీస్ నిష్క్ర్రమించడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశాడు. అంతర్జాతీయ క్రికెట్ సంఘం పెద్దలు వెస్టిండీస్ క్రికెట్ బాగోగులను కాస్త పట్టించుకోవాలని సూచించాడు. వెస్టిండీస్ క్రికెట్ పతనమైతే అది అంతర్జాతీయ క్రికెట్ కే తీరని నష్టమన్న వాస్తవాన్ని గుర్తించాలని హెచ్చరించాడు.
న్యూజిలాండ్ ఆదర్శం కావాలి...
న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు తమ ఆటగాళ్ల కోసం ఎంతో చేస్తోందని, విదేశీ లీగ్ లు జరిగే సమయంలో అంతర్జాతీయ సిరీస్ లు లేకుండా జాగ్రత్త పడుతోందని, కివీ క్రికెటర్లు విదేశీ లీగ్ లు ఆడుతూనే తమ జాతీయజట్టుకు అందుబాటులో ఉండగలుగుతున్నారని, అదే వెస్టిండీస్ లో జరగడం లేదని వాపోయాడు. మనసుంటే మార్గం కూడా ఉంటుందని, క్రికెటర్లకు వేతనాలు చెల్లించలేని వెస్టిండీస్ క్రికెట్ బోర్డు పెద్దమనసుతో కార్యక్రమాలు రూపొందించుకోవాలని, విదేశీలీగ్ ల్లో పాల్గొన సమయంలో అంతర్జాతీయ సిరీస్ లు లేకుండా ముందు జాగ్రత్తగా ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించాడు.