Telugu Global
Sports

ఈ కుబేర క్రికెటర్ ముందు విరాట్ , ధోనీ, సచిన్ దిగదుడుపే!

ప్రపంచంలోనే అత్యంత శ్రీమంతుడైన క్రికెటర్ ఎవరంటే..సచిన్ , కొహ్లీ, ధోనీ మాత్రం కానేకాదన్న సమాధానమే వస్తుంది.

ఈ కుబేర క్రికెటర్ ముందు విరాట్ , ధోనీ, సచిన్ దిగదుడుపే!
X

ప్రపంచంలోనే అత్యంత శ్రీమంతుడైన క్రికెటర్ ఎవరంటే..సచిన్ , కొహ్లీ, ధోనీ మాత్రం కానేకాదన్న సమాధానమే వస్తుంది.

క్రికెట్ చరిత్రలో అత్యంత ధనికులైన ఆటగాళ్లు అతికొద్దిమంది మాత్రమే ఉంటారు. అలాంటి వారిలో మాస్టర్ సచిన్ టెండుల్కర్, మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కొహ్లీల పేర్లే వినిపిస్తాయి. అయితే..ఈ ముగ్గురినీ మించి ఎవ్వరూ అందుకోలేనంత ఎత్తులో ఉన్న కుబేర క్రికెటర్ ఓ భారతీయుడే అంటే ఆశ్చర్యపోవాల్సిందే.

20 వేల కోట్లతో అగ్రస్థానం...

ప్రపంచ క్రికెట్లో అత్యంత ధనవంతుడైన క్రికెటర్ ఆస్తులు 20వేల కోట్ల రూపాయలు. ఆ కుబేరుడు మరెవ్వరో కాదు..ఓ భారత మాజీ దేశవాళీ క్రికెటరే. ఆయన పేరు సమర్ జీత్ సింహ్ రంజీత్ సింగ్ గయక్వాడ్. బరోడా రాజవంశానికి చెందిన సమరజీత్ గతంలో బరోడా తరపున భారత దేశవాళీ ( రంజీట్రోఫీ) క్రికెట్ పోటీలలో పాల్గొన్నారు.

ప్రస్తుతం బరోడా మహారాజాగా ఉన్న సమర్ జీత్ మొత్తం ఆస్తుల విలువ 20వేల కోట్ల పైమాటే. 1987-88, 1988-89 సీజన్ల రంజీట్రోఫీ మ్యాచ్ ల్లో పాల్గొన్న సమరజీత్ 65 పరుగుల అత్యధిక వ్యక్తిగత స్కోరుతో మొత్తం 119 పరుగులు మాత్రమే చేయగలిగారు. ఆయన రంజీ కెరియర్ కేవలం 6 మ్యాచ్ లకు మాత్రమే పరిమితమయ్యింది.

బరోడా క్రికెట్ సంఘానికి కూడా సమర్ జీత్ క్రికెట్ అడ్మినిస్ట్రేటర్ గా సేవలు అందించారు.

బరోడా రాజకుటుంబంలో 1967 ఏప్రిల్ 25న జన్మించిన సమర్ జీత్ తన బాల్యంలో డూన్ స్కూల్ లో చదివిన రోజుల్లో క్రికెట్ తో పాటు ఫుట్ బాల్, టెన్నిస్ ఆటలు ఆడుతూ ఉండేవారు.

2012లో బరోడా మహారాజా మృతి చెందడంతో ఆయన వారసుడైన సమర్ జీత్ సింహ్ పట్టాభిషేకం చేసుకొన్నారు. వంశపారంపర్య ఆస్తుల కోసం తన బాబాయితో 23 సంవత్సరాల పాటు న్యాయపోరాటం చేసి..చివరికి అత్యంత ఖరీదైన లక్ష్మీవిలాస్ ప్యాలెస్ ను దక్కించుకోగలిగారు.

2020లో ధరల ప్రకారం బరోడా రాజమహల్ లక్ష్మీ విలాస్ ప్యాలెస్ విలువను 20వేల కోట్ల రూపాయలుగా నిర్ణయించారు.

తన బాబాయితో కుదిరిన ఒప్పందం ప్రకారం తన ప్యాలెస్ కు ఆనుకొని ఉన్న 600 ఎకరాల రియల్ ఎస్టేట్ భూమితో పాటు మోతే బాగ్ క్రికెట్ స్టేడియాన్ని, మహారాజా ఫతేసింగ్ మ్యూజియంతో పాటు రాజా రవివర్మ చిత్రించిన పలు విలువైన పెయింటింగ్ లు, కళాఖండాలు, రాజవంశానికి చెందిన వజ్రవైడూర్యాలు, స్వర్ణ, రజత ఆభరణాలను వదులుకోవాల్సి వచ్చింది.

17 దేవాలయాలకు ప్రధాన ట్రస్టీగా..

వంకనీర్ రాజవంశానికి చెందిన రాధిక రాజేను జీవితభాగస్వామిగా చేసుకొన్న సమర్ జీత్ కు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. గుజరాత్, బెనారస్ లోని 17 ప్రముఖ దేవాలయాలకు ఆయన ప్రధాన ట్రస్టీగా వ్యవహరిస్తున్నారు.

భారత దేశంలోనే అత్యంత విశాలమైన, అతిపెద్ద రాజభవనంగా పేరుపొందిన లక్ష్మీవిలాస్ ప్యాలెస్ లో సమరజీత్ సింహ్ నివసిస్తున్నారు.

సమర్ జీత్ ఆస్తుల మొత్తం 30వేల కోట్ల రూపాయలకు పైగా ఉండవచ్చునని భావిస్తున్నారు.

భారత క్రికెట్ దిగ్గజాలు విరాట్ కొహ్లీ ఆస్తులు 1050 కోట్ల రూపాయలు కాగా..మహేంద్ర సింగ్ ధోనీ 1040 కోట్లతో ఆ తర్వాతి స్థానంలో ఉన్నాడు. మాస్టర్ సచిన్ టెండుల్కర్ ఆస్తులు సైతం వెయ్యి కోట్లకు పైగా ఉంటాయి.

అయితే..విరాట్ , ధోనీ, సచిన్ క్రికెట్ ఆడుతూ తమ కష్టార్జితంతో వందల కోట్లు ఆర్జిస్తే...సమర్ జీత్ సింహ్ మాత్రం బరోడా రాజవంశంలో జన్మించడం, వంశపారంపర్యంగా ఆస్తులు సంక్రమించడంతో ప్రపంచంలోనే అత్యంత ధనికుడైన క్రికెటర్ గా రికార్డుల్లో చోటు సంపాదించగలిగారు.

First Published:  9 July 2023 1:53 PM IST
Next Story