Telugu Global
Sports

ఆటో డ్రైవర్ కొడుకు పోయే...ట్యాక్సీ డ్రైవర్ కొడుకు వచ్చే!

ప్రతిభ ఉంటే చాలు సాదాసీదా కుటుంబాల నుంచి వచ్చిన వారైనా అంతర్జాతీయ క్రికెట్లో భారత్ కు ప్రాతినిథ్యం వహించగలరని తాజాగా బెంగాల్ యువపేసర్ ముకేశ్ కుమార్ నిరూపించాడు.

ఆటో డ్రైవర్ కొడుకు పోయే...ట్యాక్సీ డ్రైవర్ కొడుకు వచ్చే!
X

కోల్ కతా లోని ఓ ట్యాక్సీ డ్రైవర్ కొడుకు వన్డే క్రికెట్లో భారత 251వ అంతర్జాతీయ క్రికెటర్ గా అరంగేట్రం చేశాడు. వెస్టిండీస్ తో తొలివన్డే ద్వారా వన్డే క్యాప్ అందుకొన్నాడు..

భారత క్రికెట్లో పలు అరుదైన ఘట్టాలు చోటు చేసుకొంటున్నాయి. ప్రతిభ ఉంటే చాలు సాదాసీదా కుటుంబాల నుంచి వచ్చిన వారైనా అంతర్జాతీయ క్రికెట్లో భారత్ కు ప్రాతినిథ్యం వహించగలరని తాజాగా బెంగాల్ యువపేసర్ ముకేశ్ కుమార్ నిరూపించాడు.

ప్రపంచకప్ కు సన్నాహాలలో భాగంగా వెస్టిండీస్ తో జరుగుతున్న తీన్మార్ వన్డే సిరీస్ ద్వారా 28 సంవత్సరాల ముకేశ్ కుమార్ అరంగేట్రం చేయటమే కాదు..ఓ వికెట్ ను సైతం పడగొట్టాడు.

సిరాజ్ కు గాయం, ముకేశ్ కు వరం...

హైదరాబాదీ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ కాలిమడమ గాయంతో స్వదేశానికి తిరిగి రావటంతో.. ఆ స్థానాన్ని బెంగాల్ పేస్ బౌలర్ ముకేశ్ కుమార్ తో టీమ్ మేనేజ్ మెంట్ భర్తీ చేసింది.

గత వారమే ..పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్ ద్వారా తన తొలిటెస్టు క్యాప్ అందుకొన్న ముకేశ్ అంచనాలకు తగ్గట్టుగానే రాణించి రెండు ఇన్నింగ్స్ లోనూ కలిపి 3 వికెట్లు పడగొట్టాడు.

అంతటితో ఆగిపోకుండా వన్డే జట్టులో సైతం చోటు సంపాదించగలిగాడు. బార్బడోస్ లోని కెన్సింగ్టన్ ఓవల్ గ్రౌండ్స్ లో వెస్టిండీస్ తో ముగిసిన తొలివన్డే ద్వారా ముకేశ్ 50 ఓవర్ల అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. భారత్ వన్డే క్యాప్ సాధించిన 251వ క్రికెటర్ గా రికార్డుల్లో చేరాడు.

సౌరవ్ గంగూలీ అండదండలతో...

బీహార్ లోని గోపాల్ గంజ్ లో జన్మించిన ముకేశ్ కుమార్ దేశవాళీ క్రికెట్లో మాత్రం బెంగాల్ కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ముకేశ్ తండ్రి తన కుటుంబ పోషణ కోసం కోల్ కతా నగరంలో ట్యాక్సీ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. నెలనెలా తనతండ్రి కోల్ కతా నుంచి పంపే డబ్బుతో ముకేశ్ డిగ్రీ పట్టా అందుకొన్నాడు. 2010 వరకూ బీహార్ లోని గడిపిన ముకేశ్ చదువు పూర్తి కావడంతో 2012 లో తండ్రి ఆదేశం మేరకు కోల్ కతా కు తరలి వచ్చాడు.

ముకేశ్ కుమార్ కు కుదురైన మీడియం పేస్ బౌలర్ గా పేరుంది. అయితే..కోల్ కతా లాంటి మహానగరంలో నివాసం లేకపోడంతో..బీసీసీఐ మాజీచైర్మన్ సౌరవ్ గంగూలీ

అండగా నిలిచాడు. కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ స్టేడియాన్ని నివాసంగా చేసుకొని కాళీఘాట్ క్రికెట్ క్లబ్ కు ఆడుతూ బెంగాల్ జట్టులో చోటు సంపాదించాడు.

బుచ్చిబాబు క్రికెట్ టోర్నీతో పాటు వివిధ పోటీలలో నిలకడగా రాణించడం ద్వారా ముకేశ్ సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు.

కుదురైన మీడియం పేసర్ గా..

దేశవాళీ రంజీట్రోఫీలో బెంగాల్ జట్టు రెండుసార్లు ఫైనల్స్ చేరడంలోముకేశ్ తనవంతు పాత్ర నిర్వర్తించాడు. అలుపుసొలుపు లేకుండా చక్కటి లైన్ అండ్ లెంత్ తో గంటల తరబడి బౌలింగ్ చేయగల సామర్థ్యం ముకేశ్ కు మాత్రమే సొంతం.

దేశవాళీ క్రికెట్లో 39 మ్యాచ్ లు ఆడి 149 వికెట్లు పడగొట్టిన ముకేశ్..భారత -ఏ జట్టు తరపున 24 మ్యాచ్ ల్లో 26 వికెట్లు సాధించాడు. 33 టీ-20 మ్యాచ్ ల్లో 32 వికెట్లు సైతం పడగొట్టిన రికార్డు ముకేశ్ కు ఉంది.

2019-20 రంజీ ఫైనల్ ఆడుతున్న సమయంలో ముకేశ్ తండ్రి మెదడులో నరాలు చిట్లి మృతిచెందడంతో క్రికెట్ కు దూరం కావాలని భావించాడు. అయితే..సౌరవ్ గంగూలీతో పాటు తల్లికూడా సముదాయించి, ధైర్యం చెప్పడంతో కెరియర్ కొనసాగించాడు.

వెస్టిండీస్ తో పర్యటన కోసం ఎంపిక చేసిన టెస్టు, వన్డేజట్లలో చోటు సంపాదించడం ద్వారా తన జీవితలక్ష్యాన్ని నెరవేర్చుకోడమే కాదు..కన్నతండ్రి కలలను సైతం సాకారం చేసుకోగలిగాడు.

2023 ఐపీఎల్ వేలంలో ఢిల్లీ ఫ్రాంచైజీ ముకేశ్ ను 5 కోట్ల 50 లక్షల ధరకు సొంతం చేసుకొంది. ఢిల్లీ క్యాపిటల్స్ కు డైరెక్టర్ గా సౌరవ్ గంగూలీ వ్యవహరిస్తున్నారు.

తనకు తల్లిదండ్రులు జీవితాన్ని ఇచ్చినా..క్రికెట్ జీవితం మాత్రం సౌరవ్ గంగూలీ ఇచ్చినదేనంటూ ముకేశ్ మురిసిపోతున్నాడు.

అన్నట్లు..మహ్మద్ సిరాజ్ హైదరాబాద్ లోని ఓ ఆటో డ్రైవర్ కొడుకైతే...ముకేశ్ కుమార్ మాత్రం కోల్ కతా లోని ఓ ట్యాక్సీడ్రైవర్ కొడుకు కావడం..ఈ ఇద్దరూ టెస్టు క్రికెట్లో భారత్ కు ప్రాతినిథ్యం వహించడం, సిరాజ్ గాయం కారణంగా భారత వన్డే జట్టులో ముకేశ్ కు చోటు దక్కడం యాధృచ్చికమే అనుకోక తప్పదు.


First Published:  28 July 2023 11:47 AM IST
Next Story