Telugu Global
Sports

క్లాసెన్ క్లాస్...విరాట్ కొహ్లీ మాస్టర్ క్లాస్!

హైదరాబాద్ వేదికగా ముగిసిన ఐపీఎల్ ఆఖరిమ్యాచ్ లో ఓ అపూర్వఘట్టం చోటు చేసుకొంది. గత 15 సీజన్ల ఐపీఎల్ చరిత్రలో ఎన్నడూ నమోదు కాని ఓ అరుదైన రికార్డు వచ్చి చేరింది.

క్లాసెన్ క్లాస్...విరాట్ కొహ్లీ మాస్టర్ క్లాస్!
X

క్లాసెన్ క్లాస్...విరాట్ కొహ్లీ మాస్టర్ క్లాస్!

హైదరాబాద్ వేదికగా ముగిసిన ఐపీఎల్ ఆఖరిమ్యాచ్ లో ఓ అపూర్వఘట్టం చోటు చేసుకొంది. గత 15 సీజన్ల ఐపీఎల్ చరిత్రలో ఎన్నడూ నమోదు కాని ఓ అరుదైన రికార్డు వచ్చి చేరింది..

హైదరాబాద్ సన్ రైజర్స్ హోంగ్రౌండ్ ఆతిథ్యజట్టుకు అచ్చిరాకపోయినా..అరుదైన రికార్డుల ఖజానాగా మాత్రం మిగిలిపోతోంది. ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా బెంగళూరు రాయల్ చాలెంజర్స్- సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల నడుమ ముగిసిన 13వ రౌండ్ మ్యాచ్ లో ఓ అరుదైన రికార్డు వచ్చి చేరింది.

గత 15 సీజన్లలో ఎన్నడూ నమోదు కాని ఓ సరికొత్త రికార్డు రాజీవ్ స్టేడియానికి ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చింది.

ఒకే మ్యాచ్ లో తొలిసారిగా రెండు శతకాలు!

2008 ప్రారంభ ఐపీఎల్ నుంచి ప్రస్తుత 2023 సీజన్ ఐపీఎల్ వరకూ వెయ్యికి పైగా మ్యాచ్ లు జరిగితే...హైదరాబాద్ రాజీవ్ గాంధీ స్టేడియం వేదికగా ముగిసిన లీగ్ 65వ మ్యాచ్ లో హైదరాబాద్ సూపర్ హిట్టర్ హెన్రిక్ క్లాసెన్, బెంగళూరు స్టార్ ఓపెనర్ విరాట్ కొహ్లీ సెంచరీలు బాది సరికొత్త చరిత్ర సృష్టించారు.

ప్రస్తుత 16వ సీజన్ లీగ్ ప్లే-ఆఫ్ రౌండ్ ఆశల్ని సజీవంగా నిలుపుకోవాలంటే నెగ్గితీరాల్సిన పోరులో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ 8 వికెట్ల తేడాతో సన్ రైజర్స్ హైదరాబాద్ ను చిత్తు చేసింది.

సిక్సర్ తో క్లాసెన్ సూపర్ టన్....

ప్రస్తుత సీజన్లో హైదరాబాద్ సన్ రైజర్స్ తరపున నిలకడగా రాణిస్తూ స్టార్ బ్యాటర్ గా గుర్తింపు తెచ్చుకొన్న వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ హెన్రిక్ క్లాసెన్..తన హోంగ్రౌండ్లో జరిగిన ఆఖరిలీగ్ పోరులో క్లాసికల్ సెంచరీ సాధించాడు.

ఈ కీలక పోరులో ముందుగా టాస్ నెగ్గిన బెంగళూరు ఫీల్డింగ్ ఎంచుకోడంతో హైదరాబాద్ బ్యాటింగ్‌కు దిగింది. ఇప్పటికే ప్లేఆఫ్స్‌ రేస్ నుంచి వైదొలిగిన సన్ రైజర్స్‌.. సొంతగడ్డపై ఆడిన ప్రస్తుత సీజన్ ఆఖరిపోరులో నెగ్గడం ద్వారా పరువు దక్కించుకోవాలని భావించింది.

ఏమాత్రం అనుభవం లేని ఇద్దరు ఓపెనర్లతో బ్యాటింగ్ కు దిగిన సన్ రైజర్స్..28 పరుగులకే 2 వికెట్లు నష్టపోయి ఎదురీత మొదలు పెట్టింది. అయితే కెప్టెన్ మర్కరమ్, స్టార్ బ్యాటర్ హెన్రిక్ క్లాసెన్ మూడో వికెట్ కు కీలక భాగస్వామ్యంతో ఆశలు చిగురింప చేశారు. క్లాసెన్‌ వచ్చి రావడంతోనే తన దూకుడు కొనసాగించాడు. భారీషాట్లతో బెంగళూరు బౌలర్లపై విరుచుకు పడ్డాడు. తొలి బంతినే బౌండరీ బాదిన క్లాసెన్‌ ఆ తర్వాత వెనుదిరిగి చూసింది లేదు. పవర్‌ప్లే 6 ఓవర్లు ముగిసే సమయానికే సన్ రైజర్స్ 2 వికెట్లకు 49 పరుగులు చేయగలిగింది.

ఓ వైపు క్లాసెన్‌ బౌండరీలతో దుమ్మురేపితే.. మరో ఎండ్‌లో కెప్టెన్‌ మర్కరమ్ స్ట్రయిక్ రొటేట్ చేస్తూ (18) చక్కటి సహకారం అందించాడు. క్లాసెన్‌ 24 బంతుల్లోనే అర్ధసెంచరీ సాధించాడు.అప్పటి వరకు ఆచితూచి ఆడుతూ వచ్చిన మర్కరమ్ ఓ భారీషాట్ ఆడబోయి స్పిన్నర్ షాబాజ్ బౌలింగ్ లో దొరికిపోయాడు. ఆ తర్వాత క్రీజులోకొచ్చిన బ్రూక్‌.. క్లాసెన్‌కు అండగా నిలిచాడు. బ్రూక్‌ సైతం బ్యాటు ఝళిపించడంతో హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌ జోరు అందుకుంది. ఒకదశలో 200 స్కోరు చేసేలా కనిపించింది. క్లాసెన్ మాత్రం సింగిల్స్‌ కాకుండా బౌండరీలే లక్ష్యంగా చెలరేగాడు. షాబాజ్‌ బౌలింగ్‌లో రెండు భారీ సిక్స్‌లు బాదాడు.

97 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద హర్షల్‌ పటేల్‌ బౌలింగ్‌లో బౌలర్ నెత్తిమీదుగా భారీసిక్సర్ బాదడం ద్వారా ఐపీఎల్ లో తన తొలి శతకాన్ని పూర్తి చేయగలిగాడు. కేవలం 49 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. 51 బంతుల్లో 8 బౌండ్రీలు, 6 సిక్సర్లతో 104 పరుగుల స్కోరు సాధించి..హర్షల్ యార్కర్ కు బౌల్డయ్యాడు.

డెత్ ఓవర్లలోని చివరి 18 బంతులను బెంగళూరు బౌలర్లు సమర్థవంతంగా వేయడంతో సన్ రైజర్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 186 పరుగులు మాత్రమే చేయగలిగింది. రాయల్ చాలెంజర్స్ బౌలర్లలో ఆఫ్ స్పిన్నర్ బ్రేస్‌వెల్‌ 13 పరుగులిచ్చి 2 వికెట్లు, షాబాజ్‌, సిరాజ్‌, హర్షల్‌ ఒక్కో వికెట్‌ పడగొట్టారు.

ఐపీఎల్ ప్రస్తుత సీజన్లో హైదరాబాద్ తరపున బ్రూక్స్ తొలి సెంచరీ సాధించగా, క్లాసెన్ రెండో శతకం బాదాడు. సన్ రైజర్స్ తరపున ఐపీఎల్ లో ఇది నాలుగో శతకం కావడం విశేషం.

హైదరాబాద్ వేదికగా విరాట్ తొలి ఐపీఎల్ శతకం..

మ్యాచ్ నెగ్గాలంటే 187 పరుగులు చేయాల్సిన బెంగళూరుకు..సూపర్ ఓపెనర్ల జోడీ విరాట్ కొహ్లీ- డూప్లెసిస్ మొదటి వికెట్ కు 172 పరుగుల రికార్డు భాగస్వామ్యం అందించారు. మరో 4 బంతులు మిగిలిఉండగానే బెంగళూరు 2 వికెట్లు మాత్రమే నష్టపోయి 8 వికెట్ల విజయం సాధించింది.

స్టార్ బౌలర్ భువనేశ్వర్‌ తొలి ఓవర్‌ మొదటి రెండు బంతుల్లో కొహ్లీ బౌండరీలతో జోరు ప్రదర్శించాడు. సూపర్‌ ఫామ్‌మీదున్న డుప్లెసీ కూడా కోహ్లీకి జతకలువడంతో ఆర్‌సీబీ ఇన్నింగ్స్‌ టాప్‌గేర్‌లో దూసుకెళ్లింది. కార్తీక్‌ త్యాగి వేసిన నాలుగో ఓవర్లో డుప్లెసిస్‌ హ్యాట్రిక్‌ ఫోర్లతో చెలరేగాడు. దీంతో పవర్‌ప్లే ముగిసే సరికి వికెట్‌ నష్టపోకుండా 64 పరుగులు చేసింది.

మాస్టర్ బ్యాటర్ విరాట్ కొహ్లీ 63 బంతుల్లో 12 బౌండ్రీలు, 4 సిక్సర్లతో 100 పరుగుల స్కోరుకు అవుటయ్యాడు. ఐపీఎల్ లో విరాట్ కు ఇది ఆరోశతకం కాగా..నాలుగేళ్ల తర్వాత తొలి ఐపీఎల్ సెంచరీ. అంతేకాదు..హైదరాబాద్ రాజీవ్ స్టేడియం వేదికగా కొహ్లీకి ఇదే తొలి మూడంకెల స్కోరు కావడం మరో విశేషం.

బెంగళూరు కెప్టెన్ డూప్లెసి 71 పరుగుల స్కోరుతో ఆరెంజ్ క్యాప్ ను నిలబెట్టుకొన్నాడు.

హైదరాబాద్ బౌలర్లలో భువనేశ్వర్‌, నజరాజన్‌ చెరో వికెట్ పడగొట్టారు. కోహ్లీకి ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ దక్కింది. ఈ విజయంతో బెంగళూరు మెరుగైన రన్ రేట్ తో పాటు 14 పాయింట్లు సాధించడం ద్వారా ముంబైని ఐదోస్థానానికి పడిపోయేలా చేసింది.

సన్ రైజర్స్ హైదరాబాద్‌ 13 రౌండ్లలో 4 విజయాలు, 9 పరాజయాలతో లీగ్ టేబుల్ అట్టడుగుకు పడిపోయింది.

తమ చివరి రౌండ్ మ్యాచ్ ల్లో గుజరాత్ టైటాన్స్ తో బెంగళూరు, ముంబై ఇండియన్స్ తో హైదరాబాద్ సన్ రైజర్స్ తలపడాల్సి ఉంది.

ఈరోజు జరిగే మరో కీలక పోరులో పంజాబ్ కింగ్స్ తో రాజస్థాన్ రాయల్స్ తలపడనుంది. రాత్రి 7-30కి ధర్మశాల వేదికగా ఈమ్యాచ్ ప్రారంభమవుతుంది.

First Published:  19 May 2023 5:45 PM IST
Next Story