పాక్ పై అప్ఘన్ అదిరేటి గెలుపు!
వన్డే ప్రపంచకప్ లో అఫ్ఘనిస్థాన్ సంచలన విజయాల పరంపర కొనసాగుతోంది. ప్రపంచ రెండోర్యాంకర్ పాకిస్థాన్ పై 8 వికెట్ల తో అలవోక విజయం సాధించింది...
వన్డే ప్రపంచకప్ లో అఫ్ఘనిస్థాన్ సంచలన విజయాల పరంపర కొనసాగుతోంది. ప్రపంచ రెండోర్యాంకర్ పాకిస్థాన్ పై 8 వికెట్ల తో అలవోక విజయం సాధించింది...
ప్రపంచకప్ రౌండ్ రాబిన్ లీగ్ లో ప్రపంచ చాంపియన్ ఇంగ్లండ్, రెండోర్యాంకర్ పాకిస్థాన్ జట్ల పరిస్థితి రౌండ్ రౌండ్ కూ తీసికట్టుగా తయారయ్యింది. ఈ రెండుజట్ల నాకౌట్ బెర్త్ అవకాశాలు గాల్లో దీపంలామారాయి.
బాబర్ అజమ్ నాయకత్వంలోని పాకిస్థాన్ జట్టు వరుసగా మూడో ఓటమితో కుదేలైపోయింది. 5వ రౌండ్ పోరులో అప్ఘనిస్థాన్ 8 వికెట్ల తేడాతో పాకిస్థాన్ పై చరిత్రాత్మక విజయం సాధించింది.
పాక్ కు అప్ఘన్ స్పిన్నర్ల పగ్గాలు....
చెన్నైచెపాక్ స్టేడియం వేదికగా జరిగిన ఈపోరులో టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్ ఎంచుకోడం ద్వారా పాక్ జట్టు చేజేతులా ఓటమి కొని తెచ్చుకొంది. స్పిన్ బౌలర్లకు అనువుగా ఉండే చెపాక్ పిచ్ పైన అప్ఘన్ స్పిన్ త్రయం అంచనాలకు మించి రాణించారు.
పవర్ ఫుల్ బ్యాటింగ్ లైనప్ కలిగిన పాక్ జట్టును 50 ఓవర్లలో 7 వికెట్లకు 282 పరుగుల స్కోరుకే పరిమితం చేయగలిగారు. కెప్టెన్ బాబర్ అజమ్ 92 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్ తో 74 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు.
ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ 58, మిడిలార్డర్ ఆటగాళ్లు షదాబ్ ఖాన్, ఇఫ్తీకర్ అహ్మద్ చెరో 40 పరుగుల చొప్పున సాధించగలిగారు. అప్ఘన్ బౌలర్లలో నూర్ అహ్మద్ 3, నవీనుల్ హక్ 2, నబీ, అజంతుల్లా చెరో వికెట్ పడగొట్టారు.
అప్ఘన్ సూపర్ చేజింగ్ షో...
బ్యాటింగ్ కు అంతగా అనువుకాని చెపాక్ పిచ్ పైన 283 పరుగుల లక్ష్యం సాధించడం అప్ఘన్ జట్టుకు అంతతేలికకాదని అందరూ భావించారు. అయితే..ఓపెనింగ్ జోడీ
ఇబ్రహీం జడ్రాన్- రహంతుల్లా గుర్బాజ్ మొదటి వికెట్ కు 21.1 ఓవర్లలో 130 పరుగుల భాగస్వామ్యంతో కళ్లు చెదిరే ఆరంభాన్ని ఇచ్చారు.
మరోవైపు..పవర్ ప్లే ఓవర్ల నుంచి మిడిల్ ఓవర్ల వరకూ పాక్ బౌలింగ్ ఎటాక్ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. ప్రధానంగా మెరుపు ఫాస్ట్ బౌలర్లు షాహీన్ అఫ్రిదీ, హరిస్ రవూఫ్, హసన్ అలీలతో పాటు..స్పిన్ జోడీ షదాబ్ ఖాన్, ఇఫ్తీకర్ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారు.
రహంతుల్లా గుర్బాజ్ 53 బంతుల్లో 9 బౌండ్రీలు, ఓ సిక్సర్ తో 65 పరుగుల స్కోరుకు అవుటైన తరువాత వచ్చిన వన్ డౌన్ రహ్మత్ షా సైతం నిలదొక్కుకొని ఆడాడు. రెండో వికెట్ కు ఓపెనర్ జడ్రాన్ తో కలసి కీలక భాగస్వామ్యాన్ని కొనసాగించాడు.
జడ్రాన్- హషంతుల్లా జోడీ షో...
ఓపెనర్ ఇబ్రహీం జడ్రాన్ పాక్ బౌలర్లను అలవోకగా ఎదుర్కొని 113 బంతుల్లో 10 ఫోర్లతో 87 పరుగులతో అప్ఘన్ జట్టును విజయానికి చేరువగా తీసుకెళ్లాడు. ఆ తరువాత రహ్మత్ షా- హష్మతుల్లా జోడీ అజేయ భాగస్వామ్యంతో మరో 6 బంతులు మిగిలి ఉండగానే 8 వికెట్ల సంచలన విజయం పూర్తి చేశారు.
హష్మతుల్లా45 బంతుల్లో 4 బౌండ్రీలతో 48, రహ్మత్ షా 84 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 77 పరుగులతో అజేయంగా నిలిచారు.
పాక్ బౌలర్లలో షాహీన్ అఫ్రిదీ, హసన్ అలీ చెరో వికెట్ పడగొట్టారు. అప్ఘన్ విజయంలో ప్రధానపాత్ర వహించిన ఓపెనర్ ఇబ్రహీం జడ్రాన్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
7 వరుస పరాజయాల తర్వాత...
పాకిస్థాన్ ప్రత్యర్థిగా ఆడిన గత 7 వన్డేలలో పరాజయాలు చవిచూస్తూ వచ్చిన అప్ఘన్ జట్టుకు ప్రపంచకప్ వేదికగా ఇదే తొలిగెలుపు. ప్రస్తుత చాంపియన్ ఇంగ్లండ్ తో జరిగిన పోరులో సంచలన విజయం సాధించిన అప్ఘన్ జట్టుకు రౌండ్ రాబిన్ లీగ్ లో ఇది వరుసగా రెండో గెలుపు.
50 ఓవర్ల ఫార్మాట్లో అప్ఘనిస్థాన్ కు ఇదే అతిపెద్ద చేజింగ్ విజయంగా రికార్డుల్లో నమోదయ్యింది.
వన్డే ప్రపంచకప్ చరిత్రలో 2015 టోర్నీలో స్కాట్లాండ్ పై వికెట్ తేడాతో నెగ్గిన అప్ఘన్ జట్టు ప్రస్తుత ప్రపంచకప్ లో ఏకంగా రెండు ప్రపంచ మేటి జట్లను కంగు తినిపించడం ఓ అరుదైన ఘనతగా మిగిలిపోతుంది.
న్యూఢిల్లీ వేదికగా ఇంగ్లండ్ పై 69 పరుగులతో నెగ్గిన అప్ఘన్ ఇప్పుడు 8 వికెట్లతో పాక్ జట్టును సైతం కంగుతినిపించ గలిగింది.
ఈ విజయంతో 5 రౌండ్లలో 4 పాయింట్లతో అప్ఘన్ జట్టు 6వ స్థానంలో కొనసాగుతుండగా..వరుసగా మూడు పరాజయాలు పొందిన పాక్ జట్టు 5వ స్థానానికి పడిపోయింది.
దక్షిణాఫ్రికాతో జరిగే పోరులో పాక్ జట్టు నెగ్గకుంటే నాకౌట్ రౌండ్ చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్ర్రమించే ప్రమాదం పొంచిఉంది.