Telugu Global
Sports

రెజ్లర్లు వారి పతకాలను గంగలో పడేస్తే మనమేం చేస్తాం.. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన బ్రిజ్ భూషణ్

బ్రిజ్ భూషణ్ మాత్రం రెజ్లర్లను మరింత రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..రెజ్లర్లు వారి పతకాలను గంగలో పడేయాలని వెళ్లి.. వాటిని పడేయకుండా వాటిని రైతు సంఘం నేత రాకేష్ టికాయత్ కు ఇచ్చారన్నారు.

రెజ్లర్లు వారి పతకాలను గంగలో పడేస్తే మనమేం చేస్తాం.. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన బ్రిజ్ భూషణ్
X

రెజ్లర్లు వారి పతకాలను గంగలో పడేస్తే మనమేం చేస్తాం.. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన బ్రిజ్ భూషణ్

భారత రెజ్లర్ల సమాఖ్య అధ్యక్షుడు, ఎంపీ బ్రిజ్ భూషణ్ తమను లైంగికంగా వేధించాడని.. అతడిని అరెస్టు చేయాలని రెజ్లర్లు గ‌త కొంతకాలంగా ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. వీరెన్ని నిరసన కార్యక్రమాలు చేప‌ట్టినా.. కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇటీవల నూతన పార్లమెంట్‌ ప్రారంభోత్సవం జరగగా.. అక్కడ నిరసన తెలిపేందుకు వచ్చిన రెజ్లర్లపై పోలీసులు దాడి చేశారు. దీంతో రెజ్లర్లు మనస్తాపానికి గురయ్యారు. ఇందుకోసమేనా తాము దేశం కోసం పతకాలు సాధించింది అని ఆవేదన వ్యక్తం చేశారు.

తమ పట్ల ఇంత జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై నిరసనగా తాము సాధించిన పతకాలను గంగలో పడేయాలని రెజ్లర్లు నిర్ణయించుకున్నారు. మంగళవారం పతకాలతో రెజ్లర్లు హరిద్వార్ దగ్గరికి రాగా.. రైతు సంఘాల నేతలు వారిని వారించారు. దీంతో రెజ్లర్లు ఆగిపోయారు. తమను వేధించిన బ్రిజ్ భూషణ్ పై ఐదు రోజుల్లో చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి రెజ్లర్లు అల్టిమేటం జారీ చేశారు.

ఇదిలా ఉంటే.. బ్రిజ్ భూషణ్ మాత్రం రెజ్లర్లను మరింత రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..రెజ్లర్లు వారి పతకాలను గంగలో పడేయాలని వెళ్లి.. వాటిని పడేయకుండా వాటిని రైతు సంఘం నేత రాకేష్ టికాయత్ కు ఇచ్చారన్నారు. ఇది వారి నిర్ణయం.. మనమేం చేయగలం? అని వ్యాఖ్యానించారు. రెజ్లర్లు ఈ విధంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారో తెలియడం లేదన్నారు. దీనికి వారు మాత్రమే సమాధానం చెప్పగలరన్నారు. వారు చేసిన డిమాండ్ మేరకే తనపై ఎఫ్ఐఆర్ నమోదైందన్నారు.

ఢిల్లీ పోలీసులు కేసును దర్యాప్తు జరుపుతున్నారని.. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూద్దామంటూ వ్యాఖ్యానించారు. తాను తన పదవికి రాజీనామా చేసే ప్రసక్తి లేదని బ్రిజ్ భూషణ్ స్పష్టం చేశారు. తన పదవీకాలం ముగిసిందని.. త్వరలో ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. పోలీసుల దర్యాప్తులో తాను తప్పు చేసినట్లు తేలితే తనను అరెస్టు చేస్తారని, దీనివల్ల తనకు ఎలాంటి సమస్య లేదని బ్రిజ్ భూషణ్ పేర్కొన్నారు.

First Published:  31 May 2023 12:19 PM IST
Next Story