Telugu Global
Sports

వెస్టిండీస్‌కు క్రికెటర్ల కరువు.. ప్రపంచకప్‌కు ముందే గందరగోళం

ఆస్ట్రేలియా వేదికగా మరికొద్ది మాసాలలో ప్రారంభం కానున్న టీ-20 ప్రపంచకప్‌లో పాల్గొనటానికి నాణ్యమైన ఆటగాళ్లు అందుబాటులో లేక వెస్టిండీస్‌ సతమతమవుతోంది.

వెస్టిండీస్‌కు క్రికెటర్ల కరువు.. ప్రపంచకప్‌కు ముందే గందరగోళం
X


వెస్టిండీస్ కమ్ కరీబియన్...ఈ పేరు వినగానే 1970, 80 దశకాలలో ప్రపంచ క్రికెట్‌ను కంటి చూపుతో శాసించిన క్రికెట్ జట్టే మనకు కనిపిస్తుంది. క్లయివ్ లాయిడ్, గార్డన్ గ్రీనిడ్డ్, డెస్మండ్ హెయిన్స్, వివియన్ రిచర్డ్స్‌ , కోట్నీ వాల్ష్, యాండీ రాబర్ట్స్, మైకేల్ హోల్డింగ్, బ్రయన్ లారా, కీరాన్ పోలార్డ్ లాంటి ఎందరో గొప్పగొప్ప క్రికెటర్లను అందించిన వెస్టిండీస్ క్రికెట్ ప్రస్తుత పరిస్థితి ఇంత బతుకూ బతికి..అన్నట్లుగా తయారయ్యింది. ఆస్ట్రేలియా వేదికగా మరికొద్ది మాసాలలో ప్రారంభం కానున్న టీ-20 ప్రపంచకప్‌లో పాల్గొనటానికి నాణ్యమైన ఆటగాళ్లు అందుబాటులో లేక సతమతమవుతోంది.

కరీబియన్ క్రికెట్లోనే ఎందుకిలా?

అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న సామెత ప్రస్తుత వెస్టిండీస్ క్రికెట్‌కు అతికినట్లు సరిపోతుంది. అరివీరభయంకర క్రికెటర్లు క్రిస్ గేల్, కీరాన్ పోలార్డ్, ఆండ్రీ రస్సెల్, స్పిన్ జాదూ సునీల్ నరైన్, ఎవిన్ లూయిస్, లెండిల్ సిమ్మన్స్ లాంటి మేటి క్రికెటర్లున్నా..ప్రపంచకప్‌కు తగిన జట్టును సిద్ధం చేయటానికి వెస్టిండీస్ ప్రధాన కోచ్‌ ఫిల్ సిమ్మన్స్ నానా పాట్లు పడుతున్నారు. రోజులు మారిపోయాయని, కరీబియన్ క్రికెట్లో ప్రస్తుతం యాచనపర్వం కొనసాగుతోందని సిమ్మన్స్ వాపోతున్నారు. నిధుల కొరతతో సతమతమవుతున్న వెస్టిండీస్ క్రికెట్ బోర్డును తమ స్థాయికి తగ్గట్టుగా మ్యాచ్ ఫీజులు చెల్లించాలంటూ ఓ వైపు క్రికెటర్లు అర్థిస్తుంటే...మరోవైపు ప్రపంచకప్‌లో పాల్గొనే వెస్టిండీస్ జట్టులో చేరాలని, సెలెక్షన్ కు అందుబాటులో ఉండాలంటూ అగ్రశ్రేణి ఆటగాళ్లను చీఫ్ కోచ్ సిమ్మన్స్ యాచిస్తున్నారు. అక్టోబర్ లో జరిగే ప్రపంచకప్ కు తగిన జట్టును సిద్ధం చేయటం తలకు మించిన భారంగా మారిందని, పలువురు కీలక ఆటగాళ్లు గాయాల బారిన‌ప‌డ‌టం, మరికొందరు స్టార్ క్రికెటర్లు విదేశీ లీగ్‌లకు ఇచ్చిన ప్రాధాన్యం వెస్టిండీస్ జట్టుకు ఆడటానికి ఇవ్వకపోవడం ఆవేదన కలిగిస్తోందంటూ వాపోతున్నారు.

క్రికెటర్లకు అంతంత మాత్రం ఆదాయమే...

క్రికెట్ ప్రపంచంలో వెస్టిండీస్ గా కనపడుతున్న వెస్టిండీస్ మనకు ప్రపంచ పటంలో భూతద్దం పెట్టి వెతికినా కనిపించదు. కరీబియన్ ద్వీప దేశాలు ఆంటీగా, జమైకా, బార్బడోస్, గయానా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ కలసి క్రికెట్ కోసం ఏర్పాటు చేసుకొన్నదే వెస్టిండీస్ క్రికెట్ బోర్డు. కరీబియన్ ప్రాంత దేశాలకు చెందిన ప్రతిభావంతులైన క్రికెటర్ల సమాహారమే వెస్టిండీస్ క్రికెట్ జట్టు. అయితే...కాలం మారింది. సరదాగా ఆడే క్రికెట్ తమ కడుపు నింపకపోడంతో కరీబియన్ దేశాల యువత..క్రికెట్‌ను విడిచి బాస్కెట్ బాల్ వైపు మళ్లీపోతున్నారు. దీనికి తోడు..ఆటగాళ్లకు తమకు నచ్చినచోట ఆడుకొనే వెసలుబాటు, స్వేచ్ఛ ఉండడంతో...ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలలో జరుగుతున్న టీ-20 లీగ్‌ల్లో లాభసాటి కాంట్రాక్టులతో ఆడటానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. వెస్టిండీస్ క్రికెట్ కంటే తమకు వ్యక్తిగత ప్రయోజనాలే ముఖ్యమని కరీబియన్ క్రికెటర్లు చెప్పకనే చెబుతున్నారు.

వెస్టిండీస్ వద్దు...విదేశీలీగ్ లే ముద్దు!

స్టార్ ఆల్ రౌండర్ ఆండ్రీ రస్సెల్, మ్యాజిక్ స్పిన్నర్ సునీల్ నరైన లాంటి ప్రపంచ మేటి ఆటగాళ్లు వెస్టిండీస్ జట్టులో సభ్యులుగా ఉండటాని కంటే ..విదేశీ లీగ్ జట్లకు ఆడటానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇవిన్ లూయిస్, ఓషానే థామస్ లాంటి మరికొందరు కీలక క్రికెటర్లు..ఫిట్‌నెస్ టెస్టులకు హాజరుకాకుండా వెస్టిండీస్ క్రికెట్ బోర్డుతో దాగుడుమూతలాడుతున్నారు. మరోవైపు..షెల్డన్ కోట్రెల్, ఫేబియన్ అలెన్, రోస్టన్ చేజ్ లాంటి మరికొందరు కీలక ఆటగాళ్లు గాయాలతో జట్టుకు అందుబాటులో లేకుండాపోయారు. భారత్‌తో ఇటీవలే ముగిసిన పాంచ్ పటాకా టీ-20 సిరీస్‌లో 1-4తో పరాజయం పొందిన జట్టు ఆటగాళ్లతోనే న్యూజిలాండ్‌తో వెస్టిండీస్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో తలపడుతోంది. ప్రపంచకప్‌కు అత్యుత్తమ జట్టునే అందుబాటులో ఉంచాలన్న తన లక్ష్యం నెరవేరేలా కనిపించడం లేదంటూ చీఫ్ సెలెక్టర్ డెస్మండ్ హేన్స్, చీఫ్ కోచ్ ఫిల్ సిమ్మన్స్ వాపోతున్నారు. నికోలస్ పూరన్, జేసన్ హోల్డర్, హెట్ మేయర్ లాంటి ఆటగాళ్లే ప్రస్తుత వెస్టిండీస్ క్రికెట్‌కు పెద్ద దిక్కుగా కనిపిస్తున్నారు. వన్డే, టీ-20 ఫార్మాట్లలో రెండేసి సార్లు విశ్వవిజేతగా నిలిచిన వెస్టిండీస్... 2022 ప్రపంచకప్‌కు నాసిరకం జట్టుతోనే బరిలో నిలిచినా ఆశ్చర్యపోనక్కరలేదు.

First Published:  11 Aug 2022 1:08 PM IST
Next Story