Telugu Global
Sports

విశాఖ చేజారిన టెస్ట్ మ్యాచ్, మూడోటెస్ట్ వేదిక ఇండోర్

ఆస్ట్ర్రేలియాతో నాలుగుమ్యాచ్ ల టెస్టు సిరీస్ లోని మూడో టెస్టు వేదికను మార్చినట్లు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది

విశాఖ చేజారిన టెస్ట్ మ్యాచ్, మూడోటెస్ట్ వేదిక ఇండోర్
X

ఆస్ట్ర్రేలియాతో నాలుగుమ్యాచ్ ల టెస్టు సిరీస్ లోని మూడో టెస్టు వేదికను మార్చినట్లు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ స్టేడియంలో నిర్వహించాల్సిన ఈ మ్యాచ్ ను..ఇండోర్ లోని హోల్కార్ స్టేడియం వేదికగా నిర్వహిస్తారు.

ధర్మశాలకు శీతాకాలం దెబ్బ..

ఐసీసీ టెస్టు లీగ్ లో భాగంగా భారత్- ఆస్ట్ర్రేలియా జట్ల నాలుగుమ్యాచ్ ల (బోర్డర్ -గవాస్కర్ ట్రోఫీ ) టెస్టు సిరీస్ మూడోమ్యాచ్ వేదికను మార్చుతూ బీసీసీఐ నిర్ణయిం తీసుకొంది.

ముందుగా నిర్ణయించిన కార్యక్రమం ప్రకారం మార్చి 1 నుంచి 5 వరకూ హిమాలయ పర్వతపాదాలలోని ధర్మశాల క్రికెట్ స్టేడియం వేదికగా మూడోటెస్ట్ మ్యాచ్ జరగాల్సి ఉంది.

అయితే..ఉత్తరభారతంలో నెలకొన్న శీతాకాలం తీవ్రత కారణంగా ధర్మశాల స్టేడియంలోని పిచ్, అవుట్ ఫీల్డ్ ను టెస్టు మ్యాచ్ కు అనువుగా తీర్చిదిద్దటంలో పిచ్ క్యూరేటర్ విఫలమయ్యారు.

తగిన ఎండవేడిమి లేకపోడంతో స్టేడియం అవుట్ ఫీల్డ్ టెస్ట్ మ్యాచ్ కు తగ్గట్టుగా లేకుండాపోయిందని బీసీసీఐ చీఫ్ క్యూరేటర్ తపస్ చటర్జీ ప్రకటించారు. ధర్మశాల స్టేడియం పిచ్, అవుట్ ఫీల్డ్ టెస్టు క్రికెట్ మ్యాచ్ కు తగ్గట్టుగా లేవని పరిశీలన అనంతరం నివేదిక సమర్పించారు.

ధర్మశాల స్టేడియం మైదానంలో పచ్చిక స్థాయికి తగ్గట్టుగా లేదని, నిరంతరం పడుతున్న మంచు, తీవ్రశీతాకాల వాతవరణ పరిస్థితుల నేపథ్యంలో గ్రౌండ్ ను టెస్టు మ్యాచ్ కు తగ్గట్టుగా రూపొందించలేకపోయినట్లు తెలిపారు.

విశాఖ చేజారిన టెస్టు మ్యాచ్...

ఒకవేళ ధర్మశాల స్టేడియం మ్యాచ్ నిర్వహించడానికి అనువుగా లేకుంటే..ప్రత్యామ్నాయ వేదికలుగా విశాఖలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి స్డేడియం, రాజ్ కోటలోని సౌరాష్ట్ర్ర క్రికెట్ స్టేడియం, ఇండోర్ లోని హోల్కార్ స్టేడియంలను బీసీసీఐ పరిశీలించింది. భారత లక్కీగ్రౌండ్ గా పేరున్న విశాఖ వేదికగా ప్రస్తుత సిరీస్ లోని మూడోటెస్టు మ్యాచ్ ను నిర్వహించడం ఖాయమని భావించారు.

అయితే..విశాఖ, రాజ్ కోట్ లను పక్కన పెట్టి ఇండోర్ వైపే బీసీసీఐ మొగ్గుచూపింది.

ఢిల్లీకి దగ్గరగా ఉండటమే కారణమా!

భారత్- ఆస్ట్ర్లేలియాజట్ల నాలుగుమ్యాచ్ ల సిరీస్ లోని రెండోటెస్ట్ మ్యాచ్ ఫిబ్రవరి 17 నుంచి ఐదురోజులపాటు జరుగనుంది. ఈ మ్యాచ్ తర్వాత..సిరీస్ లోని మూడోటెస్టు మ్యాచ్ మార్చి 1న ధర్మశాల వేదికగా జరగాల్సి ఉంది. అయితే..టెస్టు మ్యాచ్ నిర్వహించడానికి గ్రౌండ్ అనువుగా లేని కారణంగా..ప్రత్యామ్నాయ వేదికగా ఇండోర్ ను ఎంపిక చేశారు.

ఢిల్లీ నుంచి రెండుగంటల ప్రయాణ దూరంలో ఇండోర్ ఉండడంతో హోల్కార్ స్టేడియం వైపే బీసీసీఐ మొగ్గుచూపినట్లు భావిస్తున్నారు. రెండుజట్లు ఢిల్లీ నుంచి ఇండోర్ చేరుకోటానికి పెద్దగా శ్రమించాల్సిన పనిలేదని, పైగా క్రికెటర్ల విలువైన సమయం వృధా కాకుండా ఉంటుందని బోర్డు వర్గాలు అంటున్నాయి.

నాగపూర్ విదర్భ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన తొలిటెస్టు మ్యాచ్ మూడురోజుల్లోనే ముగిసిపోడం, భారత్ ఇన్నింగ్స్ 132 పరుగుల భారీవిజయంతో సిరీస్ పై 1-0తో భారత్ పట్టు బిగించగలిగింది.

మొత్తం 20 వికెట్లలో భారత స్పిన్నర్ల త్రయం అశ్విన్, జడేజా, అక్షర్ పటేల్ 15 వికెట్లు పడగొట్టటం విశేషం. సిరీస్ లోని మిగిలిన టెస్టు వేదికల్లో సైతం స్పిన్ బౌలర్లకు

అనువుగా ఉండే పిచ్ లనే క్యూరేటర్లు సిద్ధం చేయనున్నారు.

మూడోటెస్టు మ్యాచ్ కు వేదికగా ఆఖరి నిముషంలో ఎంపికైన ఇండోర్ హోల్కార్ స్టేడియానికి బ్యాటర్ల స్వర్గధామంగా పేరుంది. అతిచిన్న గ్రౌండ్ కావడంతో తక్కువ నిడివి కలిగిన బౌండ్రీలు ఉండడంతో భారీస్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. పేసర్లతో పాటు స్పిన్ బౌలర్లకు సైతం అనుకూలించే వాతావరణం ఇండోర్ స్టేడియంలో ఉంటుంది.

భారతజట్టు ఐసీసీ టెస్టు లీగ్ ఫైనల్స్ చేరాలంటే ఆస్ట్ర్రేలియాతో జరుగుతున్న ప్రస్తుత సిరీస్ లో 2-1 లేదా 3-1 విజయంతో గెలిచి తీరాల్సి ఉంది.

First Published:  13 Feb 2023 1:13 PM IST
Next Story