Telugu Global
Sports

విరాట్ కు ఏకైక ఆప్తుడు ధోనీ!

విరాట్ కొహ్లీ ఎట్టకేలకు తన మనసు విప్పాడు. తన నిజమైన శ్రేయోభిలాషి, ఆత్మబంధువు ఎవరో తెలుసుకొన్నాడు

Virat Kohli and MS Dhoni
X

Virat Kohli and MS Dhoni

విరాట్ కొహ్లీ ఎట్టకేలకు తన మనసు విప్పాడు. తన నిజమైన శ్రేయోభిలాషి, ఆత్మబంధువు ఎవరో తెలుసుకొన్నాడు. దుబాయ్ లో జరిగిన మీడియా సమావేశంలో తన ఆక్రోశం వెళ్లగక్కాడు...

గొప్ప గొప్ప క్రీడాకారులైనా, లక్షలాదిమంది అభిమానులు, వందలకోట్ల రూపాయల సంపాదనతో ఓ వెలుగు వెలుగుతున్న స్టార్ క్రికెటర్లయినా సాధారణ మనుషులే.

ఆటపోట్లు ఎదురైన సమయంలో భావోద్వేగాలకు గురికావడం సహజమే. దానికి భారత సూపర్ స్టార్ క్రికెటర్ విరాట్ కొహ్లీ సైతం ఏమాత్రం మినహాయింపు కాదు.

ఆసియాకప్ తో కొత్త ఊపిరి...

అంతర్జాతీయ క్రికెట్లో గత మూడేళ్లుగా వరుస వైఫల్యాలతో గడ్డు పరిస్థితి ఎదుర్కొంటూ వస్తున్న విరాట్ కొహ్లీ గత కొద్దిమాసాలుగా ఒంటరివాడైపోయాడు. చుట్టూ ఎందరున్నా తాను ఒంటిరివాడినేనన్న భావన బలంగా నాటుకుపోయింది.

బ్యాటింగ్ కష్టాల నుంచి విరాట్ బయట పడాలంటే తనతో 30 నిముషాల సమయం ఏకాంతంగా మాట్లాడితే చాలునంటూ భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ మీడియా ద్వారా ప్రకటిస్తే...పలువురు ఆస్ట్ర్రేలియా, ఇంగ్లండ్ క్రికెట్ దిగ్గజాలు మాత్రం..ఆటకు కొంతకాలం దూరంగా ఉంటే మంచిదంటూ సలహాలు సూచనలూ ఇస్తూ వచ్చారు.

దీనికితోడు బీసీసీఐ చైర్మన్ సౌరవ్ గంగూలీ మాత్రం..స్థాయికి తగ్గట్టుగా ఆడలేకపోతే పలువురు యువక్రికెటర్లు సిద్ధంగా ఉన్నారంటూ కొహ్లీకి హెచ్చరికలు జారీ చేశారు.

ఇక...భారత కెప్టెన్ రోహిత్ శర్మ, ప్రధాన శిక్షకుడు రాహుల్ ద్రావిడ్ మాత్రం...గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్న కొహ్లీకి అండగా నిలుస్తూ వచ్చారు.

నెలరోజుల విరామం తర్వాత ఎమిరేట్స్ వేదికగా జరుగుతున్న 15వ ఆసియాకప్ టోర్నీ బరిలోకి దిగిన విరాట్ ..చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో జరిగిన గ్రూప్ లీగ్ తొలిమ్యాచ్ ద్వారా తన పరుగుల వేట మొదలు పెట్టాడు. 35 పరుగుల స్కోరు సాధించాడు. హాంకాంగ్ పైన అజేయ హాఫ్ సెంచరీ, పాక్ తో సూపర్-4 రౌండ్ మ్యాచ్ లో మరో సూపర్ హాఫ్ సెంచరీతో తిరిగి ఫామ్ ను అందిపుచ్చుకోగలిగాడు. మొదటి మూడుమ్యాచ్ ల్లోనే 154 పరుగులు సాధించడం ద్వారా ఊపిరి పీల్చుకోగలిగాడు.

ధోనీని గుర్తు చేసుకొన్న కొహ్లీ...

పాకిస్థాన్ తో సూపర్ -4 రౌండ్ మ్యాచ్ ముగిసిన వెంటనే జరిగిన మీడియా సమావేశంలో భారత్ తరపున విరాట్ పాల్గొన్నాడు. ఒక్కసారిగా ఏదో తెలియని భావోద్వేగానికి గురయ్యాడు. తన శ్రేయోభిలాషి, ఆత్మబంధువు ఎవరైనా ఉంటే...అది కేవలం మహేంద్ర సింగ్ ధోనీ మాత్రమేనంటూ పరోక్షంగా తన మనసులో మాట బయటపెట్టాడు.

తనకు మీడియా ముఖంగా సలహాలు, సూచనలు ఇచ్చేవారు ఎక్కువయ్యారని, తనతో వ్యక్తిగతంగా కొద్దినిముషాలపాటు మాట్లాడి స్వాంతన చేకూర్చేవారే లేకుండా పోయారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.

తాను టెస్ట్ కెప్టెన్సీకి రాజీనామా చేసిన సమయంలో, విచారంలో కూరుకుపోయిన సమయంలో ధోనీ మాత్రమే తనకు ఫోను ద్వారా ఓ సందేశాన్ని పంపడం ద్వారా ఊరట కలిగించాడని గుర్తు చేసుకొన్నాడు. తన ఫోన్ నంబర్ చాలమంది దగ్గర ఉన్నా..వారిలో ఏ ఒక్కరూ తనతో మాట్లాడటం కానీ, సందేశం పంపడం కానీ చేయలేకపోయారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.

తాను కష్టాలలో ఉన్నసమయంలో తన బాధను కేవలం ధోనీ మాత్రమే పంచుకొన్నాడని, తనతో కలసి క్రికెట్ ఆడుతున్న మిగిలిన వారెవ్వరూ ఆ పని చేయలేదని చెప్పుకొచ్చాడు.

తనకు సలహాలు, సూచనలు ఎవ్వరూ ఇచ్చినా స్వీకరిస్తానని...అయితే ఒంటరితనంతో కృంగిపోయిన సమయంలో వ్యక్తిగతంగా కలసి ఒకరితో ఒకరు మాట్లాడుకొంటే వచ్చే ధైర్యం, మనోబలం వేరని కొహ్లీ తెలిపాడు.

ద్రావిడ్, రోహిత్ కు హ్యాట్సాఫ్...

క్రికెట్లో ఏ జట్టైనా గెలుపుకోసమే ఆడుతుందని, అలాగే క్రికెటర్లందరూ అత్యుత్తమంగా రాణించడానికే పాటుపడతారని, తప్పులు చేయటం సహజమని..అలాంటి సమయంలోనే జట్టు సభ్యులు, టీమ్ మేనేజ్ మెంట్ అండగా నిలవాలని సూచించాడు. ప్రస్తుత టీమ్ మేనేజ్ మెంట్ తో పాటు చీఫ్ కోచ్ రాహుల్ ద్రావిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ డ్రెస్సింగ్ రూమ్ లో సుహృద్భావ వాతవరణం కల్పిస్తూ...సహఆటగాళ్లలో మనోస్థైర్యం నింపుతున్నారంటూ ప్రశంసించాడు.

హార్థిక్ పాండ్యా ఆల్ రౌండర్ గా ఇప్పుడు ఎంతో గొప్పగా, బాధ్యతాయుతంగా ఆడుతున్నాడని, గత ఐపీఎల్ తో అతని ఆటతీరే మారిపోయిందంటూ కొహ్లీ కొనియాడాడు.

ఇక..సూపర్ హిట్టర్ సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ గురించి ఎంత చెప్పుకొన్నా అది తక్కువేనని, అతను గ్రౌండ్ నలుమూలలకూ...360 డిగ్రీల కోణంలో అలవోకగా షాట్లు కొడుతున్న తీరు అబ్బురమని పిస్తోందని, నాన్ స్ట్రయికర్ గా ఉంటూ సూర్య షాట్లను చూస్తూ మైమరచిపోవాల్సిందేనంటూ ప్రశంసలతో ముంచెత్తాడు.

గత ఏడాది టీ-20 ప్రపంచకప్ ఓటమితో భారత జట్టు కెప్టెన్సీని కోల్పోయిన విరాట్ ఆ తర్వాత...టెస్టుజట్టు నాయకత్వాన్ని సైతం చేజార్చుకోవాల్సి వచ్చింది. అంతర్జాతీయ క్రికెట్ తన 14 సంవత్సరాల కెరియర్ లో 70 శతకాలు సాధించిన కొహ్లీ...చివరిసారిగా 2019లో ఆఖరి సెంచరీ నమోదు చేశాడు. ఆ తర్వాత మరో శతకం సాధించి ఇప్పటికే వెయ్యిరోజులకు పైగా సమయం దాటిపోయింది.

అయితే...ప్రస్తుత ఆసియాకప్ టోర్నీలో గత ఆరుమాసాల విరామం తర్వాత ఏకంగా రెండు అర్ధశతకాలు సాధించిన విరాట్ కొహ్లీ...అంతర్జాతీయ టీ-20 చరిత్రలో అత్యధికంగా 32 అర్ధసెంచరీలతో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. మరో రెండు సిక్సర్లు బాదగలిగితే...టీ-20 ఫార్మాట్లో వంద సిక్సర్ల మైలురాయిని సైతం విరాట్ చేరుకోగలుగుతాడు.

First Published:  5 Sept 2022 12:00 PM IST
Next Story